Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కీలక ఆధారాలు సేకరించిన FSL బృందాలు
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన అగ్నిప్రమాద సంఘటనపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందాలు పరిశోధన కొనసాగిస్తూ కీలక ఆధారాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు మంటలలో పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటన వెంటనే రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రయోగాత్మక ఆధారాల కోసం CC కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తోంది. దీనివల్ల ప్రమాదానికి ఉన్న కారణాల్ని విశ్లేషించడం కొనసాగుతున్నట్లు డీఆర్ఎం మోహిత్ సోనాకీయా తెలిపారు. FSL బృందాలు సేకరించిన ఆధారాల ఆధారంగా ప్రమాదానికి సంబంధించిన నిర్ధారణకు రావడం సాధ్యమని అధికారులు పేర్కొన్నారు. మరో వైపు, ఈ ఈ దుర్ఘటనలో ఓ వృద్ధుడు సజీవదహనం కాగా.. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు… అయితే, మరణించిన సుందరం కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు రైల్వే అధికారులు.. కాగా, టాటానగర్ నుంచి ఎర్నాకుళం వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగగా.. రెండు బోగీలకు మంటలు అంటుకున్న దగ్ధమయ్యాయయి.. ఘటనపై రైల్వే సిబ్బంది, ఫైర్ బ్రిగేడ్ ల సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చినప్పటికీ.. రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి.. ప్రయాణికులను ఉన్నంతలో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.. ఈ ఘటనపై రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకీయా మాట్లాడుతూ.. కేంద్ర FSL బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి. మొత్తం విపత్తు స్థానాన్ని పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజ్, శక్తి పరమైన సంబంధించిన డాటాను పరిశీలిస్తూ పూర్తి విచారణ చేపడుతున్నారు. ప్రమాదానికి వెల సాయం అందటానికి నివేదిక ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకుంటాం.” అని పేర్కొన్నారు.

కల్తీ మద్యం కేసులో ట్విస్ట్.
అన్నమయ్య జిల్లాలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. అయితే, విచారణ అనంతరం ఎక్సైజ్ అధికారులు సిద్ధం చేసిన కస్టడీ రిపోర్టుపై సంతకం చేసేందుకు ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు నిరాకరించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. మూడు రోజుల పాటు నిందితులను ప్రశ్నించిన ఎక్సైజ్ శాఖ, మద్యం కల్తీ తయారీ, సరఫరా నెట్‌వర్క్, కీలక పాత్రధారుల వివరాలపై కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. కానీ, కస్టడీ రిపోర్టుపై జనార్ధన్ రావు సంతకం పెట్టకపోవడంతో.. విచారణ వివరాలకు అధికారిక ధ్రువీకరణ ఎలా పొందాలన్న దానిపై ఎక్సైజ్ శాఖ తలలు పట్టుకుంటోంది. కస్టడీ సమయం ముగిసిపోవడంతో నిందితులను ఇంకా మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లోనే ఉంచి తదుపరి చర్యలపై చర్చిస్తున్నారు. సంతకం నిరాకరణ వల్ల కేసు ప్రక్రియ ఆలస్యం కావచ్చని, కోర్టులో రిపోర్టు సమర్పణకు ఇది సాంకేతిక అడ్డంకిగా మారే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని.. నిందితుడి సంతకం లేకపోయినా చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రిపోర్టును కోర్టుకు సమర్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే, కల్తీ మద్యం కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టి, మిగతా నిందితుల పాత్రను స్పష్టంగా నిర్ధారించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారీ, విక్రయాలు సాగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికారిక రిపోర్టుపై సంతకం నిరాకరణ ఘటనతో కేసు విచారణ కొత్త మలుపు తీసుకున్నప్పటికీ, త్వరలోనే పూర్తి నివేదికతో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖతో పాటు, జిల్లా పోలీసులు, RPF, FSL విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ.. కల్తీ మద్యం మూలాలను ఛేదించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్టు చెబుతున్నారు..

