Site icon NTV Telugu

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

సీఎ చంద్రబాబు, మంత్రి లోకేష్‌కి ముద్రగడ లేఖ.. కాపులనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు..!
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (ముద్రగడ పద్మనాభం) ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు సమాజంపై జరుగుతున్న చర్యలు తీవ్ర అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇక, కాపు కులం చంద్రబాబుపై కోపంగా ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పట్ల ఉన్న ప్రేమతోనే టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నది తన అభిప్రాయమని ముద్రగడ లేఖలో తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని, అయితే పవన్‌ కల్యాణ్‌ మద్దతుతోనే వారు మళ్లీ రోడ్డెక్కారని వ్యాఖ్యానించారు. కాపు కులంపై చంద్రబాబు ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటారని ఆరోపించిన ముద్రగడ, ప్రస్తుతం రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలన కొనసాగుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇది దహన కాండను తలపిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆశ్రయించి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన విధించాలని కోరితే, ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అలాగే తిరుమల లడ్డు విషయంలో ప్రభుత్వం చెప్పిన మాటలు అబద్ధమని తేలిందని, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాపు అంశాన్ని హాట్‌టాపిక్‌గా మార్చింది.

అరకు ఉత్సవ్​ – 2026.. ఆదివాసీ ఫ్యాషన్‌ షోలో మెరిసిన కలెక్టర్లు..
ప్రకృతి అందాల నడుమ నిర్వహిస్తున్న అరకు ఉత్సవ్–2026 చివరి రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఐఏఎస్ అధికారులు స్వయంగా పాల్గొని అందరి మనసులు దోచుకున్నారు. వీరు మరెవరో కాదు.. భార్యాభర్తలైన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్.. అరకు ఉత్సవ్ చివరి రోజున స్థానిక గిరిజన బాలికలతో కలిసి ప్రత్యేకంగా ఆదివాసీ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, కలెక్టర్ విజయ్ కృష్ణన్ సంప్రదాయ గిరిజన వేషధారణలో ర్యాంప్‌పై నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు పాడేరు ఐటీడీఏ పీవో తిరువనిశ్రీ పూజ.. అల్లూరి అసిస్టెంట్ కలెక్టర్, టీడీపీ నాయకులు గిడ్డి ఈశ్వరి, దొన్నుదొర.. కూడా ఫ్యాషన్ షోలో పాల్గొని కార్యక్రమానికి మరింత వన్నె తీసుకొచ్చారు. సాధారణంగా తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండే ఐఏఎస్ అధికారులు ఇలా ఆడిపాడుతూ ప్రజలతో మమేకమవడం చూసి, కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు. అధికారుల భాగస్వామ్యం వల్ల ఫ్యాషన్ షో మరింత ప్రత్యేకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇలా ఆటవిడుపుగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారులు పాల్గొంటే వారి పనితీరు మరింత ఉత్సాహంగా ఉంటుందని, ప్రజలతో అనుబంధం కూడా బలపడుతుందని స్థానికులు వ్యాఖ్యానించారు. మొత్తానికి అరకు ఉత్సవ్–2026లో ఈ ఫ్యాషన్ షో ఒక గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచింది.

బంగ్లాదేశ్‌ జైలు నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు..
బంగ్లాదేశ్‌ జైలులో 3 నెలల పాటు మగ్గిన మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు.. మూడు నెలల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ జైలులో నిర్బంధంలో ఉన్న 9 మంది మత్స్యకారులు విడుదలై, మూడు రోజుల క్రితం విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. భారత ప్రభుత్వ చొరవతో పాటు దౌత్య పరమైన ప్రయత్నాల ఫలితంగా, మత్స్యకారులు మూడు నెలల్లోనే బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. స్వదేశానికి చేరుకున్న మత్స్యకారులను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇక, విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారుల అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కొడుకులు, భర్తలు క్షేమంగా తిరిగిరావడంతో కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు భారత ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దు సముద్ర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మత్స్యకార సంఘ నాయకులు కోరారు. ఈ సంఘటనతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.

