అధిక ధరలకు మద్యం విక్రయాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ తరహా అక్రమాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం విక్రయాల విషయంలో దుకాణదారులు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువగా వసూలు చేసినా సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రజలను దోచుకునేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు మద్యం విక్రయించే దుకాణదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, మద్యం విక్రయాల వ్యవహారంలో ఎలాంటి అక్రమాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి.. ఎమ్మెల్యే, ఆమె భర్త సహా 31 మందిపై కేసులు
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు తన న్యాయవాది ద్వారా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దాని ఆధారంగా మొత్తం 31 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. ఫిర్యాదులో టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తన నివాసంపై దాడి చేసి కార్లు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పట్టాభిపురం పోలీసులు BNS సెక్షన్లు 127(2), 189(2), 324(4), 329(4), 351(2) r/w 190 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావుపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాడి ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు, సంబంధిత ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక, మరోవైపు, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ నల్లపాడు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతిస్తే, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబును విచారణ నిమిత్తం నల్లపాడు పోలీసులు గుంటూరుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఇది చారిత్రక మైలురాయి.. మోడీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభినందనలు..
అమెరికాతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ కీలక ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్–అమెరికా మధ్య బంధం ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానుందని చంద్రబాబు పేర్కొన్నారు. నిరంతర గ్లోబల్ వృద్ధికి దోహదపడే దూరదృష్టిగల నిర్ణయమిదని ప్రశంసించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ ఒక గ్లోబల్ ఆర్థిక శక్తిగా మరింత పటిష్టమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు, రైతులకు విస్తృత అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఇదే విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు. వారం వ్యవధిలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కుదిరిన ఒప్పందం భారత్ ఆర్థిక భవిష్యత్తును మరింత బలోపేతం చేయనుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమెరికాతో ఒప్పందం ద్వారా టారిఫ్ ఛార్జీలు 18 శాతానికి తగ్గడం రైతులకు పెద్ద ఊరటగా మారిందని తెలిపారు. ఎగుమతులు పెరగడం వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సమయానుకూలంగా దృఢ నిర్ణయాలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందాలతో భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకోనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కేబినెట్ ప్రారంభానికి ముందే మంత్రులతో విడివిడిగా సీఎం భేటీ..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రులందరితో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీల్లో ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) సమర్పించిన నివేదికపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించాలనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక, ఆ తర్వాత ప్రారంభమైన కేబినెట్ ఎజెండాలో తిరుమల లడ్డూ అంశంపై ప్రత్యేక చర్చ జరుగుతుంది… సిట్ నివేదికను అధికారికంగా ప్రెజెంట్ చేసిన అనంతరం, ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మంత్రులు, పార్టీ నేతలకు గట్టి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. లడ్డూ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ నేతలకు పవన్ క్లాస్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేబినెట్ సమావేశంలో తిరుమల లడ్డూ అంశంతో పాటు, ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజల విశ్వాసాన్ని కాపాడేలా చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి సూసైడ్ కేసులో ఊహించని ట్విస్ట్.. భర్త ఏమన్నారంటే?
ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి విజయశాంతి రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను CCS పోలీసులకు పంపారు. మొబైల్‌లో కొన్ని అనుమానిత మెసేజ్‌లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి రైల్వే డీఎస్పీ తాజాగా ఎన్టీవీతో మాట్లాడారు. “ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయ శాంతి రెడ్డి కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.. కుటుంబ సభ్యులను విచారించాం. ఎలాంటి కుటుంబ కలహాలు లేవు అని చెప్తున్నారు.. ఉద్యోగం చేస్తున్న సంస్థలో కూడా విచారించాం. అక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు.. విజయరెడ్డి, ఇద్దరు పిల్లలని తీసుకుని 30న అర్ధరాత్రి స్టేషన్‌కు వచ్చారు.. ఫ్లాట్ ఫాంపై కొద్దిసేపు పిల్లలతో కలిసి తిరిగారు. చర్లపల్లి వైపు ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళి.. గూడ్స్ ట్రైన్ వస్తున్న సమయంలో ట్రాక్ మధ్యలో నిల్చున్నారు. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఇతను చెప్తున్న ప్రకారం.. ట్రాక్ మధ్యలో ముగ్గురూ ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకుని నిల్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ తప్పుకోండి అని అరుస్తున్న కూడా పక్కకు జరగలేదని చెప్తున్నాడు.. కారులో సూసైడ్ నోట్ లభ్యమైంది.. నా చావుకి ఎవరూ కారణం కాదు. బతకడం భారంగా ఉంది అని రాసి ఉంది. 28న వాళ్ళ పెళ్లి రోజు అని తెలిసింది.. 31న భర్త పుట్టిన రోజు అని తెలిసింది.. బంధువులు ఒకరు చనిపోయారు.. వెళ్ళాలి అని హాస్టల్ లో ఉన్న పిల్లలను తీసుకెళ్లింది తల్లి.. విజయశాంతి మొబైల్ ఫోన్‌ను సీసీఎస్‌కి పంపించాం. లాస్ట్ కాల్ డీటెయిల్స్, అందులో ఉండే సమాచారంతో మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆమె ల్యాప్ టాప్‌ను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు పంపించాం.” అని తెలిపారు.
భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ సక్సెస్.. మోడీకి ఎంపీల సన్మానం
భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మకమైన వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం రాత్రి ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ చేశారు. అనంతరం భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో భారతీయ ఉత్పత్తులకు భారీ ఊరట లభించినట్లైంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్‌కు కూడా మంచి ఊపునిచ్చింది. భారీ స్థాయిలో లాభాల్లో దూసుకుపోతుంది. ఇక భారత్-యూఎస్ డీల్ కుదరడంతో మంగళవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీని ఎన్డీఏ ఎంపీలంతా ఘనంగా సన్మానించారు. మోడీ మెడలో పూలదండ వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాణిజ్య ఒప్పందం భారతదేశ ఆర్థిక బలం, దౌత్య నైపుణ్యం, ప్రపంచ ప్రభావానికి నిదర్శనమని మోడీ అన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. ‘‘దేశంలో తయారీని పెంచడం, నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం ప్రస్తుత కాలంలో అతిపెద్ద డిమాండ్. దేశం ఇప్పుడు ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ నాణ్యతను ప్రపంచానికి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.’’ అని అన్నారు.
వాట్సాప్ డేటా షేరింగ్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..
వాట్సాప్–మెటా గోప్యతా విధానంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు, భారతీయ వినియోగదారుల డేటా గోప్యతపై అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించింది. భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని మెటాతో పంచుకోవడానికి వాట్సాప్‌కు అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా పేర్కొంది. ఈ డేటా షేరింగ్ విధానం దేశ పౌరుల గోప్యతా హక్కులను ఉల్లంఘించే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, వాట్సాప్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ దేశ గోప్యతా విధానాలతో ఆడుకునే హక్కు మీకు లేదు. మెటాతో ఎటువంటి సమాచారాన్ని పంచుకోవడానికి మేము మిమ్మల్ని అనుమతించము అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మెటా, వాట్సాప్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) దాఖలు చేసిన మూడు ప్రధాన అప్పీళ్లను సుప్రీంకోర్టు పరిశీలిస్తోంది. ఈ అప్పీళ్లపై సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో విధించిన రూ.213 కోట్ల జరిమానాను మెటా చెల్లించిందని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త గోప్యతా విధానం అత్యంత సంక్లిష్టంగా ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ పాలసీని చదివి అర్థం చేసుకోవడం న్యాయవాదులకే కష్టం. మరి గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? అని ప్రశ్నించారు. వినియోగదారులు యాప్‌కు అలవాటుపడి, దానిపై ఆధారపడే స్థితికి చేరుకున్నారని, ఆ నిస్సహాయతను వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. వినియోగదారుల డేటాను వాణిజ్య లాభం కోసం ఉపయోగించడం తీవ్రమైన విషయం. మిలియన్ల మంది భారతీయుల డేటా ఇప్పటికే దుర్వినియోగానికి గురైంది అని సీజేఐ పేర్కొన్నారు.
