Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

పవన్ కల్యాణ్‌ ఆలోచన మేరకు ఏకో టూరిజం అభివృద్ధి.. సినిమా టూరిజం డెవలప్‌మెంట్‌పై ఫోకస్‌..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధి చేస్తున్నాం.. సినిమా టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.150 కోట్ల పెట్టుబడులు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సినిమా టూరిజం అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి కొత్త గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇక, కేరళ మోడల్‌ను అనుసరిస్తూ రాజమండ్రి, విజయవాడ నగరాల్లో హౌస్ బోట్లను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది అని కందుల దుర్గేష్ తెలిపారు. గోదావరి నదిని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యమన్నారు. అయితే, గత వైసీపీ పాలనలో పర్యాటక రంగం పూర్తిగా నాశనమైందని మంత్రి విమర్శించారు. టూరిజంతో పాటు కళాకారులను కూడా మోసం చేశారని ఆరోపించారు. కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు ఇకపై ఉగాది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు.

క్వాంటమ్ వ్యాలీతో ఇకపై అమరావతి వేగంగా అభివృద్ధి..
క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుతో ఇకపై అమరావతి అభివృద్ధి క్వాంటం వేగంతో ముందుకు సాగనుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన జరగడం రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. అమరావతి ఇక కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని మంత్రి స్పష్టం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైఎండ్ రీసెర్చ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలవబోతుందని అన్నారు. ఇక, క్వాంటమ్ వ్యాలీ ద్వారా నవ్యాంధ్ర యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి వేదికలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు రాంప్రసాద్‌ రెడ్డి.. భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. “క్వాంటమ్ అమరావతి – గ్లోబల్ ఆంధ్రప్రదేశ్” నినాదంతో ప్రభుత్వం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ప్రణాళికాబద్ధంగా, సమగ్ర అభివృద్ధితో అమరావతిని అంతర్జాతీయ గుర్తింపు పొందిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ద్వారా అమరావతి అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమైందని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం.. కీలక ఫైల్స్ దగ్ధం..?
హైదరాబాద్ మహా నగరంలోని నాంపల్లిలో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఈరోజు (డిసెంబర్ 7న) ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. మంటల ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తుంది. పొగ కమ్మేయడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడం వల్ల అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాబ్ లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్లోనే కీలక కేసులు సమాచారం. ఇక్కడే ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తుంది. గత కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్న ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు కీలకమైన గదులు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కీలక ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లోనే పలు కేసుల్లో సేకరించిన పేపర్ వర్క్ ఎవిడెన్స్ సైతం ఇందులోనే ఉన్నాయి. పొగలు పూర్తిగా అదుపులోకి వస్తేనే ఎంత వరకు నష్టం వాటిల్లిందో తెలిసే అవకాశం ఉంది.

రూ.20 లంచం.. 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం.. నిర్దోషిగా విడుదలైన తర్వాతే రోజే కానిస్టేబుల్‌ మృతి..
రూ.20 లంచం ఆరోపణలతో 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం ఎదుర్కొన్న గుజరాత్‌కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్, నిర్దోషిగా విడుదలైన మరుసటి రోజే అకస్మాత్తుగా మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేజల్‌పూర్ ప్రాంతంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసిన బాబూభాయ్ ప్రజాపతి 1996లో రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 1997లో చార్జిషీట్ దాఖలవగా, 2002లో అధికారికంగా అభియోగాలు మోపారు. ఇక, సాక్షుల వాంగ్మూలాల నమోదు 2003లో ప్రారంభమై, 2004లో అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు బాబూభాయ్ ప్రజాపతిని దోషిగా నిర్ధారించింది. అవినీతి నేరానికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.3,000 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ కేసు హైకోర్టులో కొనసాగింది. చివరికి 2026 ఫిబ్రవరి 4న గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సాక్షుల వాంగ్మూలాల్లో పొంతన లేకపోవడం.. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమైందని పేర్కొంటూ బాబూభాయ్ ప్రజాపతిని నిర్దోషిగా విడుదల చేసింది.

ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి ఎన్నిక
ముంబై మున్సిపల్ ఎన్నికలు జరిగి దాదాపుగా నెలరోజులవుతోంది. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కానీ ఇప్పటి వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక జరగలేదు. ఈ పదవిపై బీజేపీ-శివసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ పదవిపై ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన కన్నేసింది. చివరికి ఆ పదవిని కూడా బీజేపీ తన్నుకుపోయింది. మేయర్ పదవి బీజేపీకి, డిప్యూటీ మేయర్ పదవి శివసేనకు దక్కింది. ఈ మేరకు చర్చలు ఫైనల్ అయ్యాయి. ఇక మేయర్‌గా బీజేపీకి చెందిన రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి ఎన్నికైనట్లుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతం  ప్రకటించారు. రీతూ తాన్డే బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్నారు. ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో గహత్కోపర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో విద్యా కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ అనుభవంతో బీఎంసీ అభివృద్ధికి దోహపడుతుందని పార్టీ భావించింది. దీంతో మేయర్‌గా రీతూ తాన్డే నియామకంపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాత ఆమోదం లభించింది. ఇక డిప్యూటీ మేయర్‌గా ఏక్‌నాథ్ షిండేకు చెందిన దహిసర్ కౌన్సిలర్ సంజయ్ ఘడి ఎన్నికయ్యారు.

గుంతలో యువకుడి మృతి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు..!
దేశ రాజధాని ఢిల్లీలో గుంతలో పడి మరణించిన కేసులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనక్‌పురిలో నడిరోడ్డుపై ఢిల్లీ జల్ బోర్డు భారీ గుంత తవ్వి.. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా.. బారికేడ్లు లేకుండా.. సైన్ బోర్డులు.. లైటింగ్ లేకుండా వదిలేశారు. కనీసం భద్రతగా సెక్యూరిటీ గార్డులను కూడా పెట్టలేదు. దీంతో కమల్ ధ్యాని అనే యువకుడు గుంతలో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని జనక్‌పురిలో 25 ఏళ్ల కమల్ ధ్యాని బైక్‌తో పాటు గుంతలో పడిపోవడాన్ని ఒక కుటుంబం చూసింది. వెంటనే టెంట్‌లో కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చారు. ఆ గార్డ్ వెంటనే సబ్ కాంట్రాక్టర్ రాజేష్ ప్రజాపతికి సమాచారం అందించాడు. వెంటనే వచ్చి ఒక వ్యక్తి.. బైక్‌తో పాటు గుంతలో ఉన్నట్లు చూశాడు. కానీ రక్షించే ప్రయత్నం చేయలేదు. చూసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కనీసం పోలీసులకైనా సమాచారం ఇవ్వకుండా ఇంటికి వెళ్లిపోయాడు. పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… రాజేష్‌తో పాటు సహా బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. రాజేష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తు్న్నారు.

