దగ్గుబాటి హీరోలుగా పేరొందిన బాబాయ్-అబ్బాయ్ వెంకటేశ్, రానా తమ మకాం ను ముంబైకి మార్చారు. తెలుగువారయిన ఈ హీరోలు ముంబైలో ఎందుకు మకాం వేస్తున్నారనే డౌట్ రావచ్చు. కానీ, ఈ ఇద్దరు హీరోలు కలసి రానా నాయుడు
అనే వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ సీరీస్ షూటింగ్ కోసమే బాబాయ్-అబ్బాయ్ ఇద్దరూ ముంబైలో వాలిపోయారు. రానాయేమో కొత్త పెళ్లి కొడుకు కాబట్టి, తన భార్య మిహీకా బజాజ్ తో కనిపించారు. రానాతో పాటు వెంకటేశ్ కూడా ముంబైలో దర్శనమిచ్చాడు. కరణ్ అన్షుమన్, సుపర్ణ వర్మ సంయుక్తంగా రానా నాయుడు
సీరిస్ ను తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో రానా కలసి నటించిన భీమ్లా నాయక్
త్వరలో జనం ముందుకు రానుంది. అలాగే వెంకటేశ్ కూడా వరుణ్ తేజ్ తో నటించిన ఎఫ్-3
ని పూర్తి చేశారు. తమ తమ కమిట్అం మెంట్స్ పూర్తి చేసిన ఈ బాబాయ్-అబ్బాయ్ రానా నాయుడు
షూటింగ్ నిమిత్తమే ముంబైలో వాలినట్లు సమాచారం.
ఇక రానా నాయుడు
టైటిల్ లో తెలుగుదనం కనిపిస్తోంది. కానీ, ఇది అమెరికాలో రూపొంది, జనాన్ని ఎంతగానో అలరించిన రే డోనోవాన్
సీరిస్ ఆధారంగా తెరకెక్కుతోన్న సీరిస్. రే డోనోవాన్ కథ ఆసక్తికరంగా ఉంటుంది. రే డోనోవాన్ తన దగ్గరకు వచ్చే సెలబ్రిటీ క్లయింట్స్ కు కావలసినవి సమకూరుస్తూ ఉంటాడు. వారి నేర చరిత్రను కూడా మసిపూసిమారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తాడు. తన వద్దకు వచ్చే వారి నుండి అధిక మొత్తంలో బిల్లు తీసుకున్నా, వారిని సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దే పనిలో రే డోనోవాన్ ఉంటాడు. అతని వల్ల కుటుంబసభ్యులు, ముఖ్యంగా అతని సోదరులు ఆనందంగా ఉంటారు. కానీ, అతని భార్యవల్ల సమస్యలు వస్తుంటాయి. ఇదిలా ఉంటే, నేరచరిత్ర కలిగిన రే డోనోవాన్ తండ్రి మిక్కీ డోనోవాన్ జైలు నుండి విడుదలవుతాడు. అప్పటి నుంచీ మరిన్ని సమస్యలు రే డోనోవాన్ చుట్టు ముడతాయి. వాటి నుండి రే ఎలా తప్పించుకున్నాడు అన్నదే మిగిలిన కథ. మరి ఈ కథలో బాబాయ్-అబ్బాయ్ వెంకటేశ్, రానా తమ తమ పాత్రలతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలని జనం ఆసక్తి ఉన్నారు.