హైకోర్టులో జోగి రమేష్‌, జోగి రోహిత్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌..
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ న ఏత, మాజీ మంత్రి జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన నివాసానికి తక్షణ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించడంతో, మధ్యాహ్నం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో జోగి రమేష్ కుమారుడు జోగి రోహిత్ కుమార్ కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ నివాసంపై దాడి జరిగే అవకాశం ఉందని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా, వారు స్పందించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. నివాసంపై గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేశారని, ఆ సమయంలో పోలీసులు అడ్డుకోలేదని పిటిషన్‌లో ఆరోపించారు. దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆధారాలతో సహా హైకోర్టుకు సమర్పించినట్లు జోగి రోహిత్ తెలిపారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనున్న నేపథ్యంలో, ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ, న్యాయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.

మరోసారి సీబీఐ విచారణకు అయినా సిద్ధం.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే దాడులు..
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దాడులు అన్నీ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని ఆరోపించారు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి.. తాజా పరిణామాలపై తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి NDDB రిపోర్టులో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారని, అయితే సీబీఐ చార్జ్‌షీట్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదని స్పష్టంగా తేల్చిందని భూమన గుర్తుచేశారు. ఈ అంశంలో వాస్తవాలు బయటకు రావడంతో టీడీపీ, జనసేన ఆత్మరక్షణలో పడి ఎదురు దాడులకు దిగుతున్నాయని విమర్శించారు. నెయ్యి కల్తీ దోంగలంటూ వైఎస్‌ జగన్‌, భూమన, వైవీ సుబ్బారెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని.. కానీ, ప్రజలు వాటిని నమ్మడం లేదని భూమన అన్నారు. ప్రజలు నమ్మడం లేదనే నిరాశతోనే ఇప్పుడు వైసీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా కూడా మూడు వేల మందితో దాడులు చేయించారని భూమన మండిపడ్డారు.. రాంబాబు మాట్లాడిన మాటలను మేము సమర్థించడం లేదు.. అయినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా దాడులు జరగడం దుర్మార్గం అని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇప్పుడు రాంబాబు, జోగి రమేష్‌లపై వరుస దాడులు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు. 2018లో భోలేబాబా డైరీకి అనుమతులు ఇచ్చింది చంద్రబాబే అని గుర్తు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దమా కాదా అనేది కోర్టులు నిర్ణయిస్తారు.. సిట్ కాదు..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ చీఫ్‌, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్‌ను “అక్రమం” అని సజ్జనార్ ఎలా ప్రకటిస్తారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం SIT చీఫ్‌కు లేదు న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ఆరోపణను నేరంగా పరిగణించరాదు అని సూచించారు. రాజ్యాంగ సూత్రం పోలీసులు దర్యాప్తు చేయాలి, తీర్పు చెప్పే హక్కు లేదు ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలి.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 5(2), ఐటీ యాక్ట్, PUCL తీర్పు ప్రకారం పరిశీలన అవసరం అధికారిక సందేశాల్లో “అక్రమ ట్యాపింగ్” పదప్రయోగం పాక్షికతకు నిదర్శనం SIT చీఫ్ ముందే అభిప్రాయం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తోంది అని హరీష్ రావు ఆరోపించారు. అయితే, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహారం మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ పై కేసులో సిట్ ఛీఫ్ సజ్జనార్ భాష పలు అనుమానాలకు తావిస్తుంది అని హరీష్ రావు అన్నారు. దర్యాప్తు న్యాయంగా ఉండటమే కాదు, న్యాయంగా కనిపించాలి అన్నారు. సుప్రీం కోర్టు ముందస్తు తీర్పులు ప్రజల న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. పోలీస్ ప్రకటనల ద్వారా రాజకీయ కథనాలు సృష్టించడం అనుచితం కోర్టులే తీర్పు చెప్పాలి అని వెల్లడించారు. పోలీస్ సందేశాలు కాదు రాజ్యాంగ పరిమితులు దాటితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