మృత్యువులోనూ వీడని బంధం.. నిన్న తల్లి, నేడు బిడ్డ మృతి..
మృత్యువు కూడా ఓ తల్లి–బిడ్డ బంధాన్ని విడదీయలేకపోయింది.. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. ఇవాళ అదే చిన్నారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వరుస మరణాలతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. హిందూపురం మండలం బసనపల్లి ఆటోనగర్‌కు చెందిన ఖలీమ్ – నజ్మా దంపతులు జీవనం సాగించగా.. నజ్మాకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సురక్షితంగా డెలివరీ అయిన నజ్మా.. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, ప్రసవం అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. డాక్టర్ల సూచనతో ఆమెను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తల్లి నజ్మా ప్రాణాలు విడిచింది. అయితే, పండంటి బిడ్డను చేతుల్లోకి తీసుకునేలోపే తల్లి కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఇంకా తీరని విషాదం ఆ కుటుంబాన్ని వెంటాడింది. నజ్మా మృతదేహాన్ని అంబులెన్స్‌లో హిందూపురానికి తరలిస్తుండగా, పసిబిడ్డను కూడా అదే అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. హిందూపురం సమీపంలో.. పొగమంచు తీవ్రత కారణంగా రోడ్డు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.. ఈ క్రమంలో అంబులెన్స్ ముందు వెళ్తున్న లారీని బసనపల్లి ఆటోనగర్ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి మృతదేహంతో పాటు ప్రయాణిస్తున్న శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. నిన్న తల్లిని కోల్పోయిన కుటుంబం.. ఇవాళ పసిబిడ్డను కూడా పోగొట్టుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆటోనగర్ ప్రాంతం మొత్తం ఈ ఘటనతో శోకసంద్రంలో మునిగిపోయింది.

అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం.. కేసీఆర్కి షేక్హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈరోజు (డిసెంబర్ 29న) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభాహాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మిగతా సభ్యుల కంటే ముందుగానే మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభా లోపలికి చేరుకుని తన సీటులో కూర్చున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలోకి రాగానే కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే, కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కలిసి కరచాలనం ఇచ్చారు. అలాగే, నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక, సభ ప్రారంభమైన వెంటనే కేసీఆర్ కొద్దిసేపు మాత్రమే అసెంబ్లీ హాల్‌లో ఉండి.. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి సభ నుంచి బయటికొచ్చి నంది నగర్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇక, అంతకుముందు కేసీఆర్ అసెంబ్లీకి చేరుకుని శాసన సభ రిజిస్ట్రర్ లో సంతకం చేశారు.

భాక్రానంగల్ ఏ రాష్ట్రంలో ఉందో సీఎంకు తెలియదు..
మీడియాతో చిట్ చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా నది ఎక్కడ ఉన్నది అడిగాడు.. భాక్రానంగాల్ ఏ రాష్ట్రంలో ఉందో తెలియదని సెటైర్లు వేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారుగా కొనసాగుతున్నారని మండిపడ్డారు. అయితే, వీళ్ళు నీటిపారుదల శాఖపై చర్చ అంటున్నారు.. దేని మీద చర్చ పెడుతున్నారో వీరికి తెలియదు.. బూతులు మాట్లాడాలి అంటే ఎన్ని రోజులైనా చర్చ పెడతారు.. సభలో సబ్జెక్ట్ లేనప్పుడు ఎన్ని రోజులు నడుపుతారని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే, నీటిపారుదల శాఖపై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారు.. తీరా కేసీఆర్ వస్తున్నాడు అని కాంగ్రెస్ వాళ్లు చర్చకు ప్రిపేర్ అవుతున్నారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అలాగే, కౌశిక్ రెడ్డి మేడిగడ్డపై బాంబులు పెట్టీ పేల్చారని అన్నాడు.. ఎందుకంటే, హుజూరాబాద్ నియోజక వర్గంలోని తనుగుల వద్ద చెక్ డ్యామ్ పేల్చివేతలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ హస్తం ఉందని ఆరోపించారు. ఆనాడు మేడిగడ్డ పేల్చారని ఫిర్యాదు చేశారు ఇంజనీర్లు.. కానీ, ఇప్పటి వరకు ఎందుకు మీరు విచారణ చేపట్టడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అడిగారు.

బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజీని పేల్చినట్టు ఆ చెక్ డ్యామ్ను పేల్చిండ్రన్న కౌశిక్ రెడ్డి..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజీని పేల్చినట్లు.. నా నియోజక వర్గంలోని తనుగుల చెక్ డ్యామ్ను కూడా బాంబు పెట్టీ పేల్చారని ఆరోపించారు. అయితే, సభలో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం కొనసాగుతుంది. కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదు.. బాంబులు పెట్టీ పేల్చారు అనడం ఏంటి అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి వెంటనే తొలగించాలి అని కోరారు.

