నేడు యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ పుట్టిన రోజు. తన బాబాయి సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) అడుగుజాడల్లో నడుస్తూ, తెలుగు చిత్రసీమలో తనకూ, తమ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు నాగవంశీ. బర్త్ డే వేడుకులకు దూరంగా ఉండే నాగవంశీ సైలెంట్ గా తన పనిలో తాను నిమగ్నమైపోయారు. సూర్యదేవర రాధాకృష్ణ హారిక అండ్ హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మిస్తూనే, నాగవంశీకి సితార ఎంటర్ టైన్ మెంట్స్ బాధ్యతలను అప్పగించారు. సీనియర్ ఫిల్మ్ పర్సనాలిటీ పీడీవీ ప్రసాద్ సహకారంతో నాగవంశీ జైత్రయాత్ర ప్రారంభించారు.
విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా, మారుతీ దర్శకత్వంలో తొలియత్నంగా 2016లో ‘బాబు బంగారం’ వంటి వినోదాత్మక చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. ఆ తర్వాత మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ను అదే పేరుతో 2016లోనే నాగచైతన్య హీరోగా రీమేక్ చేశారు. అది తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. అక్కడ నుండి వరుసగా ‘శైలజారెడ్డి అల్లుడు, జెర్సీ, రణరంగం, భీష్మ, రంగ్ దే’ వంటి చిత్రాలను నిర్మించారు నాగవంశీ. ఇందులో ఒక్క ‘రణరంగం’ మినహా మిగిలిన చిత్రాలన్నీ పంపిణీదారులకు లాభాలను అందించాయి. ఇక సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రతిష్ఠను పెంచిన ‘జెర్సీ’ చిత్రం ఇప్పుడు హిందీలోనూ రీమేక్ అవుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఈ సంస్థ అడుగుపెడుతోంది.
చక్కని కథను ఎంచుకోవడంతో పాటు దానికి తగిన నటీనటులు సెలక్ట్ చేసుకోవడంలోనూ నాగవంశీ తనదైన ప్రతిభను కనబరుస్తారు. అందుకనే ఆయా చిత్రాలు, అందులోని పాత్రలు అంతగా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ లో మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ ఒకటి రూపుదిద్దుకుంటోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయప్పనుమ్ కోషియుమ్’కు ఇది రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకుడు. నాగశౌర్యతో ‘వరుడు కావలెను’తో పాటు సిద్దు జొన్నలగడ్డతో ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం నిర్మిస్తున్నారు నాగవంశీ. అలానే సిద్ధు హీరోగా మలయాళ చిత్రం ‘కప్పెల’ రీమేక్ నూ ఇటీవల ప్రారంభించారు. ఇవే కాకుండా క్రేజీ కాంబినేషన్ లో మరో నాలుగు ప్రాజెక్ట్స్ నూ నాగవంశీ సెట్ చేస్తున్నారు. చాలామంది నిర్మాతల మాదిరి కేవలం ఫైనాన్షియల్ వ్యవహారాలకు పరిమితం కాకుండా స్టోరీ సెలక్షన్ నుండి మూవీ ప్రమోషన్ వరకూ తనదైన మార్కు చూపించడం నాగవంశీ ప్రత్యేకత. పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్న ఈ యంగ్ ప్రొడ్యూసర్ నుండి మరిన్ని విజయవంతమైన, అర్థవంతమైన చిత్రాలను ప్రేక్షకులు ఆశించొచ్చు.