(జూన్ 8న నటుడు గిరిబాబు పుట్టినరోజు)
గిరిబాబులోని నటుడు నవ్వించాడు, కవ్వించాడు, ఏడ్పించాడు అన్నిటినీ మించి పలుచిత్రాలలో విలన్ గా భయపెట్టాడు. నవతరం చిత్రాలలో తాతయ్యగా, అంకుల్ గా అలరిస్తున్న గిరిబాబు ఆరంభంలో హీరో వేషాలు వేయాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయన అసలు పేరు యెర్రా శేషగిరిరావు. ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబుకు ఎలాగైనా వెండితెరపై కనిపించాలనే అభిలాష ఉండేది. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు వేస్తూ ఉండేవారు. మిత్రులు ఏదో ఒకరోజున వెండితెరపై వెలిగిపోతావని ఆయనను ప్రోత్సహించారు. ‘జగమేమాయ’ చిత్రంతో గిరిబాబు తెరంగేట్రం చేశారు. ఆ తరువాత అనేక చిత్రాలలో విలన్ గా నటించారు. కొన్ని సినిమాలలో కేరెక్టర్ యాక్టర్ గానూ రాణించారు. మరికొన్ని చిత్రాలలో కామెడీ కూడా పండించారు. తనకంటూ చిత్రసీమలో ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారు.
నాటి మేటి అగ్ర హీరోలందరి చిత్రాలలోనూ గిరిబాబు నటించి ఆకట్టుకున్నారు. గిరిబాబు, మురళీమోహన్, మోహన్ బాబు మంచి మిత్రులు. ‘జయభేరి పిక్చర్స్’బ్యానర్ ను స్థాపించి, ఆ పతాకంపై “దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపుదాడి, పసుపు-కుంకుమ” వంటి చిత్రాలను నిర్మించారు గిరిబాబు. తరువాత ‘రణరంగం’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. తన చిన్నకొడుకు బోసుబాబును హీరోగా పరిచయం చేస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఇంద్రజిత్’ తెరకెక్కించారు. 2008లో “నీ సుఖమే నే కోరుతున్నా” అనే చిత్రానికీ దర్శకత్వం వహించారు. అయితే నిర్మాతగానే గిరిబాబు కాసింత సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలేవీ అలరించలేదు. దర్శకుడు కొమ్మినేనితో ఆయన నిర్మించిన ‘దేవతలారా దీవించండి, సింహగర్జన’ ఆదరణ పొందాయి. ఆయన పెద్దకొడుకు రఘుబాబు ప్రస్తుతం తెలుగు చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ నవ్వులు పండిస్తున్నారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి గిరిబాబు సిద్ధంగానే ఉండడం విశేషం!