కరోనా, ఓమిక్రాన్, డెల్టా వంటి వైరస్ ల కారణంగా పరిస్థితులు చాలా రాష్ట్రాలలో అదుపులో లేకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన ‘ట్రిపుల్ ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా చిత్రాల విడుదలను దర్శక నిర్మాతలు వాయిదా వేశారు. అయితే… ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా థియేటర్లలోనే మూవీని విడుదల చేస్తామని స్పష్టం చేసిన ‘విక్రాంత్ రోనా’ నిర్మాతలు జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ సైతం ఇప్పుడు తమ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే… ఈ సినిమాను ఫిబ్రవరి 24న వివిధ భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాల్సింది.
కానీ పరిస్థితులు బాగోక పోవడం, కరోనా తీవ్రత వల్ల ఏర్పడిన కొత్త నియమ నిబంధనల కారణంగా తమ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నామని, అయితే థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను ప్రేక్షకులకు ఇవ్వాలనుకునే నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు తెలిపారు. కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘విక్రాంత్ రోనా’ సినిమాను త్రీడీలో అనూప్ భండారి తెరకెక్కించారు. నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.