NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు..
టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ ‌కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు‌ కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం రావట‌ం జరిగింది. మొదటి ప్రయారిటీ గంజాయిని అరికట్టాం.. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండటంతో గంజాయి రహితంగా చేసేకార్యక్రమాలు చేపట్టాం అన్నారు. సంకల్ప కార్యక్రమం ద్వారా యువతకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం.. చెడు అలవాట్లకు బానిస కాకుండా చూస్తున్నాం అన్నారు.. ఇక, మిగిలిన అన్ని క్రైమ్‌లు తగ్గాయి.. కానీ, సైబర్ క్రైమ్‌ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డీజీపీ.. సైబర్ క్రైమ్‌ పై ప్రజలలో అవగాహన తీసుకువస్తున్నాం అని వెల్లడించారు.. మరోవైపు.. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు.. అలాంటి కాల్స్‌ వస్తే భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.. నిపుణుల సహకారంతో సైబర్ పోలిస్ స్టేషన్లు జిల్లాకు ఒకచోట ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, పిల్లలు‌, వృద్ధులపై అత్యాచారాలు చేస్తున్నారు.. సమాజంకు ఇది సిగ్గు చేటు‌ అని వ్యాఖ్యానించారు.. మావోయిస్టుల కదలిలకపై నిఘా ఉంది. ఏవోబీని సెల్టర్ జోన్ గా వాడుకోవాలనుకుంటే పోలీసులు అంత అసమర్థంగా లేరు అని హెచ్చరించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.

చంద్రబాబు మాటలపై పవన్‌ సమాధానం చెప్పాలి.. ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..?
సంక్షేమ పథకాలపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది.. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమన్న సీఎం.. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.. అంతేకాదు.. అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కల్యాణ్‌ ఏ గుడిమెట్లు కడుగుతారు..? అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు.. నీతిఅయోగ్ పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలేనని మోసం చేశారు అని మండిపడ్డారు భూమన.. అధికారంలోకి వస్తే 15 వేలు పిల్లలకు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చేబుతున్నారు అని దుయ్యబట్టారు.. ఎన్నికలలో ప్రచార సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంటో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు తెలియదా? అని నిలదీశారు.. ఎన్నికల సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. వైఎస్‌ జగన్ కంటే ఎక్కవగా ఇస్తామని హామీ ఇచ్చారు… ఇప్పుడేమో చేతులేత్తేశారని విమర్శలు గుప్పించారు.. ఘోరమైన పాలన చంద్రబాబు చేస్తున్నాడు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇస్తామని.. మళ్లీ అబద్దాలు చేబుతున్నాడు.. అబద్దాలు బుద్దుడు ఈ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు..

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి..
కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. అయితే, ఇదే సమయంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా సాయిరెడ్డి బాటలో నడుస్తున్నారనే ప్రచారం గుప్పుమంది.. రేపోమాపో అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారనే గుసగుసలు వినిపించాయి.. అయితే, తాను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. పార్టీ విజయాల బాటలో ఉన్నప్పుడు అన్ని సక్రమంగానే కనపడతాయని, ఓటమి ఎదురైనప్పుడే నాయకులు పోరాటం చేయాలని సూచించారు.. విజయసాయిరెడ్డి ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదని, రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారన్నది ఆయన వ్యక్తిగతమన్నారు.. ఇక, వైసీపీలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుంటామని తెలిపారు.. మా పార్టీలో లోపాలు లేకపోతే, మళ్లీ ఎన్నికల్లో మేమే గెలిచే వాళ్లం కదా? అని ప్రశ్నించారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. ప్రతి రాజకీయ పార్టీకి ఎత్తులు, పల్లాలు ఉంటాయి.. ఒత్తిడి తట్టుకొని నిలబడగలిగితే, పార్టీలు బ్రతుకుతాయి, లేదంటే మనుగడ చాలిస్తాయి అన్నారు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి.. మా పార్టీలో అన్ని కరెక్ట్ గా జరిగితే మొన్న ఎన్నికల్లో మేమే గెలిచేవాళ్లం.. పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయి.. వాటిని సరిదిద్దుకుంటాం అన్నారు.. నేను పార్టీ మారుతున్నాను అన్న ప్రచారం వాస్తవం కాదు.. ప్రతి కుటుంబంలో అలకలు, కలతలు ఉన్నట్లే, ప్రస్తుతం వైసీపీలో ఉన్నాయన్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి..

