రేపు బాపట్లలో సీఎం జగన్ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు.. వివిధ వర్గాలకు శుభవార్త చెబుతూ.. సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూనే ఉన్నారు.. ఇక, ఇప్పుడు విద్యార్థులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.. రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభిస్తారు.. ఇక, ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలోని నాలుగు లక్షల 60వేల మంది విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ జరగనుంది.. అంతేకాదు, హైస్కూళ్లలోని 60 వేల మంది టీచర్లకు కూడా ప్రభుత్వం ట్యాబ్‌లు అందిస్తోంది. ఇక, రేపటి నుంచి వారం రోజుల పాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు అధికారులు.. ట్రయల్ మెథడ్‌లో నిడమానూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు పంపిణీ చేశారు.. ఆఫ్ లైన్ ఫార్మెట్‌లో ట్యాబ్‌లు అందిస్తారు.. బైజూస్ కంటెంట్‌ని అప్‌లోడ్ చేసిన ఆ ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నారు.. కోర్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠాల వీడియోలు, ఎక్సర్‌సైజులు ఆ ట్యాబ్‌లలో పొందుపర్చనున్నారు. విద్యార్ధుల లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ట్యాబ్‌లు పెంచుతాయని అంచనా వేస్తున్నారు.. అయితే, రేపు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటించనున్నారు సీఎం జగన్.. యడ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు..
3 రాజధానులు పెడితే ఎక్కడికి వెళ్లాలి..?
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై హాట్ కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతి రాజు.. ఒక రాజధానిగా ఉన్నా.. ఇప్పుడే ఏ అధికారి దొరకడం లేదు.. మూడు రాజధానులు చేస్తే ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి..? అని నిలదీశారు.. కేంద్రం ఇచ్చిన నిధులను ఏమి చేస్తున్నారు? అని మండిపడ్డ ఆయన.. రాజధానిని మూడు ముక్కలు చేస్తే వికేంద్రీకరణ అని అంటారా? అంటూ ఎద్దేవా చేశారు.. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే లాజిక్‌లో వెళ్లి.. రాజధానిని కూడా వేరే వేరే ప్రదేశాల్లో పెడితే ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు. ఇక, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ శంకుస్థాపన చేయడం విడ్డూరం అంటూ మండిపడ్డారు అశోక్ గజపతిరాజు.. గత టీడీపీ ప్రభుత్వంలో.. భూ సేకరణ చేసి శంకుస్థాపన కూడా చేశాం.. ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన అంటే అర్థంలేదన్నారు.. మరోవైపు.. వైసీపీ నేతల భాషపై స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వం భాష గురించి మాట్లాడటం గమ్మత్తుగా ఉందన్నారు.. సరైన భాషను ఉపయోగించాలని వైసీపీ వాళ్లే చెబుతున్నారు.. కానీ, వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు.. సర్పంచ్ లకు విలువ లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.. జిల్లాలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తాం.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాన్ని చేపట్టారు.. ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు అంటూ వైసీపీ నేతలకు సూచనలు చేశారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.
ఏపీలో విచిత్ర ఘటన.. నాలుగేళ్లుగా తల్లి, కూతురు ఇంటికే పరిమితం
కోవిడ్ భయంతో ఇంటికే పరిమితం అయ్యారు ఓ తల్లి, కూతురు.. కాకినాడ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది… కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంటికి పరిమితమయ్యారు కుయ్యేరు గ్రామానికి చెందిన తల్లి మణి, కూతరు దుర్గాభవాని.. కరోనా సమయంలో బయటికి రాకూడదు.. బయట అడుగుపెడితే వైరస్ సోకుతుందని భయపడిపోయారు.. అదే భయం వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది.. అప్పటినుండి ఇంట్లో ఒక హాల్‌లోనే ఉండిపోయారు ఇద్దరు.. అయితే, వారికి భోజనం అందిస్తూ వస్తున్నాడు మణి భర్త… బయటకు వస్తే కరోనా వస్తుంది అని భయంతో వణికిపోతున్న తల్లి కూతుళ్లు.. కిటికీలోంచి ఎవరైనా మాట్లాడినా దుప్పటి లోపలే ఉండి సమాధానం చెబుతున్నారు.. ఆ ఇద్దరిని చూసి దాదాపు రెండేళ్లు గడిచిందని స్థానికులు చెబుతున్నారు.. అయితే, వారం రోజుల నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.. తండ్రిని కూడా ఇంటిలోపలికి రానివ్వడంలేదు.. మరోవైపు.. తల్లి మణి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.. దీనిపై వైద్యులకు సమాచారం అందించారు.. వైద్య సిబ్బంది ఇంటి లోపలికి వెళ్లి బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా బయటకు రావడానికి నిరాకరిస్తున్నారు. ఓవైపు కరోనా తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చినా.. ఇంకా ఇలాంటి పరిస్థితి ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.