హోలీ 2026పై గందరగోళం.. రంగుల పండుగపై చంద్రగ్రహణం ప్రభావం..!
హోలీ 2026 తేదీపై దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీనికి ప్రధాన కారణం మార్చి 3, 2026న సంభవించనున్న చంద్రగ్రహణం.. కామ దహనం.. హోలీ తేదీల విషయంలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో, జ్యోతిష శాస్త్రం మరియు పంచాంగాల ఆధారంగా ఖచ్చితమైన వివరాలు వెల్లడిస్తున్నారు పండితులు.. భారతీయ జ్యోతిషశాస్త్రం, నిర్ణయ్ సింధు గ్రంథం ఆధారంగా జ్యోతిష్కుడు పండిట్ దైవజ్ఞ కృష్ణ శాస్త్రి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫాల్గుణ మాసం శుక్ల పక్ష చతుర్దశి తేదీ మార్చి 2, 2026న వస్తుంది. శాస్త్రాల ప్రకారం, భద్ర కాలంలో కామ దహనం చేయకూడదు. తోక కాలంలో చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. అయితే, కామ దహనానికి శుభ సమయంగా మార్చి 2 అర్ధరాత్రి 12:50 గంటల నుంచి 2:02 గంటల వరకు అని పేర్కొంటున్నారు.. మార్చి 3, 2026న ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం సంభవిస్తుంది… గ్రహణ ప్రారంభ సమయం మధ్యాహ్నం 3:20 కాగా.. గ్రహణ మధ్య సమయం సాయంత్రం 5:04.. గ్రహణ ముగింపు సమయం సాయంత్రం 6:47గా చెబుతున్నారు.. ఈ రోజు చంద్రోదయం సాయంత్రం 5:59కు ఉంటుంది.. భారతదేశంలో చంద్రోదయం తర్వాత మాత్రమే గ్రహణం కనిపిస్తుంది. అంటే, గ్రహణం ముగింపు దశ మాత్రమే దర్శనమిస్తుందన్నమాట.. పండితుల ప్రకారం.. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. అందువల్ల, మార్చి 3 ఉదయం 6:20 గంటల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుందన్నమాట.. చంద్రగ్రహణం మరియు సూతక కాలం కారణంగా మార్చి 3న రంగుల పండుగ నిర్వహించడం శాస్త్రపరంగా సముచితం కాదని పండితులు చెబుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా మార్చి 4, 2026 (చైత్ర కృష్ణ పక్ష ప్రతిపద) న హోలీ జరుపుకోవాలని నిర్ణయించారు. పండిట్ వేద ప్రకాష్ మిశ్రా ప్రకారం, సంప్రదాయంగా హోలికా దహనం రాత్రిపూట, మరుసటి రోజు రంగుల పండుగ జరుపుతారు. కానీ మార్చి 3న చంద్రగ్రహణం ఉండటంతో, ఆ రోజున హోలీ ఆడటం శుభకరం కాదు. అందువల్ల మార్చి 4న హోలీ జరుపుకోవడమే సరైనది అని తెలిపారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ధురంధర్ – 2
గతేడాది చివర్లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది బాలీవుడ్ మూవీ ధురంధర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించి.. బాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది. దీంతో.. ఈ సినిమా సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న ‘ధురంధర్ 2’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియా షేక్ అయింది. అయితే, ఈ సీక్వెల్ మాత్రం రిలీజ్‌కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బిజినెస్ పరంగా ధురంధర్ 2 సినిమాకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనే సినిమా బడ్జెట్ మొత్తం రికవరీ అయినట్టుగా ట్రేడ్ వర్గాల అంచనా. ధురంధర్ 2 నాన్-థియేట్రికల్ బిజినెస్ రూ. 250 కోట్లకు పైగా జరుగుతున్నట్టుగా లెక్కలు వేస్తున్నారు. సినిమా బడ్జెట్ రూ. 250 కోట్లు కాగా.. రిలీజ్‌కు ముందే మేకర్స్‌ను లాభాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు. ఆడియో రైట్స్ కోసం టీ-సిరీస్ సంస్థ ఏకంగా రూ. 60 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటి సంస్థ జియోహాట్‌స్టార్ డిజిటల్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో రూ. 150 కోట్లు వెచ్చించినట్లు బాలీవుడ్ టాక్. శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా.. సినిమా విడుదలకు ముందే కేవలం డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారానే 250 కోట్లకు పైగా వచ్చినట్టు ట్రేడ్ టాక్. ఇక థియేటర్లలో వచ్చేదంతా లాభమేనని అంటున్నారు. మరి ధురంధర్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇది ముగింపు కాదు, కేవలం విరామం మాత్రమే.. !
సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి, ‘ట్వెల్త్ ఫెయిల్’ వంటి సెన్సేషనల్ హిట్‌తో స్టార్‌డమ్ అందుకున్న విక్రాంత్ మాస్సే, 2024 చివర్లో తన రిటైర్మెంట్ గురించి చేసిన పోస్ట్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటి అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఆ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం అది కాదని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పడం వల్లే అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, తన ప్రయాణం ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు. విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ.. ‘వరుస ప్రాజెక్టులతో నేను తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యాను. రోజుకు 14 నుంచి 16 గంటలు పని చేయడం, ఏడాదికి నాలుగు సినిమాలు పూర్తి చేయడం చాలా కష్టంగా అనిపించింది. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేక పోయాననే భావన నన్ను వేధించింది. అందుకే కొన్ని నెలల పాటు నటనకు విరామం ఇచ్చి, నా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప శాశ్వతంగా సినిమాలకు దూరమవుతానని నేను ఎక్కడా చెప్పలేదు’ అని వివరించారు. ఈ 7 నెలల విరామం తనకు ఎంతో ఊరటనిచ్చిందని, ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మళ్ళీ సినిమాలను అంగీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉండగా, త్వరలోనే ఆయన మళ్లీ వెండితెరపై అలరించనున్నారు.

ధనుష్-రాజ్‌కుమార్ పెరియసామి మూవీ షురూ.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి, శ్రీలీల.. క్రేజీ మల్టీస్టారర్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో ధనుష్, తన 55వ సినిమా కోసం ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామితో జతకట్టారు. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ధనుష్‌కు చెందిన ‘వండర్‌బార్ ఫిల్మ్స్’,’ఆర్ టేక్ స్టూడియోస్’ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. అయితే నేడు (శనివారం) జరిగిన ప్రారంభోత్సవ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు శంకర్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. టాలీవుడ్ సెన్సేషన్స్ సాయి పల్లవి, శ్రీలీల ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తుండటం. ‘అమరన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న వరుసగా రెండో సినిమా ఇది. అలాగే, ‘పరాశక్తి’ అనే చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకి, రెండో సినిమానే స్టార్ హీరో ధనుష్ సరసన అవకాశం రావడం విశేషం. మరోవైపు, మాస్ డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో సినిమాకు గ్లోబల్ లెవల్ క్రేజ్ వచ్చింది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ల ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Exit mobile version