గద్దర్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. పద్మ పురస్కారం ఎలా ఇస్తారు..?
ప్రజాయుద్ధనౌక గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్‌ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి.. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు. అనేక మంది పోలీసులను చంపిన కేసులో కోర్టులకు తీరగలేనని రాష్ట్రపతికి గద్దర్ లేఖ రాసుకున్నారు.. గద్దర్ మావోయిస్టు లీడర్.. గద్దర్ కుమార్తె ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి గద్దర్ కు పద్మ పురస్కారం ఇవ్వాలా? అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు విష్ణువర్ధన్‌రెడ్డి.. ఇక, రాజీవ్‌గాంధీని చంపిన వారికి రేవంత్ పద్మ పురస్కారం ఇవ్వమంటారా? అని నిలదీశారు.. గద్దర్ కి LTT తీవ్రవాదులకు తేడా లేదన్న ఆయన.. మాజీ మావోయిస్టు ,రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తికి ఏ హోదా లో రేవంత్ రెడ్డి పద్మ అవార్డు అడుగుతున్నారు.. ఉగ్రవాదులకు కూడా రేవంత్ పద్మ అవార్డులు అడుగుతారా అని ప్రశ్నించారు.. గద్దర్ ను మావోయిస్టు అని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ.. గద్దర్ ను చంపడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ.. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి పద్మ అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.. పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ కూడా తెలియని వాళ్లు రేవంత్ కి సలహాలు ఇస్తున్నట్లు ఉందని దుయ్యబట్టారు.. పబ్లిక్ డొమైన్ లో ఓటింగ్ ద్వారా కూడా పద్మ పురస్కారాలు ఇస్తారు.. దరఖాస్తులు చేయని మొగలయ్యకు పద్మ శ్రీ ఇచ్చారు.. భారత ప్రభుత్వం గుర్తించి రామయ్య పద్మ అవార్డు అందించిందని చెప్పుకొచ్చారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి.

ధన్యవాదాలు CBN గారు.. మీ పాత శిష్యుడికి అవగాహన కల్పించండి..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పలు సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధిపై.. ముఖ్యంగా హైదరాబాద్‌ అభివృద్ధి, సైబరాబాద్‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా వేదికల్లోనూ ప్రశంసలు కురిపించారు.. తాజాగా, దావోస్‌ పర్యటనలో ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలో పాల్గొన్న కార్యక్రమంలోనూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందంటూ చంద్రబాబు కీర్తించారు.. ఇక, సోమవారం మీడియా సమావేశంలోనూ మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉంది.. దానికి అక్కడి పాలసీలే కారణంగా పేర్కొన్నారు.. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.. ఇదే సమయంలో.. సీఎం రేవంత్‌రెడ్డికి చురకలు అంటించే ప్రయత్నం చేశారు. తన ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.. ఏపీ సీఎం మీడియాతో మాట్లాడిన క్లిప్‌ను ట్యాగ్‌ చేసిన కేటీఆర్‌.. “ప్రభుత్వ ప్రగతిశీల విధానాల వల్లే భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం (Highest per capita income) కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఏపీ సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో నిజాయితీగా అంగీకరించారని పేర్కొన్నారు.. ఇక, ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు.. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పాత శిష్యుడుకి దయచేసి అవగాహన కల్పించండి అని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచిస్తూనే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌.. అయితే, సీబీఎన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన కేటీఆర్‌ ట్వీట్‌ను వైరల్‌ చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్లో కుప్పకూలిన వేదిక.. ఏడుగురు మృతి!
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌లో జైనులు ఏర్పాటు చేసిన ఆదినాథుడి నిర్వాణ లడ్డూ మహోత్సవ్.. ఈ కార్యక్రమంలో చెక్కతో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో పాటు 60 మందికి పైగా గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఇక, ఈ ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రియాక్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, మనోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నారు.

బడ్జెట్కు ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఇవే!
2025 కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11:00 గంటలకు లోక్ సభలో సమర్పించనున్నారు. మొత్తంగా ఇది ఆమె ఎనిమిదో బడ్జెట్ ప్రసంగం అవుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు భాగాలుగా కొనసాగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు.. ఆ తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించే ముందు మీరు కొన్ని కీలక అంశాలను అర్థం చేసుకోవాలి.ఒక ఏడాదికి సంబంధించిన ఆదాయ, వ్యయాల పూర్తి ప్రణాళికనే వార్షిక బడ్జెట్‌ అంటారు. ఇందులో సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు దీన్ని రూపొందిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌ అయితే అసెంబ్లీలో, కేంద్ర బడ్జెట్‌ అయితే పార్లమెంటులో ప్రవేశ పెట్టనున్నారు.మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగాలు, ప్రభుత్వ పథకాలకు కేటాయించాల్సిన అంచనా నిధులనే బడ్జెట్ అంచనా అంటారు. ఇందులో డబ్బులు ఎక్కడు, ఎలా ఖర్చు చేయాలనేది తెలియజేస్తుంది. ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టాలనే దానిపై బడ్జెట్ అంచనాను రూపొందిస్తారు. యంత్రాలు, పరికరాలు, భవనాలు, ఆరోగ్య సౌకర్యాలు, విద్య మొదలైన వాటి అభివృద్ధికి ప్రభుత్వం వెచ్చించే డబ్బునే మూలధన వ్యయం అంటారు. ఇది, భవిష్యత్తులో లాభాలు లేదా డివిడెండ్‌ను ఇచ్చే ప్రభుత్వ భూమి, పెట్టుబడి వంటి స్థిరాస్తులను సంపాదించడానికి చేసే ఖర్చు కూడా ఇందులో భాగమే.