వీల్‌చైర్‌లో అసెంబ్లీకి వచ్చిన తేజస్వి యాదవ్.. ఏమైందంటే..!
ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ సోమవారం అసెంబ్లీకి వీల్‌చైర్‌లో వచ్చారు. అధికారులు ఆయన్ను వీల్‌చైర్‌లో తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీహార్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తేజస్వి యాదవ్ వీల్‌చైర్‌లో వచ్చారు. దీంతో ఆయనకు ఏమైందంటే మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎడమ కాలి బొటనవేలుపై ఏదో గాయమైంది. నడవలేని పరిస్థితి తలెత్తడంతో వీల్‌చైర్‌లో వచ్చారు. అయితే ఏమైందంటే విలేకర్లు ప్రశ్నించగా.. ‘‘గోరు ఊడిపోయింది.. ఇలాంటివి కొన్ని సార్లు జరుగుతుంటాయి.’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవలే తేజస్వి యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అలాగే సోదరుడు తేజ్ ప్రతాప్ కూడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో ఇద్దరూ కలిశారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయింది.

సీఎం యోగిని కలిసిన చిన్నారి.. ఏం కోరిక కోరిందంటే..!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిన్నారులతో చాలా సరదాగా గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా చిన్నారులు కనిపించారంటే చాక్లెట్లు ఇస్తుంటారు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఒక బుడ్డోడితో మాట్లాడుతూ ఏం కావాలని అడిగితే ముఖ్యమంత్రి చెవిలో ‘చిప్స్’ కావాలని అడిగాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి సోమవారం లక్నోలో యోగి ఆదిత్యనాథ్ ‘‘జనతా దర్శన్’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రజలను నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఒక చిన్నారి వినతిపత్రం తీసుకుని ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చింది. అర్జీ తీసుకున్న యోగి.. ఏం కావాలని అడిగితే పాఠశాల ప్రవేశం కల్పించేలా సాయం చేయాలని కోరింది. ఈ సందర్భంగా చిన్నారితో చాలా సేపు మాట్లాడి చాక్లెట్ ఇచ్చారు. సంభాషణ అనంతరం పాఠశాలలో ప్రవేశం లభించేలా చూడాలని అధికారులకు యోగి ఆదేశించారు.

వీగన్ లెదర్ బ్యాక్‌, 50MP రియల్ కెమెరాతో రూ.15 వేలలోపే Samsung Galaxy F70e
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన కొత్త Galaxy F70 సిరీస్‌ను భారత మార్కెట్‌లో త్వరలో విడుదల చేయనుందని అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్‌లో భాగంగా రాబోతున్న Samsung Galaxy F70e స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 లోపే ఉండనుందని లీకులు సూచిస్తున్నాయి. ఈ ఫోన్ Flipkart మరియు Samsung India ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. శామ్‌సంగ్ ఇంకా అధికారిక లాంచ్ తేదీ, మోడళ్ల పేర్లను ప్రకటించనప్పటికీ, Galaxy F70 సిరీస్‌లో ఒక మిడ్-రేంజ్ ఫోన్‌తో పాటు ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఉండనున్నట్లు టీజ్ చేసింది. తాజాగా ఆన్‌లైన్‌లో కనిపించిన రెండర్‌ల ప్రకారం Galaxy F70e డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Samsung Galaxy F70e వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో ఆకర్షణీయంగా కనిపించనుంది. ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ ఉండగా, చుట్టూ కొద్దిగా మందపాటి బెజెల్స్ కనిపించనున్నాయి. కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కీలు ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ కనీసం నలుపు రంగు ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉండగా, 120Hz రిఫ్రెష్ రేట్కు మద్దతు లభించనుంది. ప్రాసెసర్ & స్టోరేజ్ విషయానికి వస్తే.. Galaxy F70e స్మార్ట్‌ఫోన్‌కు MediaTek Dimensity 6300 చిప్‌సెట్ శక్తినిస్తుందని తెలుస్తోంది. ఇది.. 6GB వరకు RAM, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రావచ్చు. అదనంగా మైక్రో SD కార్డ్ మద్దతు కూడా ఉండే అవకాశం ఉంది.