ట్రేడ్ డీల్‌తో పండిన ఇన్వెస్టర్లకు పంట.. రూ.20 లక్షల కోట్ల సంపాదన
దేశీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల పంట పండింది. గంటల వ్యవధిలోనే కోట్ల సంపాదన జేబుల్లో పడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. అన్ని పండుగలన్నీ ఒకేసారి వచ్చినట్లైంది. భారత్-అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం జరిగింది. ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వార్త భారతీయులకు కొత్త జోష్ తెప్పించింది. ఈ సందర్భంగా 140 కోట్ల మంది ప్రజల తరపున ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఇన్వెస్టర్లకు బాగా కలిసొచ్చింది. ఎన్నడూ లేనంతగా మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకుపోయింది. దీంతో గంటల వ్యవధిలోనే రూ.20 లక్షల కోట్ల సంపాదన వారి జేబుల్లో పడ్డాయి. దీంతో పెట్టుబడిదారులకు నూతనోత్సాహం వచ్చింది. ఇక ప్రధాని మోడీని ఎన్డీఏ ఎంపీలు ఘనంగా సన్మానించారు. ‘‘భారత్ మాతాకీ జై’’, ‘‘వందేమాతరం’’ నినాదాలతో మార్మోగించారు.
కోట్లాది స్మార్ట్‌ఫోన్‌లు, పీసీల హైజాక్‌కు యత్నం.. బ్రేక్ చేసిన Google
సైబర్ దాడుల కోసం కోట్లాది స్మార్ట్‌ఫోన్‌లు, విండోస్ పీసీలను హైజాక్ చేసిన భారీ ప్రయత్నాన్ని విజయవంతంగా బ్రేక్ చేసింది గూగుల్.. గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (GTIG) మరియు దాని భాగస్వాములు కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాక్సీ నెట్‌వర్క్‌లలో ఒకటైన IPIDEAను పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు ప్రకటించారు. గూగుల్ విడుదల చేసిన బ్లాగ్ పోస్ట్‌లో, చాలా కాలంగా రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ నెట్‌వర్క్‌ను గుర్తించి కూల్చివేసినట్లు పేర్కొంది.. IPIDEA అనే ఈ రెసిడెన్షియల్ ప్రాక్సీ నెట్‌వర్క్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు విండోస్ పీసీలను అనుమతి లేకుండా ఇంటర్నెట్ ప్రాక్సీలుగా మార్చి, చెడు ఉద్దేశాలు కలిగిన సైబర్ నేరగాళ్లకు ఉపయోగపడిందని గూగుల్ వెల్లడించింది. దీని ద్వారా హానికరమైన కార్యకలాపాల అసలు మూలాన్ని దాచిపెట్టి, బాధితుల ఇంటి నెట్‌వర్క్‌ల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించేలా చేసిందని తెలిపింది.. అయితే, రెసిడెన్షియల్ ప్రాక్సీ నెట్‌వర్క్‌లు అనేవి వాణిజ్య సర్వర్‌లకు బదులుగా, రాజీపడిన వినియోగదారుల పరికరాలను ఉపయోగించి ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మళ్లించే అక్రమ వ్యవస్థలు. ఈ విధానం వల్ల ట్రాఫిక్ సాధారణ గృహ లేదా మొబైల్ IP అడ్రస్‌ల నుంచి వచ్చినట్లు కనిపిస్తుండటంతో, చట్టబద్ధమైన వినియోగదారులు మరియు అక్రమ ట్రాఫిక్‌ను వేరు చేయడం భద్రతా వ్యవస్థలకు కష్టంగా మారుతుందని తెలిపింది.. క్రెడెన్షియల్ స్టఫింగ్, అకౌంట్ టేకోవర్లు, కంటెంట్ స్క్రాపింగ్, ఆన్‌లైన్ మోసాలు వంటి హానికర కార్యకలాపాలను దాచిపెట్టేందుకు సైబర్ నేరగాళ్లు ఇలాంటి నెట్‌వర్క్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. IPIDEA నెట్‌వర్క్ పరికరాల్లో దాచిన సేవలను అమలు చేయడం, కమాండ్ అండ్ కంట్రోల్ ఛానెల్‌లను అస్పష్టం చేయడం వంటి పద్ధతులతో చాలా కాలంగా గుర్తించకుండా కొనసాగిందని GTIG వెల్లడించింది.
