వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటన.. మరో కేసు నమోదు..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై మరో కేసు నమోదైంది.. జగన్ పర్యటనపై ఇప్పటి దాకా మొత్తం 4 కేసులు నమోదు అయ్యాయి.. అనుమతి లేక పోయినా వైఎస్ జగన్ టూర్ లో రోడ్ షో చేపట్టారని కేసు నమోదు చేశారు పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలను తీసుకొచ్చారని మరో కేసు పెట్టారు.. చిత్తూరు వైసీపీ సమన్వయ కర్త విజయానంద రెడ్డి తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.. ఇక, రోడ్డుపై మామిడికాయలు పోసి షరతులు అతిక్రమించారని.. మరో కేసు పెట్టారు.. పూతలపట్టు వైసీపీ సమన్వయకర్త సునీల్ తో పాటు 5 మంది పై కేసు నమోదైంది.. ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై మరో కేసు పెట్టారు.. ఇక, మొత్తం 4 కేసుల్లో సీసీ ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్నారు పోలీసులు.. మరికొంతమందిపై మరిన్నీ కేసులు నమోదు చేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
ఆళ్లగడ్డలో టీడీపీకి షాక్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. టీడీపీకి రాజీనామా చేశారు సిరివెళ్ల మండలం గుంపరమందిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త నీటి సంఘం చైర్మన్ కుందూరు మోహన్ రెడ్డి.. తమ రాజీనామా పత్రాన్ని సిరివెళ్ల ఎంపీడీవోకు అందజేశారు ఎంపీటీసీ తులసమ్మ.. మరోవైపు, నీటి సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసేందుకు కేసీ కెనాల్ డీఈని సంప్రదించారు కుందూరు మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, సరైన న్యాయం జరగడం లేదని ఆరోపించారు కుందూరు మోహన్ రెడ్డి. టీడీపీలో ఉండడం ఇష్టం లేకే.. పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశామని చెబుతున్నారు తులసమ్మ, మోహన్‌రెడ్డి.. అయితే, టీడీపీ నేతల ఒత్తిడి కారణంగా.. సిరివెళ్ల ఎంపీడీవో.. ఎంపీటీసీ తులసమ్మ రాజీనామాను ఆమోదించలేదని తెలుస్తోంది.. అయితే, టీడీపీ అధికారంలో ఉండగానే.. అధికార పార్టీకి ఇద్దరూ రాజీనామా చేయడం చర్చగా మారింది..
వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ నేత హాట్ కామెంట్స్.. వాళ్లను నమ్మి పూర్తిగా నష్ట పోయాం..!
గత ప్రభుత్వ హయాంలో అంతా వాలంటీర్ వ్యవస్థ ద్వారే నడిపించారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఆ వ్యవస్థే పార్టీకి నష్టం చేసింది.. ఎన్నికల్లో ఓటమికి అది కూడా కారణమని ఆ పార్టీ నేతలే కొందరు వ్యాఖ్యానించారు.. తాజాగా, పల్నాడు జిల్లా… వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. వాలంటీర్ వ్యవస్థపై హాట్ కామెంట్స్ చేశారు.. నరసరావుపేటలో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. వాలంటీర్ వ్యవస్థని నమ్ముకొని గత ఐదేళ్లు పూర్తిగా నష్ట పోయాం అన్నారు.. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూల స్తంభాలు.. కానీ, వాలంటీర్లు కాదు అని స్పష్టం చేశారు.. ప్రజలు – పాలకులకు మధ్య కార్యకర్తలను ఉంచాలి.. ఈ విషయాన్ని పార్టీ ఓడిపోయాక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని మొదటిసారి కలిసినప్పుడు చెప్పాను అని గుర్తుచేసుకున్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు వాలంటీర్ల ద్వారా అందించారు.. అదే కార్యకర్తల ద్వారా ఆ లబ్ధిని అందిస్తే ఇలా జరిగేది కాదన్నారు.. వాలంటీర్ల వల్ల వైసీపీ పార్టీ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యిందన్న ఆయన.. ఇంటికి వచ్చి వాలంటీర్లు పథకాలు ఇస్తే.. మన పార్టీ నాయకుల్ని మర్చిపోయారన్నారు.. ఇప్పుడు కేసులు కార్యకర్తలపై మాత్రమే పెడుతున్నారు.. వాలంటీర్ల మీద కాదన్నారు.. కేవలం కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే గత ఎన్నికల్లో ఓడిపోయామని వ్యాఖ్యానించారు పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి..
వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. సీఎం సీరియస్.. కీలక ఆదేశాలు
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది.. బయో కెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రో బయాలజీ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయో కెమిస్ట్రీ ఎల్ టీ గోపాలకృష్ణ, పాదాలజీ ఎల్‌టీ ప్రసాద్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు విద్యార్థినులు.. మెయిల్ ద్వారా ఒకేసారి ఫిర్యాదు చేశారు 50 మంది విద్యార్థినులు.. అయితే, ఈ ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై అధికారులను నివేదిక కోరారు సీఎం చంద్రబాబు నాయుడు.. దీంతో, సీఎంకు నివేదిక అందించారు వైద్యఆరోగ్య శాఖ అధికారులు. దీనిపై స్పందించిన సీఎం.. నిందితులపై కఠిన చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.. మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఉద్యోగిపై ఈనెల 9వ తేదీన విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు.. ఘటనను సీరియస్ గా తీసుకుని.. దీనిపై అదే రోజు కమిటీ నియమించి విచారణ చేపట్టారు అధికారులు.. నిన్న రాత్రి వరకు విద్యార్థినులతో మాట్లాడి నివేదిక సిద్ధం చేసింది విచారణ కమిటీ.. చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది.. నివేదిక ఆధారంగా లైంగిక వేధింపులకు పాల్పడిన సిబ్బందిపై చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. నిందితులపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నారు అధికారులు..
పరామర్శ పేరుతో జగన్ దండయాత్రలు.. గత ఐదేళ్లలో రైతులను పట్టించుకున్నారా..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తున్నారని విమర్శించారు.. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు.. ఎక్కువ మంది పోలీసులను పెడితే.. 2 వేల మంది పోలీసులను పెట్టారని మళ్లీ ఇప్పుడు కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. 500 మందితో వెళ్లి రైతులను పరామర్శించాలని వైఎస్ జగన్‌కు చెప్పాం.. కానీ, ఆయన చేసింది ఏంటి? అంటూ మండిపడ్డారు. గత ఐదేళ్లలో రైతులు గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా..? అని వైఎస్ జగన్‌ను నిలదీశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. 250 కోట్ల రూపాయలు మామిడి రైతుల కోసం ఈ ప్రభుత్వం కేటాయించిందని స్పష్టం చే శారు.. గతంలో ధరల స్థిరీకరణ నిధి అని ఏం చేశారు? అని ప్రశ్నించిన ఆయన.. వైఎస్ జగన్ రైతుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అంటూ మండిపడ్డారు.. అసలు, గత ఐదేళ్లలో ధర్మవరం మున్సిపాలిటీ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు.. గత ప్రభుత్వంలో కేవలం వైసీపీ వారికి మాత్రమే లబ్ధి చేశారని ఆరోపించారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
కాళేశ్వరం కమీషన్ విచారణపై సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు..!
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ తో జరిగిన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రాజెక్టు పనులు పూర్తిగా క్యాబినెట్ ఆమోదంతోనే జరిగాయన్నారు. మెడిగడ్డ పనులకు క్యాబినెట్ ఆరు సార్లు ఆమోదం తెలిపింది. అలాగే శాసనసభలో కూడా మూడుసార్లు ఆమోదం పొందింది. ఈ విషయాలకు సంబంధించి డాక్యుమెంట్లను పూర్తిగా కమీషన్‌కు అందజేశాం. కానీ, కమీషన్‌కు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లను మాకు కాపీ ఇవ్వాలని సెక్రటరీని అడిగాను అని తెలిపారు. అలాగే, నేను సీఎస్, జీఎడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీలకు లేఖ రాసాను. కానీ ముగ్గురి నుంచి సరైన సమాధానం రాలేదు. అసలు కమీషన్‌కు నిజమైన వివరాలు ఇస్తున్నారా..? లేదా..? అనే అనుమానం వస్తోందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
హిందీని ప్రేమిద్దాం.. మన దిగా భావిద్దాం.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
హిందీ భాషపై ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. బలవంతంగా.. రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.. అయితే, ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌లో నిర్వహించిన హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొని హిందీ వివస్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. హిందీని ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దాం అని వ్యాఖ్యానించారు.. మన దేశం వివిధ సంస్కృతులు ఉంటాయి.. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందన్నారు.. విదేశస్తులు మన భాష నేర్చుకుంటారు.. మనం హిందీ అంటే ఎందుకు భయపడాలి..? అని ప్రశ్నించారు. హిందీ జబర్దస్త్ వస్తువు ఏమీ కాదు.. జర్మనీ, ఇతర భాషలు నేర్చుకుంటున్నాం.. కానీ, హిందీతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. హిందీ మనది అనడంలో సిగ్గు ఎందుకు..? హిందీ నీ ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దాం అన్నారు పవన్ కల్యాణ్.. బెంగాలీ గీతం జాతీయ గీతం అయింది.. అబ్దుల్ కలాం మిస్సైల్ మన్ అయ్యారు.. దక్షిణ భారత దేశస్తుడు చేసిన జెండా భారత జెండా అయింది.. ప్రతీ భాష జీవ భాష.. రాష్ట్ర భాష హిందీ.. రాష్ట్ర భాష హిందీని స్వాగతిస్తున్నారు.. మాతృ భాష మన అమ్మ భాష అయితే.. పెద్దమ్మ భాష హిందీగా అభివర్ణించారు.. హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేయడమే అవుతుందన్నారు పవన్ కల్యాణ్.. ఉర్దూను, పర్షియన్ ను అంగీకరించి.. హిందీని వ్యతిరేకించడం అవివేకం అవుతుందన్ఆనరు.. 31 శాతం సినిమాలు హిందీ లో డబ్ అవుతున్నాయి.. వ్యాపారానికి హిందీ కావాలి.. కానీ, నేర్చుకోవడానికి అభ్యంతరం ఎందుకు? అని నిలదీశారు పవన్ కల్యాణ్..
హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట.. బీజేపీ వేసిన పరువు నష్టం కేసు నిలిపివేత
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. సిద్ధరామయ్యపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో ‘‘అవినీతి రేటు కార్డు’’ ప్రకటనపై బీజేపీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఫిర్యాదులో సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పేర్లు పొందిపరిచారు. 2023 ఎన్నికల ప్రచారంలో బీజేపీ లంచం తీసుకున్నట్లు ప్రకటనలో కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా దిగువ కోర్టు కార్యకలాపాలను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. దీంతో ముఖ్యమంత్రికి మధ్యంతర ఉపశమనం లభించింది. 2023 ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ముందు రోజు వార్తాపత్రికల్లో కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులకు లంచాల రేట్లు నియమించిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ప్రకటనతో తమ పరువు తీశారని బీజేపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ ప్రకటనను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య, డీకే.శివకుమార్, రాహుల్‌గాంధీలపై బీజేపీ క్రిమినల్ పరువు నష్టం దావా వేసింది. తాజాగా ఈ కేసును తాత్కాలికంగా ధర్మాసనం నిలిపివేసింది. దీంతో కాంగ్రెస్ నాయకులకు భారీ ఊరట లభించింది.
ఫ్లాట్‌లో పాక్ నటి మృతదేహం లభ్యం.. 9 నెలల క్రితం ఏం జరిగిందంటే..!
పాకిస్థాన్‌లో ఆమె గుర్తింపు కలిగిన నటి. దాదాపు 9 నెలల నుంచి ఆమె జాడ కనిపించలేదు. ఆమె ఊసు లేదు. పలుకు లేదు. కనీసం నా అన్నవాళ్లు కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. ఆమె ఎక్కడుందో కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతం ఆమె శవమై కనిపించింది. అసలేం జరిగింది? చనిపోయి కొన్ని నెలలైంది. ఇన్ని నెలలైనా ఎవరూ.. ఎందుకు పట్టించుకోలేదు. తాజాగా పోలీసులు విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హుమైరా అస్గర్ అలీ.. పాకిస్థాన్ నటి.. గత మంగళవారం అపార్ట్‌మెంట్‌లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. అది కూడా అద్దె రావడం లేదంటూ యజమాని ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లాట్‌లోంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం చేసేందుకు కూడా వీలులేకుండా కుళ్లిపోయిందని వైద్యులు తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇరుగుపొరుగు వారిని విచారించారు. తమకు గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కనిపించిందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో సెప్టెంబర్ నెల నుంచి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అంటే 2024, అక్టోబర్‌లో చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించారు.
ఏంటి.. కోహ్లీ మరో టీ20 లీగ్ లో ఆడబోతున్నాడా..? నిజమెంత..?
టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అలంటి వార్త మరొకటి చక్కర్లు కొడుతుంది. భారత క్రికెట్లో ఒక లెజెండ్ గా ఎదిగిన విరాట్ కోహ్లీ.. ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ఎన్నో పరుగులు చేసాడు. అంతే కాదు ఎంతోమంది యంగ్ ప్లేయర్లకు ఒక ఇన్‌స్పిరేషన్‌గా కూడా నిలుస్తున్నాడు. తనదైన ఆటతీరుతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నాడు. అయితే, ప్రస్తుతం టెస్ట్‌లు, టీ20 ఫార్మాట్ లకు గుడ్‌బై చెప్పి వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యాడు. అలాగే ఐపీఎల్ లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. అంతేకాదు, గత ఐపీఎల్ సీజన్లో RCB ట్రోఫీ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోహ్లీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లోనూ అతడు ఆడే అవకాశం ఉందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దీనిపై ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అదేంటంటే..
టైటిల్ ఫేవరేట్ సబలెంకకు షాక్.. ఫైనల్ లో అనిసిమోవా..!
ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ ఉమెన్స్ విభాగంలో, టైటిల్ ఫేవరేట్ గా ఉన్న సబలెంక (Aryna Sabalenka)కు షాక్ తగిలింది. సెమిస్ లో అమెరికా ప్లేయర్ అనిసిమోవాపై ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో టైటిల్ రేసులో ఇప్పటివరకు బలమైన ఫేవరేట్ గా నిలిచిన సబలెంక, చివరకు టోర్నీని వీడాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది 3వ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగు పెట్టాలన్న కల నెరవేరలేదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదటి సెట్లో తొలి నాలుగు పాయింట్లతో సమానంగా ఉండగా.. ఆ తర్వాత అనిసిమోవా (Amanda Anisimova) బ్రేక్ సాధించి 5-4గా తీసుకెళ్లింది. ఆ తరవాత సర్వీస్ కూడా నిలబెట్టుకోవడంతో, 6-4తో మొదటి సెట్ విజయం సాధించింది. ఇక 2వ సెట్లో సబలెంక పుంజుకుని సెట్ ను కాపాడుకుంది. కానీ 3వ సెట్ లో మళ్లీ వరుస తప్పిదాలు చేసింది. ముఖ్యంగా సర్వీస్ లు, డబుల్ ఫాల్ట్ చేసి గేమ్ పాయింట్స్ అన్నీ అనిసిమోవాకి ఇచ్చింది.
కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు – హింసను ఖండించిన నిర్వాహకులు
బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మకి చెందిన కెనడాలోని కేఫ్ పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన ఘటన తెలిసిందే. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గల సర్రే ప్రాంతంలో ‘కాప్స్ కేఫ్’ (Kap’s Cafe) పేరుతో కపిల్ శర్మీ దీన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే తాజాగా, ‘కాప్స్ కేఫ్’ నిర్వాహకులు ఈ దాడిని ఖండిస్తూ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక ‘ రుచికరమైన కాఫీ, స్నేహపూర్వకమైన సంభాషణలతో కస్టమర్‌లకు ఆనందాన్ని పంచాలనే ఆశతో ఈ కాప్స్ కేఫ్‌ను ప్రారంభించాం. ఇక్కడ హింస సృష్టించడం బాధాకరం. ఈ హింసకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడతాం. ఏమాత్రం వెనక్కి తగ్గం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఘటన నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా కెనడా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో నుంచి తొమ్మిది రౌండ్లు కేఫ్‌పై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయికేఫ్‌పై కాల్పులకు ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ బాధ్యత వహించారు. కేఫ్‌పై తానే కాల్పులు జరిపినట్లు ప్రకటించారు. ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ గా మారింది.
టాలీవుడ్‌కు అవమానం.. ఛీ కొట్టిన ప్రముఖ పోర్టల్
ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అని ట్రీట్ చేసిన నార్త్ సినీ పెద్దలకు సౌత్ ఇండస్ట్రీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది టాలీవుడ్. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపచేసేలా ఎదిగింది. ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి బీటౌన్ ముందు తల ఎగరేసింది. కానీ ఇప్పుడు ఇంట గెలవలేకపోతుందా అంటే ఔననే ఫ్రూవ్ చేస్తోంది ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ. ఈ సంస్థ సినిమాలకు రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇస్తుంది. అలాగే ఈ ఏడాది హాఫ్ ఇయర్లీలో అత్యధిక ప్రజాదరణ పొందిన టాప్ 10 సినిమాల జాబితాను రిలీజ్ చేస్తే ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా లేకపోవడం ఆశ్చర్యకరం. ఈ ఆరు నెలల కాలంలో టాలీవుడ్ నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిల్లో కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పట్టం కట్టారు ఆడియన్స్. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, సింగిల్, శుభం, కోర్టు చిత్రాలు లాభాల పంట పండిచాయి. కుబేర, ఢాకూ మహారాజ్, తండేల్ సక్సెస్ అందుకున్నాయి. కానీ ఈవేమీ కూడా ఐఎండీబీలో ఫస్ట్ పది స్థానాల్లో చోటు దక్కించుకోకపోవడం చూస్తుంటే ప్రజాదరణ పొందే సినిమాలు టాలీవుడ్ ఇవ్వడం లేదా అన్నడౌట్ రాకమానదు. ఇందులో మరో విశేషమేమిటంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు ఐఎండీబీలో టాప్ రేటింగ్‌లో నిలవడం కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. జనవరి 1 నుండి జులై 1 మధ్య అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 భారతీయ చిత్రాల లిస్ట్ చుస్తే 1 .చావా. 2. డ్రాగన్ (తమిళ్), 3. దేవా – హిందీ 4. రైడ్ – హిందీ, 5. రెట్రో (తమిళ్) 6. ది డిప్లామాట్ – (హిందీ) 7. ఎల్2 ఎంపురన్ (మళయాలం) 8. సితారే జమీన్ పర్ (హిందీ), 9. కేసరి చాప్టర్ 2 (హిందీ), 10. విదాముయర్చి (తమిళ్) స్తానం సంపాదించాయి.