NTV Telugu Site icon

Off The Record: లెక్క సరిపోయిందా మరి?

Maxresdefault (3)

Maxresdefault (3)

పొలిటికల్‌ ఈక్వేషన్స్‌లో భాగంగా ఆయనకు పెద్ద పదవి ఇస్తారని భావించారు. అదిగో.. ఇదిగో అని ప్రచారం సాగింది కానీ.. ప్రకటన రాలేదు. వస్తాది అనుకున్న పదవీ దక్కలేదు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రొటోకాల్ కలిగిన పోస్ట్‌ ఇవ్వడంతో లెక్క సరిపోయిందని భావిస్తున్నారట అధికారపార్టీ నేతలు.

రెండేళ్లకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలహీన వర్గాల నేతగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి బండ ప్రకాష్. కొన్నేళ్లుగా ముదిరాజ్ సామాజికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఒకట్రెండు పదవులు కూడా నిర్వహించారు. అలాంటి ప్రకాష్‌ను సీఎం కేసీఆర్ పిలిచి రాజ్యసభ సభ్యుడిని చేయడంతో గులాబీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. రెండేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తర్వాత అనూహ్యంగా ఆ పోస్టుకు రిజైన్‌ చేసి.. శాసనమండలి సభ్యుడయ్యారు. అప్పట్లో ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ కూడా బండ ప్రకాష్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకురావడం ఓ కారణంగా చర్చ సాగింది. అప్పుడే ప్రకాష్‌ను మంత్రిని చేస్తారని ఓ రేంజ్‌లో ప్రచారం సాగినా.. కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఏమైందో ఏమో చాన్నాళ్లు ఎమ్మెల్సీగానే ఉండిపోయారు. ఇప్పుడు తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ప్రొటోకాల్ పదవిలో కుదురుకున్నారు ప్రకాష్‌.

ముదిరాజ్‌లకు ప్రాధాన్యం..?
గత ఏడాది జూన్‌ 3 నుంచి శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పోస్టు ఖాళీగానే ఉంది. బండ ప్రకాష్‌ను కేబినెట్‌లో తీసుకోకపోతే మండలి డిప్యూటీ ఛైర్మన్‌ను చేస్తారని అప్పట్లో చర్చ సాగింది. కానీ.. ప్రకాష్‌ పేరు ఖరారు చేయడానికి ఇప్పటి దాకా సమయం తీసుకున్నారు. బండ ప్రకాష్‌, ఈటల రాజేందర్‌ ఇద్దరూ ముదిరాజ్‌ సామాజికవర్గమే. ఈటల బీజేపీలోకి వెళ్లిన తర్వాత ముదిరాజ్‌లకు కేబినెట్‌లో చోటు కల్పిస్తారని.. అందుకోసమే బండ ప్రకాష్‌ను తీసుకొచ్చారని అనుకున్నారు. తెలంగాణలో బలమైన సామాజికవర్గం కావడంతో ముదిరాజ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చ కూడా అధికారపార్టీలో సాగింది. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాల తర్వాత పరిణామాలు మారిపోయాయి. కేబినెట్‌లోకి ప్రకాష్‌ ఎంట్రీ ఆగిపోయిందని చెవులు కొరుక్కున్నారు.

ఎన్నికలు.. ఇతర సమీకరణాలతో మండలి డిప్యూటీగా ఎంపిక
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ముదిరాజ్‌లకు తప్పకుండా ప్రొటోకాల్ పదవి ఇవ్వాలనే ఆలోచనకు అధిష్ఠానం వచ్చిందట. అందుకే బండ ప్రకాష్‌ను శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ను చేశారని అనుకుంటున్నారు. ఈటల బీజేపీలో యాక్టివ్‌గా ఉండటం.. ఇతర విపక్ష పార్టీలు ముదిరాజ్‌ సామాజికవర్గం ఓట్లపై గురిపెట్టడంతో అధిష్ఠానం అలర్ట్‌ అయినట్టు చెబుతున్నారు. రాజ్యసభ నుంచి శాసనమండలికి ఏ ఉద్దేశంతో ప్రకాష్‌ను వెనక్కి తీసుకొచ్చారో.. ఆ పని పూర్తి చేయాలని తలంచి రాష్ట్రంలో పెద్దల సభకు డిప్యూటీని చేసేశారు. మొత్తానికి సామాజిక లెక్కలు బండ ప్రకాష్‌ నిరీక్షణకు తెరపడింది. ప్రొటోకాల్ పదవి దక్కింది.