స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్ ఎలా పెట్టాలి..? 100 శాతం దాటితే పేలిపోయే ప్రమాదం ఉందా..?
స్మార్ట్‌ఫోన్‌లు మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయాయి. అయితే ఫోన్‌ను ఎలా వాడుతున్నామన్నదే దాని జీవిత కాలాన్ని నిర్ణయిస్తుంది. ముఖ్యంగా ఛార్జింగ్ విషయంలో చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు, భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.. ముఖ్యంగా.. చాలా మంది రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి ఉదయం వరకు అలాగే ఉంచుతుంటారు. ఇది సౌకర్యంగా అనిపించినా.. ఇది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఆరోగ్యానికి మాత్రం తీవ్ర హానికరం. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు సైతం రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచొద్దని సూచిస్తున్నాయి. నేటి స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువగా లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీలు 100 శాతం ఛార్జ్ అయినప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. దీని వల్ల బ్యాటరీలోని కెమికల్ స్ట్రెస్ పెరిగి, క్రమంగా బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.. చాలా ఫోన్లు 100 శాతం ఛార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జర్‌కు కనెక్ట్ చేసి ఉంచితే వేడిని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ అధిక వేడి బ్యాటరీని దెబ్బతీయడమే కాకుండా, అరుదైన సందర్భాల్లో ఫోన్ పేలిపోవడానికి కూడా కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే 100 శాతం ఛార్జ్ అయిన వెంటనే ఫోన్‌ను ఛార్జింగ్ నుంచి తీసివేయడం మంచిది అని సలహా ఇస్తున్నారు.. నిపుణుల సూచనల ప్రకారం స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని పూర్తిగా ఖాళీ చేయడం.. లేదా పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడం రెండూ మంచివి కావు. సాధారణంగా 20 నుంచి 80 శాతం మధ్య ఛార్జ్ ఉంచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువకాలం మంచి పనితీరు చూపుతుంది.
గోల్డ్ లవర్స్‌కు బిగ్ న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
గోల్డ్ లవర్స్‌కు బిగ్ ఫెస్టివల్ వచ్చింది. సామాన్యుడి ఆశలు కూడా చిగురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన దగ్గర దిగొస్తున్నాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఇవాళ కూడా భారీగా తగ్గాయి. వెండి, బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,420 తగ్గగా.. కిలో వెండిపై రూ.20.000 తగ్గింది. తులం గోల్డ్‌పై రూ.1,420 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,300 తగ్గడంతో రూ.1,39,100 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,070 తగ్గడంతో రూ.1,13,810 దగ్గర ట్రేడ్ అవుతోంది. హమ్మయ్య వెండి కూడా బాగా శాంతించింది. కిలో వెండిపై ఏకంగా రూ.20,000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,80, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.2,80, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ధురంధర్ 2 టీజర్ రిలీజ్.. ఇది నూతన భారత దేశం..
