బాక్సాఫీస్ రిజల్ట్ తో సంబంధం లేకుండా కొన్ని మ్యూజికల్ హిట్స్ ఎప్పటికీ జనం మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉంటాయి. అలాంటి వాటిలో సల్మాన్ ఖాన్, మనీషా కొయిరాల జోడీగా నటించిన ‘ఖామోషీ’ని గుర్తు చేసుకోవచ్చు. నిజానికి ఈ సినిమా పేరు వినగానే వీరికంటే ముందుగా నానా పటేకర్, సీమా బిశ్వాస్ గుర్తుకు వస్తారు. ఇందులో మూగ, చెవిటి పాత్రల్లో ఆ ఇద్దరూ అద్భుతమైన అభినయం ప్రదర్శించారు. వారి కూతురుగా మనీషా నటన సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో హెలెన్ పాత్ర సైతం ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తొలి చిత్రం ‘ఖామోషీ’ కావడం విశేషం. మొదటి సినిమాలోనే ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు సంజయ్ లీలా భన్సాలీ. 1996 ఆగస్టు 9న విడుదలయిన ‘ఖామోషీ: ద మ్యూజికల్’ టైటిల్ కు తగ్గట్టుగానే సంగీతంతో ఎంతగానో ఆకట్టుకుంది.
ఫ్లావీ బ్రగాంజా, జోసెఫ్ భార్యాభర్తలు. ఇద్దరూ మూగ,చెవిటి వారు. వారికి యానీ, శ్యామ్ అనే ఇద్దరు పిల్లలు. వారికి మాటలు వస్తాయి. జోసెఫ్ తల్లి మారియా బ్రగాంజా. గోవాలో నివసిస్తూ ఉంటారు. మారియా కారణంగా పిల్లలకు సంగీతమంటే అభిమానం పెరుగుతుంది. యానీ తన తమ్ముడు శ్యామ్ మరణంతో సంగీతంపై అనాసక్తి పెంచుకుంటుంది. ఆమె జీవితంలో రాజ్ ప్రవేశించడంతో మళ్ళీ గాయనిగా మారుతుంది. రాజ్, యానీ పెళ్ళి చేసుకుంటారు. వారికి పుట్టిన బాబుకు తన తమ్ముని జ్ఞాపకంగా శ్యామ్ అని పేరు పెట్టుకుంటుంది. రాజ్ క్రిస్టియన్ కాదని మొదట్లో జోసెఫ్ అతణ్ణి తన అల్లునిగా అంగీకరించడు. తరువాత యానీ, రాజ్ ను చేరదీస్తారు. వారి బాబుతో ఫ్లావీ, జోసెఫ్ ఆనందంగా ఉన్న సమయంలో రాజ్, యానీ ప్రమాదానికి గురవుతారు. యానీ కోమాలోకి పోతుంది. రాజ్ ఆవేదన, కన్నవారి ప్రేమ మళ్ళీ ఆమె స్పృహలోకి వచ్చేలా చేయడంతో కథ ముగుస్తుంది.
హిమానీ శివ్ పురి, రఘువీర్ యాదవ్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయిందనే చెప్పాలి. ఈ చిత్రానికి జతిన్ – లలిత్ సంగీతం సమకూర్చగా పది పాటలను మజ్రూ సుల్తాన్ పురి రాశారు. హిందీ సినిమా స్వర్ణయుగం నుంచీ పాటలు రాస్తున్న మజ్రూ ఈ సినిమాలోనూ తన కలం బలం చూపించారు. “బాహో మే దార్మియా…”, “ఆంఖో మే క్యా…”, “గాతే థే పెహ్లే అకేలే…”, “జానా సునో హమ్ తుమ్ పే మర్తే హై…”, “ఆజ్ మై ఉపార్…”, “యే దిల్ సున్ రహా హై….” , “సాగర్ కినారే భీ దో దిల్ హై ప్యాసే…”, “మౌసమ్ కే సర్గమ్ కో సున్…”, “షింగా లింగా…”, “హుయా హో…” అంటూ మొదలయ్యే పది పాటలూ అలరించాయి. “గాతే థే పెహలే అకేలే…” పాటలో హెలెన్ చేసిన నృత్యం, సన్నివేశాల చిత్రీకరణ ఆ రోజుల్లో ఎన్నో ప్రశంసలు అందుకున్నాయి. పలు ఫిలిమ్ ఫేర్, స్క్రీన్ అవార్డులను సొంతం చేసుకుందీ చిత్రం.