ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ‘లైగర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదలచేయాలన్నది నిర్మాతలు కరణ్ జోహార్, పూరి, ఛార్మి ఆలోచన. ఆ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకూ శ్రీకారం చుట్టారు. అయితే… ఈ సినిమా విడుదల కంటే ముందే పూరి జగన్నాథ్ – విజయ్ దేవకొండతో ‘జన గణ మన’ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీతో శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. దీనిని ‘లైగర్’ మాదిరే పూరి కనెక్షన్స్ తో కలిసి కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నాడు. విశేషం ఏమంటే… ఈ సినిమా షూటింగ్ ను ఈ నెలాఖరులో ప్రారంభించడానికి పూరి జగన్నాథ్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాడు.
అలానే… ఆగస్ట్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలన్నది పూరి ప్లాన్ అట! అంతేకాదు… ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను యు.ఎస్.ఎ. లో మొదలు పెట్టబోతున్నారట. పూరి జగన్నాథ్ ‘జన గణ మన’ కథను రియల్ ఇన్సిండెంట్స్ ఆధారంగా తెరకెక్కించబోతున్నాడట. గత కొన్ని సంవత్సరాలుగా జాతిని కుదిపేసిన హత్యలు, మానభంగాలు, హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ‘జన గణ మన’ చిత్రం ఉంటుందని అంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన పూరి జగన్నాథ్, మరో లెవెల్ లో ‘లైగర్’ను తెరకెక్కించాడు. ఆ సినిమా మేకింగ్ ఇచ్చిన కిక్ తో ఇప్పుడు ‘జన గణ మన’ తీయబోతున్నాడు. మరి ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో సంచలనం సృష్టిస్తాయో చూడాలి.