ఆ లైబ్రరీకి నిత్యం చిరంజీవి, జూ.ఎన్టీఆర్ సహా ప్రముఖులు..! షాకైన మంత్రి..
ఉరవకొండ గ్రంథాలయం శిథిలం కావడంతో కొత్త భవనం నిర్మాణం నిమిత్తం పలు వివరాలతో రావాలని మంత్రి పయ్యావుల కేశవ్.. గ్రంథాలయ అధికారి ప్రతాపరెడ్డిని ఆదేశించారు.. గ్రంథాలయానికి నిత్యం వస్తున్న పాఠకుల రిజిస్టర్ తోపాటు నిల్వ ఉన్న పుస్తకాలు, ఇతరత్రా సమాచారంతో మంత్రి కార్యాలయానికి వెళ్లారు. పాఠకుల హాజరు పుస్తకాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా చదివారు. అందులో మాజీ మంత్రి దివంగత పరిటాల రవి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, సినీ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవితో పాటు ఇతర ప్రముఖులు పుస్తక పఠనానికి వచ్చినట్లు ఉంది. దీనిని పరిశీలించిన మంత్రి విస్తుపోయారు. వీరంతా గ్రంథాలయంలో పఠనానికి వస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించగా.. దానికి ప్రతాపరెడ్డి సమాధానం ఇవ్వలేని పరిస్థితి.. సంబంధిత అధికారి అలసత్వంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖుల పేర్లతో ఉన్న సంతకాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి కేసు నమోదు చేయాలని సీఐ మహానందిని మంత్రి ఆదేశించారు. వెంటనే సీఐ ఆ దస్త్రాలు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. అయిదే అది ఆకతాయిల పనా..? లేదా నిర్వాహకులే.. రిజిస్టర్‌లో ఎక్కువ పేర్లు కనబడాలని ఈ పని చేశారా? ఇంకా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది..
మనమంతా టీడీపీ కుటుంబ సభ్యులం.. ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం..
మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం.. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం అని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. పాల్వాయిగేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు వీరోచితంగా పోరాడారని అభినందించారు.. నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మాట్లాడిన మంత్రి లోకేష్.. శేషగిరిరావు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం అని, కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాం అన్నారు.. ఇక, కార్యకర్తలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు మంత్రి లోకేష్.. ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు లోకేష్.. 2024 ఎన్నికల సమయంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా పోలింగ్ ఏజెంట్ గా ఉన్నారు శేషగిరిరావు.. అయితే, రెండు నెలల క్రితం ఆయన గుండె పోటుతో మృతి చెందారు.. దివంగత శేషగిరిరావు సతీమణి కృష్ణవేణితో పాటు కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకున్న మంత్రి లోకేష్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. ఆ తర్వాత వారి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్..
విశాఖలో వైఎస్ జగన్ రోడ్‌షో..
విశాఖపట్నంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతోంది.. తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన. ఇక, విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి నర్సీపట్నం రోడ్డు మార్గాన బయల్దేరారు.. పోలీసులు షరతుల మధ్య జగన్ టూర్ పై ఉత్కంఠ కొనసాగుతుండగా.. పోలీసులు నిర్దేశించిన పెందుర్తి., అనకాపల్లి మీదుగా మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకోనున్నారు జగన్.. ఇక, కాకాని నగర్ దగ్గర వైఎస్ జగన్‌ను కలిశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు.. ఈ సందర్బంగా తమ సమస్యలపై జగన్‌కు వినతి పత్రం అందజేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.. 10 నిముషాలకు పైగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు జగన్.. స్టీల్ ప్లాంట్ పరిణామాలపై కార్మిక నేతల నుంచి సమాచారం తీసుకున్నారు మాజీ సీఎం.. ఆ తర్వాత రోడ్ షోలో జగన్ ను కలిశారు న్యాయవాదులు.. తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.. అండగా ఉంటానని లాయర్లకు హామీ ఇచ్చారు.. మరోవైపు, వైఎస్ జగన్‌ను కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు.. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు రాగా.. జి.భీమవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.. జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసుల అంటుండగా.. కలిసి తీరుతామని పట్టుబట్టారు మత్స్యకారులు. అయితే, వైఎస్ జగన్ రోడ్డు షోకు పెద్ద ఎత్తున తరలివచ్చారు వైసీపీ శ్రేణులు.. ఓవైపు పోలీసులు ఆంక్షలు ఉన్నా.. వాటిని లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో వచ్చి జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు.. ఇక, వారికి అభివాదం చేస్తూరోడ్‌లో ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్..
నకిలీ మద్యం తయారీ కేసు.. కీలక అంశాలు వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర..
నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.. ఈ కేసులోని పరిణామాలపై స్పందించిన ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో ఈ నెల 3న ఎన్‌ఫోర్స్‌మెంట్ ఒక నివేదిక ఇచ్చింది.. నకిలీ మద్యం తయారీకి సంబంధించి సమాచారం వచ్చింది. నకిలీ మద్యం సఫ్లయ్ చేసే వ్యాన్ లు కూడా ఐడెంటిపై చేసాం.. సంబంధిత అధికారులు దాడులు చేశారు. 30 క్యాన్ ల స్పిరిట్ ఉంది… వెంటనే విచారణకు ఆదేశాలు ఇచ్చాం అన్నారు.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన అద్దెపల్లి జనార్దన్ రావ్ కనుసన్నల్లోనే నకిలీ మద్యం వ్యవహారం జరిగిందని తెలిపారు కొల్లు రవీంద్ర.. తమిళనాడు, ఒడిశాకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు. తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాస్ కూడా ఉన్నారు అని వెల్లడించారు. రాక్ స్టార్, ఆంధ్ర వైన్స్.. రెండు కంపెనీలు ప్రధానంగా ఉన్నాయి.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావ్ కు షాపులు ఉన్నాయి అని పేర్కొన్నారు కొల్లు రవీంద్ర.. ఎక్సయిజ్ శాఖ ప్రస్తుతం చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం… అన్ని బ్రాండ్స్ మద్యం.. ప్రస్తుతం అందుబాటులో ఉంది. నకిలీ మద్యాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.. గత ప్రభుత్వంలో డిస్టీలరీస్ స్వాధీనం చేసుకున్నారన్న ఆయన.. సీఎం చంద్రబాబు నకిలీ మద్యం పై విచారణకు ఆదేశాలు ఇచ్చారు.. జయచంద్రా రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం.. అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించారు..
నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు..
గ్రూప్-1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు చాలా కార్యక్రమాలు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 15 తారీఖున డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. గ్రూప్1 నియామకాలపై సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో అనంతరం మీడియాతో మాట్లాడారు. అందుకే 15 వరకు కార్యక్రమాలు తీసుకుందామని నిర్ణయించినట్లు చెప్పారు. నిన్న విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పించి వారి సాక్షిగా పోరాటం ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపేందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్ -1 విషయంలో నోటిఫికేషన్ నాటి నుంచి రిజల్ట్స్ వరకు అడుగడుగునా తప్పులు జరిగాయన్నారు. ఆ తప్పులను తాను మండలిలో కూడా ఎత్తి చూపినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ తప్పులను ఎండగట్టాల్సిన అవసరముందని సూచించారు.
22 ఏళ్ల సినీ జర్నీ.. ప్రతి షాట్ నా జీవితాన్ని మార్చింది
దక్షిణాది సినీ పరిశ్రమలో “లేడీ సూపర్‌స్టార్”గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార అనితి కాలంలోనే అభిమానుల హృదయాలను గెలుచుకుంది. భాష పరిమితులు లేకుండా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో అగ్రనటులతో నటించి స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే తాజాగా ఆమె సినీ ప్రయాణం 22 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నయనతార సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ నోట్ పంచుకున్నారు. “మొదటి సారి కెమెరా ముందు నిల్చొని నేటికి 22 ఏళ్లు అయింది. సినిమాలే నా ప్రపంచమవుతాయని అప్పటికి తెలియదు. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్, ప్రతి మౌనం నన్ను మార్చేశాయి. నాకు ధైర్యాన్నిచ్చాయి, నన్ను నన్నుగా తీర్చిదిద్దాయి” అంటూ ఆమె రాసిన మాటలు అభిమానుల మనసులు హత్తుకుంటున్నాయి. 2003లో మలయాళ సినిమా ‘మనస్సినక్కరే’ ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టిన నయనతార, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేసిన ‘చంద్రముఖి’ ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత వరుస హిట్స్‌తో దక్షిణాది తెరపై తన ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలు, సీరియస్ రోల్స్, హారర్ కథలు, ఫ్యామిలీ డ్రామాలు ఇలా.. ఏ జానర్ అయినా నయనతారకు న్యాయం చేయగలదనే నమ్మకం ప్రేక్షకులలో ఏర్పడింది. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితం, కుటుంబం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఆమె ప్రత్యేకత.
ప్రదీప్ ‘డ్యూడ్’ ట్రైలర్ రిలీజ్.. చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టేలా ఉన్నాడే
తమిళ ఇండస్ట్రీలో “లవ్ టుడే” సినిమాతో యూత్ ఐకాన్‌గా నిలిచిన ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరోసారి తన సొంత స్టైల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా, టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రదీప్, కొత్తగా చేస్తున్న సినిమా ‘డ్యూడ్’. దీపావళి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించగా, తాజాగా విడుదలైన ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్ చూస్తుంటే, ప్రదీప్ మళ్లీ తన స్టైలిష్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించేందుకు రెడీగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది. ట్రైలర్‌లో ప్రదీప్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో కనిపిస్తున్నాయి. తన సిగ్నేచర్ స్టైల్‌కి తోడు, కొత్తగా చూపించిన మాస్ అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మమితా బైజు, నేహా శెట్టితో ప్రదీప్ కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయేలా ఉంది. అలాగే కమెడియన్ సత్య, శరత్ కుమార్ వంటి నటుల ప్రెజెన్స్ కూడా సినిమాలో వినోదాన్ని మరింత పెంచనున్నాయి. కథలో లవ్ ట్రాక్‌లు, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్, సాసీ కామెడీ సీక్వెన్స్‌లు కలిసి ఈ దీపావళి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం పక్క.