ది ఫ్యామిలీ మ్యాన్
సీజన్ 2లో తమిళ టెర్రరిస్టుగా నటించినందుకు ఓ పక్క సమంతను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటే… మరో పక్క దీని మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సీజన్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రియాక్షన్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, నేతలు ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాలని కోరినా కేంద్రం మాత్రం మౌనం వహించింది. దాంతో మరికొన్ని గంటల్లో ఈ వెబ్ సీరిస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదే విషయాన్ని మేకర్స్ సైతం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తమ వెబ్ సీరిస్ ట్రైలర్ లోనొ కొన్ని సన్నివేశాలను చూసి, అపోహలకు గురి కావద్దన్నది వారి మాట. ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేసిన వారిలో అత్యధిక శాతం మంది తమిళులే ఉన్నారని, ప్రధాన పాత్రలు పోషించిన ప్రియమణి, సమంత, రచయిత సుమన్ కూడా ఆ ప్రాంతం వారేనని, వారికి తమిళ సంస్కృతి, సంప్రదాయాలంటే అపారమైన గౌరవం ఉందని, కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ తమిళలను అవమానించడం అనేది తమ వెబ్ సీరిస్ లో జరగదని హామీ ఇస్తున్నారు. అయితే… అందులో నిజానిజాలు ఏమిటనేది మరి కొన్ని గంటల్లో తెలిసి పోతుంది. ఎందుకంటే… గతంలో ఏ సినిమానైనా, ఏ వెబ్ సీరిస్ నైనా స్ట్రీమింగ్ చేయాలనుకున్నప్పుడు అమెజాన్ ప్రైమ్ మిడ్ నైట్ వాటిని ప్రసారం చేయడం మొదలు పెట్టేది. ఆ రకంగా చూసినప్పుడు ఈ రోజు అర్థరాత్రి నుండి ది ఫ్యామిలీ మ్యాన్
సీజన్ 2 ప్రసారం అవుతుంది. సో… పూర్తి స్థాయిలో ఈ వెబ్ సీరిస్ ను ప్రజలు, ముఖ్యంగా తమిళులు వీక్షించిన తర్వాత దానిపై వారి స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. నిజానికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరూ వివాదాలకు తెరతీయాలనే ఆలోచన చేయరు. ఇప్పటికే కరోనా కారణంగా సమాజం బలహీనమై ఉన్న నేపథ్యంలో ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశాలను సినిమాలు, వెబ్ సీరిస్ లలో చూపించి సమాజాన్ని మరింత ఇబ్బందికి గురి చేయరన్నదే అందరి ఆలోచన. ది ఫ్యామిలీ మ్యాన్ -2
విషయంలోనూ అదే జరుగుతుందేమో చూడాలి.