రణవీర్ సింగ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్‌గా అక్షయ్ ఖన్నా నటన సినిమాకు ప్రాణంగా నిలిచింది. వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా ‘ధురంధర్ రివెంజ్’ రాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన టీజర్ అత్యంత ఇంటెన్సివ్‌గా సాగుతూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతోంది. సినిమాలోని డార్క్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను ఎలివేట్ చేస్తోంది. రణవీర్ సింగ్ తన మార్క్ ఎనర్జీతో ఆకట్టుకున్నాడు. మొదటి భాగంలో మిగిలిపోయిన లెక్కలను సరిచేయడానికే ఈ ‘రివెంజ్’ డ్రామా రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ చివర్లో రణవీర్ సింగ్ చెప్పిన ‘ఇది నూతన భారతదేశం సరిహద్దులు దాటి ఇంట్లోకి చొరబడుతుంది, దెబ్బ కొడుతుంది’ వంటి డైలాగ్ అదిరింది. ఉరి’ వంటి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ధార్, ఈ సీక్వెల్‌ను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ విజువల్స్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. మొదటి భాగం సృష్టించిన రికార్డులను ఈ సీక్వెల్ తిరగరాస్తుందేమో చూడాలి. భారీ అంచనాల మధ్య మార్చి 19న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది.
‘ధురంధర్ 2’ ఓటీటీ డీల్ జియో హాట్‌స్టార్‌కే.. ఆ మార్పు వెనుక అసలు కథేంటి?
రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఏంటంటే రిలీజ్ అయిన ‘ధురంధర్ 2’ అఫీషియల్ పోస్టర్ చూస్తే ఒక విషయం స్పష్టమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జియో హాట్‌స్టార్ (Jio Hotstar) దక్కించుకుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ‘ధురంధర్’ మొదటి భాగం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. సీక్వెల్ మాత్రం ప్లాట్‌ఫామ్ మార్చేసింది. పార్ట్ 1 ఉన్న చోటే పార్ట్ 2 కూడా ఉంటుందని అందరూ ఆశించారు, కానీ మేకర్స్ మాత్రం జియో హాట్‌స్టార్‌కే మొగ్గు చూపారు. సాధారణంగా భారీ రేటు పలకడం వల్లే ఇలాంటి మార్పులు జరుగుతుంటాయి. ‘ధురంధర్ 2’ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని జియో హాట్‌స్టార్ భారీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏదేమైనా రణ్‌వీర్ స్పై యాక్షన్ సీక్వెల్ ఇప్పుడు ఓటీటీ మార్కెట్‌లో గట్టిగానే చర్చకు దారితీసింది.
అరుదైన జబ్బుతో పోరాడిన చిన్నారి ప్రాణాలు కాపాడిన శృతి హాసన్
మనం వెండితెరపై చూసే స్టార్లు నిజ జీవితంలో ఎలా ఉంటారో అని అందరికీ ఆసక్తి ఉంటుంది. కొందరు గ్లామర్‌కే పరిమితమైతే, మరికొందరు తమకున్న స్టార్‌డమ్‌ని తోటివారికి సాయం చేయడానికి వాడుతుంటారు. ఆ కోవలోకే వస్తుంది టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్. తాజాగా ఒక అరుదైన జబ్బుతో చావుబతుకుల్లో ఉన్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడి, ఆ కుటుంబానికి దేవుడిలా అండగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ‘ఆళ్వి’ అనే చిన్నారికి పుట్టుకతోనే MSMD అనే చాలా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి వచ్చింది. పాపం ఆ పసిపాప పుట్టినప్పటి నుంచీ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే 2025లో ఆ చిన్నారికి ఎముక మజ్జ మార్పిడి (Bone Marrow Transplant) చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో శృతి హాసన్ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. పాప పరిస్థితి సీరియస్ అయ్యి ఐసీయూలో ఉన్నప్పుడు, శృతి హాసన్ ఊరికే డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేదు. స్వయంగా రంగంలోకి దిగి, బెస్ట్ డాక్టర్లతో మాట్లాడి పాపకు మెరుగైన వైద్యం అందేలా చూసింది. డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణులను ఆ ఫ్యామిలీకి పరిచయం చేసి, ఆ పాప ప్రాణాలు దక్కేలా చేసింది. వైద్యంతో పాటు ఆర్థికంగా, మానసికంగా కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది.