శాలిని కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. కిడ్నాపర్‌తో యువతికి ఆల్రెడీ పెళ్లి
రాజన్న సిరిసిల్లా జిల్లాలో సంచలనం సృష్టించిన శాలిని కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. కిడ్నాపర్ జాన్‌కి, శాలినికి ఇదివరకే పెళ్లి అయినట్లు తేలింది. అయితే.. శాలిని మైనర్ కావడం, ఈ పెళ్లి కూడా ఇష్టం లేకపోవడంతో యువతి తల్లిదండ్రులకు కేసు పెట్టారు. ఈ కేసులో జాన్ పది నెలల జైలు శిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత జాన్ మళ్లీ శాలినికి దగ్గర అవుతుండడంతో.. తల్లిదండ్రులకు ఆమెకు మరో యువకుడితో నిన్న (సోమవారం) నిశ్చితార్థం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న జాన్.. పక్కా ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ వ్యవహారానికి తెరలేపాడు. తెల్లవారుజామున ఆలయంలో పూజ ముగించుకొని శాలిని బయటకు రాగానే.. ఆమె తండ్రి ముందే తన స్నేహితుల సహకారంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. శాలిని ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఫిఫా వరల్డ్‌కప్ ఫీవర్.. జెర్సీలతో పెళ్లి పీటలెక్కిన వధూవరులు
కేరళలోని నూతన వధూవరులు ఫుట్‌బాల్ క్రీడపై తమకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటి చెప్పారు. కేరళకు చెందిన సచిన్, అథీరాలకు ఆదివారం పెళ్లి జరిగింది. అదే రోజు ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే.. వీళ్లు పెళ్లి పీటలపై సంప్రదాయ దుస్తులతో పాటు తమతమ అభిమాన ఫుట్‌బాల్ స్టార్ల జెర్సీలు వేసుకోవడం, ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలిచింది. సచిన్‌కి అర్జెంటీనా స్టార్ మెస్పీ జెర్సీని వేసుకోగా, ఫ్రెంచ్ స్టార్ ఎంబాపే జెర్సీని అథీరా ధరించి.. పెళ్లి పీటలెక్కారు. పెళ్లి తంతుతో పాటు విందు పూర్తైన వెంటనే.. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు కొత్త దంపతులు కొచ్చి నుంచి 206 కీలోమీటర్ల దూరంలో ఉన్న వరుడి ఇంటికి చేరుకున్నారు. చివరకు అర్జెంటీనా విజయం సాధించిన తర్వాత.. సంబరాలు జరుపుకున్నారు.
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఒక నైజీరియన్‌తో పాటు మరో నిందితుడ్ని పట్టుకున్నారు. నిందితుల నుండి 30 గ్రాముల ఎండీఎంఏ, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అటు.. మరో కేసులోనూ అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయ్యింది. రాజస్థాన్ నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తుండగా.. పోలీసులు ఆ ముఠాని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 45 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రాజ్యసభ ప్యానల్‌వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి, పీటీ ఉష
రాజ్యసభ ప్యానల్‌వైస్ చైర్మన్‌గా మళ్లీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని నియమించారు.. అయితే, 10 రోజుల క్రితం సాయిరెడ్డిని.. వైస్ చైర్మన్‌గా నియమించినా.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆయన పేరు తొలగించారు. అయితే, ఇప్పుడు మళ్లీ రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమించారు.. సాయిరెడ్డితో పాటు.. పీటీ ఉషను కూడా ప్యానల్‌వైస్ చైర్మన్‌గా నియమిస్తూ.. రాజ్యసభలో ప్రకటించారు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్.. దీంతో.. విజయసాయి రెడ్డి, పీటీ ఉషను రాజ్యసభ ఎంపీలు అభినందించారు.. వారికి ధన్యవాదాలు తెలిపారు ఇద్దరు ఎంపీలు.. అయితే, తొలిసారిగా నామినేటెడ్ ఎంపీని ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియమించినట్లు జగదీప్ ధన్కర్ వెల్లడించారు..
బాలయ్య ముందే ఓపెన్‌గా..