స్థానిక ఎన్నికల కోసం ఒక్కటైన పవార్ కుటుంబం.. చేతులు కలిపిన శరద్ పవార్-అజిత్ పవార్‌
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల సమయంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్థానిక ఎన్నికల కోసం శరద్ పవార్-అజిత్ పవార్‌ కుటుంబాలు మళ్లీ ఏకమయ్యాయి. ముంబై, పింప్రి-చించ్‌వాడ్, పూణె సహా మహారాష్ట్ర అంతటా 29 మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక డిసెంబర్ 30న నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ. ఈ నేపథ్యంలో పింప్రి-చించ్‌వాడ్‌లో కలిసి పోటీ చేయాలని శరద్ పవార్-అజిత్ పవార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ చేతులు కలిపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని తెలిపారు. మొత్తానికి పవార్ కుటుంబంలో నెలకొన్న విభేదాలు.. తిరిగి స్థానిక ఎన్నికల రూపంలో మళ్లీ కలిపింది. ప్రస్తుతం పింప్రి-చించ్‌వాడ్‌లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పూణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం పొత్తులపై చర్చలు జరుపుతున్నారు.

కుల్దీప్ సెంగర్‌కు షాక్.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది. విచారణ జరిపిన న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఇక కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో రిప్లై ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఈరోజు విచారణకు ముందు బాధితురాలు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుపై తనకు నమ్మకం ఉందని తెలిపింది. ఇక తన కుటుంబానికి, తనకు భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బాధితురాలు విజ్ఞప్తి చేసింది. దర్యాప్తు అధికారి, ఓ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తితో సహా అధికారులకు నిందితుడు సెంగర్ లంచం ఇచ్చాడని ఆరోపించింది. సెంగర్‌కు బెయిల్ వచ్చినప్పటి నుంచి తన కుటుంబం భయంతో బతుకుతుందని పేర్కొంది.

పాకిస్తాన్‌లో ‘సూపర్ ఉమెన్’ మహిళా పోలీసు అధికారి.. గంటలోనే హత్య మిస్టరీ ఛేదన..!
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించడం ప్రశంసనీయం. కానీ అదే పని అతిగా నాటకీయంగా మారితే నవ్వుల పాలు కావాల్సిందే మరి. ఈ పరిస్థితిని ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన మహిళా పోలీస్ అధికారి ఏఎస్పీ షెహర్‌బానో నఖ్వీ స్వయంగా ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఆమె, ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్నారు. లాహోర్‌కు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన షెహర్‌బానో నఖ్వీ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పాడ్‌కాస్ట్ నడుస్తుండగానే ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతూ.. “ఏంటి ఖుర్రమ్… నిందితుడు దొరికిపోయాడా? చాలా బాగుంది.. నేను ఇప్పుడే వస్తున్నా” అని చెప్పి కాల్ కట్ చేశారు. ఆ వెంటనే పాడ్‌కాస్టర్‌కు “ఒక మర్డర్ జరిగింది, వెంటనే అక్కడికి వెళ్లాలి” అని చెప్పి ఆమె ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.