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నిన్నామొన్నటి దాకా బంగారం, వెండి ధరల గురించి అన్ని షాకింగ్ న్యూస్‌లే వినాల్సి వచ్చేది. ప్రతిరోజు వెండి, బంగారం ధరలు విశ్వరూపం సృష్టిస్తున్నాయని మాట్లాడుకుని దుస్థితి తలెత్తింది. ఇప్పుడు పరిస్థితి మారింది. తాజాగా ఆభరణాల ధరలు దిగొస్తున్నాయి. ఏ ప్రభావమో తెలియదుగానీ.. ఈరోజు తులం గోల్డ్‌‌పై రూ.9,050 తగ్గగా.. కిలో వెండిపై ఏకంగా రూ.50,000 తగ్గింది. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ.3,00,000 దగ్గర అమ్ముడవుతోంది. తులం గోల్డ్‌పై రూ.9,050 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,51,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.8,300 తగ్గడంతో రూ.1,38,900 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.6,790 తగ్గడంతో రూ.1,13,650 దగ్గర ట్రేడ్ అవుతోంది. హమ్మయ్య వెండి బాగా శాంతించింది. కిలో వెండిపై ఏకంగా రూ.50,000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.3,00, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్.. మరోసారి సెన్సార్
దళపతి విజయ్ కెరీర్‌లో  చివరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్. విజయ్ 69వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెన్సార్ బోర్డుతో జరుగుతున్న న్యాయపోరాటం కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాను సెన్సార్ బోర్డుకు సమర్పించినప్పటికీ, కొన్ని అభ్యంతరాల వల్ల సెన్సార్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. మద్రాస్ హైకోర్టులో ఈ సెన్సార్ వివాదంపై విచారణ జరుగుతోంది. కోర్టు నుంచి తుది తీర్పు వెలువడిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేట్ లభిస్తుంది. అప్పటివరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఏ విషయాన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 20 నిమిషాల ఫుటేజ్ ను తొలగించి కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేసి మరోసారి సెన్సార్ చేసేందుకు పంపారు మేకర్స్. సెన్సార్ నుండి ఎటువంటి అడ్డంకులు లేకుంటే ఈ నెల 13న లేదా చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.   మరోవైపు జననాయగన్ రిలీజ్ వాయిదా పడడంతో నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ ఆర్డిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తమ ప్రొడక్షన్ లో తరువాత సినిమాలలో విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నాని సరసన పూజా హెగ్డే.. ఫస్ట్ టైమ్ ఫ్రెష్ జోడి
నేచురల్ స్టార్ నాని వరుస హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ‘సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజీత్‌తో కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రేజీ కాంబో గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే వార్త బయటకొచ్చింది. కాగా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నెల నుంచి మొదలుకానుందట. ఇప్పటికే సుజీత్ అదిరిపోయే స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. నానిని మనం ఇప్పటివరకు చూడని ఒక సరికొత్త స్టైలిష్ లుక్‌లో, పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో సుజీత్ చూపించబోతున్నారు. ఇక మరోక విషయం ఏంటి అంటే.. ఈ సినిమాలో నాని సరసన ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం. నాని, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో, వీరిద్దరి జోడీ స్క్రీన్ మీద చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉండబోతోంది. అంతేకాదు ఈ మూవీ కోసం సుజీత్ చాలా టైమ్ తీసుకుని, విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమాను 2027 లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #NaniSujith షూటింగ్ అప్‌డేట్ తెగ వైరల్ అవుతోంది. నాని తన నటనతో, సుజీత్ తన మేకింగ్ స్టైల్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి!

నేచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శౌర్యువ్ సినిమా క్యాన్సిల్..
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హాయ్ నాన్న’  బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో అద్భుతమైన ప్రేమ కథతో హాయ్ నాన్న ప్రేక్షకులను మెప్పించి భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ప్యారడైజ్ షూట్ ఫినిష్ అవగానే ఈ సినిమా స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. నాని ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో మరో సినిమాను అనౌన్స్ చేసాడు. వీటితో పాటు ‘హిట్ 4’ షూటింగ్ పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు నాని. ఈ బిజీ షెడ్యూల్ వలన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శౌర్యువ్ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడని సమాచారం. వాస్తవానికి ఈ సినిమాను ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని శౌర్యువ్ ప్లాన్ చేశారు. ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ కాంబోపై అంచానాలు పెట్టుకున్నారు. కానీ నానికి ఉన్న ఇతర కమిట్మెంట్స్ వలన శౌర్యువ్ సినిమాని క్యాన్సిల్ చేసేసాడు. మరి శౌర్యువ్ ఈ కథని ఏ హీరోతో చేస్తాడో చూడాలి.

Exit mobile version