బాలీవుడ్ బయోపిక్స్ ట్రెండ్ లో మరో స్పోర్ట్స్ డ్రామా యాడ్ కాబోతోంది. భారత్ తరుఫున వింటర్ ఒలంపిక్స్ లో ఆరుసార్లు పాల్గొన్న అథ్లెట్ శివ కేశవన్ జీవిత కథ తెరకెక్కనుంది. హిమాచల్ లోని మనాలీలో పుట్టిన శివ కేశవన్ ‘ల్యూజ్’ అనే మంచు క్రీడలో ఇండియా తరుఫున పాల్గొన్న మొదటి క్రీడాకారుడు. అంతే కాదు మొత్తం ఆరుసార్లు ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహించగా అందులో రెండు సార్లు… 1998, 2002 వింటర్ ఒలంపిక్స్ లో… ఒకే ఒక్కడుగా వెళ్లాడు! విశ్వ క్రీడల్లో ఆయన పతకాలు సాధించకున్నా దేశ పతాకాన్ని మాత్రం వింటర్ ఒలంపిక్స్ వేదికపై రెసరెపలాడించాడు. ఏషియన్ ల్యూజ్ ఛాంపియన్ షిప్స్ లో మాత్రం శివ కేశవన్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆయన పేరున ఆసియా స్థాయిలో ఎన్నో రికార్డులున్నాయి.
అత్యంత అరుదైన ఆటలో ఆత్మ విశ్వాసంతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన భారత అథ్లెట్ శివ కేశవన్ పై బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఆసక్తి కనబరుస్తున్నాడు. చాలా ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న ఆయన నటుడే కాక ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. కొన్ని చిత్రాలకి గతంలో కథలు అందించాడు. అలా రచయిత, నటుడుగా నిలదొక్కుకున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారి దర్శకత్వంతోనూ సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నాడు. కునాల్ కపూర్ తీయబోయే శివ కేశవన్ బయోపిక్ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కునాల్ స్వయంగా తాను ఇండియాస్ మోస్ట్ ఫేమస్ వింటర్ ఒలంపిక్స్ అథ్లెట్ స్టోరీ బిగ్ స్క్రీన్ పై చూపించబోతున్నానని ప్రకటించాడు. చూడాలి మరి, శివ కేశవన్ వెండి తెర వింటర్ ఒలంపిక్స్ ఎలా ఉండబోతున్నాయో!