బెస్ట్ డీల్స్.. ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌పై 60 శాతం తగ్గింపు..
ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఎప్పుడూ ఏదో ఆఫర్లు నడుస్తూనే ఉంటాయి.. సీజన్‌ బట్టి.. కొన్ని వస్తువులపై, పండుగలు, ఇంకా ప్రత్యేకమైన రోజుల సందర్భంలోనూ ఈ ఆఫర్ల మోత మొగుతుంది.. అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు, అనేక ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సంవత్సరాంతపు అమ్మకాలను నిర్వహిస్తున్నాయి. టాటా క్రోమా స్టోర్ కూడా ప్రత్యేక అమ్మకాన్ని నిర్వహిస్తోంది, అనేక ఆకర్షణీయమైన ఆఫర్‌లు, భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. క్రోమా స్టోర్లలో ప్రస్తుతం జరుగుతున్న సేల్ పేరు క్రోమాటాస్టిక్ డిసెంబర్ సేల్. ఈ సేల్ సమయంలో యాపిల్ ఐఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లతో పాటు మరికొన్ని వస్తువలుపై డిస్కౌంట్లు, ఆఫర్లు, గొప్ప డీల్స్‌తో అందుబాటులో ఉన్నాయి.. క్రోమా స్టోర్లలో కొనసాగుతున్న అమ్మకాల్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులు 60 శాతం వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి.. EMI నెలకు రూ.188 నుండి ప్రారంభమవుతుంది.. వీటికి తోడు క్రోమా స్టోర్లలో ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులను ఉపయోగించడంపై తక్షణ క్యాష్‌బ్యాక్‌ను కూడా ప్రకటించింది. ఇందులో ICICI, IDFC, HDFC బ్యాంక్ మరియు ఇతర బ్యాంకు కార్డులు ఉన్నాయి.. ఈ సేల్‌లో మీరు చాలా తక్కువ ధరలకు గీజర్‌లను కొనుగోలు చేయవచ్చు. మీరు క్రోమా 5-లీటర్ ఇన్‌స్టంట్ గీజర్‌ను కేవలం రూ.3,999కే కొనుగోలు చేయవచ్చు. వివిధ సామర్థ్యాల గీజర్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. క్రోమా స్టోర్లు కూడా హీటర్లపై ఆఫర్లను అందిస్తున్నాయి. రూమ్ ఫ్యాన్ హీటర్లు మరియు ఆయిల్ హీటర్లు రెండూ అమ్మకానికి ఉన్నాయి. ఈ సేల్ సమయంలో అనేక అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..ది రాజాసాబ్’ రిలీజ్ ట్రైలర్ అప్‌డేట్.. !
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. ఈ మూవీ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ జోనర్‌ మూవీలో.. ప్రభాస్ సరసన అందాల భామలు మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ‘రాజాసాబ్’ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చేస్తున్న నిరీక్షణకు నేటితో తెరపడనుంది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఈ ‘రిలీజ్ ట్రైలర్’ నిన్ననే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. అయితే, ట్రైలర్ ఈరోజే విడుదలవుతుందని చిత్ర బృందం స్పష్టం చేస్తూ, అధికారిక ప్రకటన కోసం సిద్ధంగా ఉండమని అభిమానులను కోరింది.కాగా ట్రైలర్‌లోని కట్స్ మరియు విజువల్స్ చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ వింటేజ్ లుక్ మరియు కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సంక్రాంతి రేసులో రాజాసాబ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

అల్లు శిరీష్.. పెళ్లి డేట్ ఫిక్స్..
అల్లు అరవింద్ చిన్న కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో  అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అల్లు శిరీష్ గత కొన్నేళ్లగా నయనిక రెడ్డితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్ళిగా మార్చుకున్నారు ఈ ప్రేమ జంట. ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇరు కుటుంబాల సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇక ఇప్పుడు నయనిక రెడ్డి మేడలో మూడు ముళ్ల్లు వేసేందుకు రెడీ అయ్యాడు అల్లు శిరీష్. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భలే గమ్మత్తుగా రివీల్ చేసాడు అల్లు శిరీష్. అల్లు బాబీ కుమార్తె, బన్నీ కూతురు అర్హ కలిసి బాబాయ్ పెళ్లి ఎప్పుడు అని ట్రెండింగ్ సాంగ్‌తో డాన్స్ చేస్తూ అడగగా దానికి  అల్లు శిరీష్, అల్లు అయాన్ డాన్స్ చేస్తూ వచ్చే ఏడాది మార్చి 6 అని ‘పెళ్లి డేట్‌ని రివీల్ చేశాడు అల్లు శిరీష్. సంగీత్ ఎప్పుడు బాబాయ్ అని అర్హ అడిగినపుడు ‘మనం సౌత్ ఇండియన్స్‌.. మనం సంగీత్ లాంటివి చేసుకోము..’ అని డాన్స్ చేశాడు శిరీష్, అయాన్. ఇలా ట్రెండింగ్ సాంగ్ తో భలే గమ్మత్తుగా వివాహ వేడుక డేట్ ను అనౌన్స్ చేసాడు శిరీష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వివాహం కూడా మార్చి 6న జరగడం విశేషం. అన్న అల్లు అర్జున్ పెళ్లి జరిగిన రోజునే తమ్ముడు శిరీష్ వివాహం జరుగుతుండం యాదృచ్చికమే.

Exit mobile version