అమెరికన్లకు గుడ్న్యూస్ చెప్పిన ట్రంప్.. త్వరలోనే ట్యాక్స్ మాఫీ
యూఎస్ పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచడానికే ఈ దిశగా తాము అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. యూఎస్ పౌరులను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా.. ఇవి ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు. అయితే, అమెరికా ఆదాయంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే.. దాన్ని చేసుకోవడానికి దిగుమతి సుంకాలను ఉపయోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం. ఇక, ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్లను ధనవంతులుగా మార్చే వ్యవస్థలోకి మనం వెళుతున్నామని వెల్లడించారు. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై ట్యాక్సులు చేయడం కంటే.. మనమే విదేశాలపై పన్నులు వేయడంతో యూఎస్ ప్రజలను సంపన్నులు చేయొచ్చని పేర్కొన్నారు. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్‌టర్నల్‌ రెవెన్యూ సర్వీసును స్టార్ట్ చేసినట్లు తెలిపారు. అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదను కలిగి ఉన్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా రెండవ రోజు తగ్గిన బంగారం ధరలు
ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ మరోసారి 10 గ్రాముల బంగారం ధర 80 వేలకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 83 వేల వరకు కూడా ధర చేరుకుంది. ఇకపోతే, గత రెండు రోజుల నుంచి బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల 320 రూపాయలు తగ్గి రూ.81,930 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 300 రూపాయలు తగ్గి 75,100 ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 240 రూపాయలు తగ్గి 61,450 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా వెండి ధరలు కూడా తగ్గినట్లుగా కనబడుతోంది. కేజీ వెండి ధర దేశవ్యాప్తంగా 1000 రూపాయల మేర తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి 1,03,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, కేరళ, చెన్నై నగరాలలో కేజీ బంగారం ధర రూ. 1,03,000 వద్ద కొనసాగుతుండగా.. మిగతా ప్రాంతాలలో 98 వేల వద్ద ట్రేడ్ అవుతోంది.

8 వసంతాలు అనంతిక సనిల్ కుమార్ ఫేట్ మార్చేనా…?
మ్యాడ్ తో పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనంతిక సనిల్ కుమార్. నార్నే నితిన్ కు జంటగా జెన్నీ పాత్రలో నటించిన ఈ యంగ్ యాక్ట్రెస్ 8 వసంతాలుతో పలకరించబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శుద్ది అయోధ్య పాత్రలో కనిపించబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఏర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రీసెంట్లీ ఈ మూవీ నుండి ట్రైలర్ 1 రిలీజ్ చేశారు మేకర్స్.చూసేందుకు ఇన్నోసెంట్ గర్ల్ గా కనిపించే అనంతికలో మస్త్ టాలెంట్స్ ఉన్నాయి. సంప్రదాయ నృత్యాలను అవపోసన పట్టిన అమ్మడు  కరాటేలో, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఈ టాలెంట్స్ ఆమెకు సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టాయి. 2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది అమ్మడు. ఆ తర్వాత వచ్చిన మ్యాడ్ ఆమె యాక్టింగ్ కెరీర్ మార్చేసింది. 2023లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనంతిక. విక్రమ్ ప్రభుతో రైడ్, రజనీకాంత్ లాల్ సలామ్ లో యాక్ట్ చేసింది అమ్మడు. కానీ ఈ రెండు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో టాలీవుడ్ రిటర్న్ తీసుకుంది. ఇప్పుడు రీసెంట్లీ రిలీజ్ చేసిన 8 వసంతాలు ట్రైలర్ విభిన్న భావోద్వేగాలతో నిండిపోయింది. డైలాగ్స్ కూడా హార్ట్ టచ్ చేస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్ దాని నుండి వచ్చే వేదన, ఎడబాటు నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తుంది. ట్రైలర్ వన్ లోనే రివర్స్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేశాడు దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి. గతంలో షార్ట్ ఫిల్మ్స్ నుండి కెరీర్ స్టార్ట్ చేసిన ఈ దర్శకుడు మను చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పుడు మరో ఇంటెన్సివ్ స్టోరీతో వస్తున్నాడు. హేషమ్ మ్యూజిక్ అందిస్తున్న 8 వసంతాలు.. అనంతిక సినీ లైఫ్ లో పువ్వులు పూయిస్తుందో చూడాలి.