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’లో ఈ వీక్ ఫుల్ గ్లామర్ షోకు ప్రాధాన్యమిచ్చారు. అలనాటి అందాల భామలు జయసుధ, జయప్రదతో పాటు టాలీవుడ్ హాట్ బ్యూటీ రాశీఖన్నా సైతం ఈ షోలో పాల్గొంది. ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ చిత్రంలో జయసుధ లక్ష్మీదేవిగా, జయప్రద పద్మావతిగా నటించగా, నందమూరి బాలకృష్ణ నారదుడి పాత్ర పోషించి, వారిద్దరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా బాలకృష్ణ నటించిన పలు చిత్రాలలో జయసుధ ఉన్నారు. ‘అనురాగదేవత, భారతంలో అర్జునుడు, రూలర్’ వంటి సినిమాలలో వీరు కలిసి నటించారు. అయితే, ‘అధినాయకుడు’లో బాలకృష్ణ భార్యగా జయసుధ నటించడం విశేషం. జయప్రద ‘మహారథి’ చిత్రంలో బాలకృష్ణ అత్తగా యాక్ట్ చేశారు. అయితే ఇటు జయసుధ, అటు జయప్రద ఇద్దరూ మహానటుడు ఎన్టీయార్ సరసన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఇక రాశీఖన్నాకు బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ మాత్రం ఇంకా దక్కలేదు. విశేషం ఏమంటే… ఈ ముగ్గురితో కలిసి నందమూరి అందగాడు బాలకృష్ణ ఈ షోలో కాలు కలిపి, స్టెప్పులేశారు. తన షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి జయసుధను పెళ్ళి కూతురు చేయడానికి వెళ్ళానని జయప్రద చెప్పగానే, అంటే కాంపిటీషన్ కు కట్ చేయడానికేగా అంటూ బాలకృష్ణ చురక అంటించారు. ఇంతవరకూ నటించిన హీరోలలో ఎవరితో క్రష్ ఉందని రాశీఖన్నాను అడగ్గానే, ఠక్కున ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పారు. మరి ఆమె మాటలకు రశ్మికా మందణ్ణ ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అవుతారేమో చూడాలి. మొత్తం మీద బాలకృష్ణ తనదైన శైలిలో స్పాంటేనియస్ గా పంచ్ లు వేసినట్టు తాజాగా విడుదలైన ‘అన్ స్టాపబుల్’ ప్రోమో చూస్తుంటే అర్థమౌతోంది. ఈ ఎపిసోడ్ 23వ తేదీ ఆహాలో టెలికాస్ట్ కాబోతోంది.
ఫ్యాన్స్‌కి పండగే..
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ కి దగ్గర చేసిన మొదటి సినిమా ‘ఒక్కడు’. ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ లాంటి ఫ్లాప్ అవ్వడంతో మహేశ్ బాబు, కృష్ణ లెగసీని క్యారీ చెయ్యలేకపోతున్నాడు అనే కామెంట్ వినిపించడం మొదలయ్యింది. ఈ కామెంట్స్ ని పర్మనెంట్ గా సమాధి చేసిన సినిమానే ‘ఒక్కడు’. స్పోర్ట్స్ ని, ఫ్యాక్షన్ డ్రామాని మిక్స్ చేసి ‘ఒక్కడు’ సినిమాని గుణశేఖర్ ఒక మాస్టర్ పీస్ లా తెరకెక్కించాడు. హీరో, విలన్ ట్రాక్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ ‘ఒక్కడు’ సినిమాలో కనిపిస్తాయి. అర్జున్, ఓబుల్ రెడ్డిల మధ్య సీన్స్ ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. బ్యూటిఫుల్ రైటింగ్, బెస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ తో పాటు ‘ఒక్కడు’ మూవీకి మరో ప్రధాన బలం ‘మణిశర్మ’ సంగీతం. పాటల నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకూ ప్రతి విషయంలో మణిశర్మ మ్యాజిక్ ‘ఒక్కడు’ సినిమాలో కనిపిస్తుంది. మహేశ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించిన ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొండారెడ్డి బుర్జు దగ్గర ఓబుల్ రెడ్డిని కొట్టి మహేశ్ బాబుని నిలబడితే థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇంత హై ఇచ్చిన కమర్షియల్ సినిమా అప్పట్లో మరొకటి లేదు. ‘ఒక్కడు’ మూవీ 2003 జనవరి 15న రిలీజ్ అయ్యింది, వచ్చే జనవరికి ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అవుతుండడంతో ‘ఒక్కడు’ రీరిలీజ్ కి రంగం సిద్ధమవుతోంది. జనవరి 7న ‘ఒక్కడు’ స్పెషల్ షోస్ వేస్తున్నట్లు నిర్మాత ‘ఎమ్మెస్ రాజు అఫీషియల్ గా ప్రకటించాడు.