న్యూడ్‌గా నటించేందుకు ఒప్పుకున్న స్టార్ హీరోయిన్..
సింగర్ గా పరిచయమై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ హాట్ బ్యూటి ఆండ్రియా. పెక్యులర్ వాయిస్‌తో ఆమె పాడిన కొన్ని పాటలు కోలివుడ్‌లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.ఇక తన వాయిస్‌తో పాటుగా చూడాటినికి కూడా మంచి లుక్స్‌లోనూ ఉండడంతో ఆమె నటిగానూ ఛాన్సులు అందుకుంది. ‘యుగానికి ఒక్కడు’ మూవీతో కెరీర్ మొదలు పెడితే తొలి పరిచయం లోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. దీంతో వెనక్కి తిరిగి చూడలేదు వరుస సినిమా అవకాశాలు అందుకుంది. ఇప్పటికీ కూడా తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గానే ఉంది. అయితే విలక్షణ దర్శకుడు మిస్కిన్‌.. కొన్నేళ్ల ముందు ఆమె ప్రధాన పాత్రలో ‘పిసాసు-2’ అనే మూవీ మొదలుపెట్టాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘పిసాసు’కు ఇది సీక్వెల్. మొదటి భాగం మంచి హిట్ అందుకోవడంతో పార్ట్ 2 మొదలైనపుడే మంచి బజ్ తెచ్చుకుంది. కానీ సినిమా పూర్తయినా.. విడుదలకు నోచుకోవడం లేదు. కారణాలేంటి తెలియదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిస్కిన్ ఈ ఆండ్రియా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.. మిస్కిన్ మాట్లాడుతూ ‘ ‘పిసాసు-2’ కథ విన్నాక కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించేందుకు ఆండ్రియా అంగీకరించింది. కథకు అవసరం అని ఆమె ఆ రిస్క్ చేయడానికి రెడీ అయింది. దీనికి సంబంధించి ఒక ఫోటో షూట్ కూడా చేయాలని ఆమె సిద్ధపడింది. కానీ నగ్న సన్నివేశాలు యువత మరో కోణంలో చూస్తారేమో అనిపించి.. ఆండ్రియాను అలా చూపించే విషయంలో వెనకడుగు వేశాను. కానీ ఒకవేళ ఆండ్రియా కనుక ఆ నేక్డ్ సీన్స్ చేసి ఉంటే సినిమాకు మంచి బజ్ వచ్చి ఈపాటికే ‘పిసాసు-2’ రిలీజ్ కూడా అయ్యేది’ అని మిస్కిన్ తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ లు..
త‌మిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం ‘మదగజరాజ’.సుందర్ సీ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమా నిజానికి 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికి, 12 ఏండ్ల త‌ర్వాత రీసెంట్‌గా త‌మిళంలో విడుద‌లైంది. ఊహించని విదంగా త‌మిళంలో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేప‌థ్యంలోనే తెలుగులో కూడా  ఈ జ‌న‌వ‌రి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ప్రమోష‌న‌ల్ కార్యక్రమాల‌ను మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగా విక్టరీ వెంక‌టేష్ చేతుల మీదుగా ఈ చిత్రం తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయించారు. సంతానం కామెడీ న‌వ్వులు పూయిస్తోంది. విశాల్ డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రైల‌ర్ అదిరిపోయింది.ఈ మూవీలో విశాల్‌, సంతానం, వ‌రల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, అంజ‌లిలు ప్రధాన పాత్రలో న‌టించిన ఈ చిత్రంలో సోనూసూద్ కీల‌క పాత్రను పోషించారు. అయితే తాజాగా ప్రేస్ మీట్‌లో పాల్గోన్నారు మూవీ టీం ఇందులో భాగంగా హీరోయిన్ అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కు అక్కడి రిపోర్టర్‌లు.. ‘ ఈ మూవీ 12 ఇయర్స్ ముందు చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారు కదా రెమ్యూనరేషన్ ఏమైనా పెంచారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇస్తూ ఇద్దరు హీరోయిన్లు అక్కడ ఉన్న నిర్మాతని అడిగారు. ‘సార్ చెప్పండి పెంచుతారా’ అని అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన నిర్మిత తెలుగులో కూడా మూవీ హిట్ అయితే కచ్చితంగా ఇస్తా అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.