NTV Telugu Site icon

Hero Raviteja Birthday: ‘ధమాకా’ చూపించిన మాస్ మహరాజా!

Raviteja

Raviteja

Hero Raviteja Birthday: మాస్ మహరాజా రవితేజ ఓ సినిమాలో ఉన్నారంటే, అందులో ఆయన పాత్ర వినోదం భలేగా పండిస్తుందని ప్రేక్షకులు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే రవితేజ కూడా ఎంటర్ టైన్ మెంట్ కే పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. గత సంవత్సరం రవితేజ నటించిన చిత్రాలలో ‘ధమాకా’ యేడాది చివరలో వచ్చి భలేగా సందడి చేసింది. ఇక సంక్రాంతి సంబరాల్లో మెగాస్టార్ చిరంజీవితో కలసి ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ పండించిన వినోదం కూడా జనాన్ని భలేగా ఆకట్టుకుంది. అందులో చిరంజీవి టైటిల్ రోల్ పోషించినా, రవితేజ ఉన్న కారణంగా ‘వాల్తేరు వీరయ్య’ను కొందరు ‘టూ మెన్ షో’ అంటున్నారు. ఈ యేడాది ఆరంభంలోనే మాస్ మహరాజా ఆ తీరున సందడి చేయడం ఆయన అభిమానులకు ఆనందం పెంచుతోంది.

బాల్యంలోనే అమితాబ్ బచ్చన్ సినిమాలు చూసి, సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు రవితేజ. సంపన్నుల కుటుంబంలోనే జన్మించినా, తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించాలనుకొని చెన్నై వైపు పరుగు తీశారు. కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో నటించారు, కొన్ని సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గానూ పనిచేశారు. ఏ పాత్ర దొరికినా అందులో పరకాయ ప్రవేశం చేయడానికి సై అనేవారు. ఇక ఔట్ పుట్ కూడా అదే రేంజ్ లో అందించేవారు. అందుకే రవితేజలోని నటుణ్ణి మెచ్చి కొందరు అదే పనిగా పాత్రలు ఇవ్వసాగారు. రవితేజ సైతం తన శక్తివంచన లేకుండా అవకాశం ఇచ్చిన వారు నిరుత్సాహపడకుండా నటించి మెప్పించేవారు. అలా సాగుతున్న సమయంలో శ్రీను వైట్ల దర్శకునిగా తానేమిటో నిరూపించుకొనే ప్రయత్నంలో ‘నీ కోసం’ తెరకెక్కించారు. అందులో రవితేజనే హీరోగా ఎంచుకున్నారు. ఆ సినిమా పలు బాలారిష్టాలు దాటి మొత్తానికి జనం ముందు నిలచింది. చిత్రంగా ప్రేక్షకుల మదిని గెలిచింది. ఆ సినిమాతో రవితేజకు హీరోగా మంచి గుర్తింపు లభించింది.

Vani Jayaram : వాణీ జయరామ్ సిగలో ‘పద్మ’భూషణం!

రవితేజకు స్టార్ గా బ్రేక్ నిచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. రవితేజతో పూరి తెరకెక్కించిన “ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి” చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. రవితేజను టాలీవుడ్ స్టార్స్ లో ఒకరిగా నిలిపాయి. ఇక రవితేజను ఉత్తమనటునిగా నిలిపింది కూడా పూరి జగన్నాథ్ రూపొందించిన ‘నేనింతే’ చిత్రమే కావడం విశేషం! శ్రీను వైట్ల కూడా రవితేజతో వినోదాల విందు చేశారు. సురేందర్ రెడ్డి సక్సెస్ కోసం సతమతమవుతున్న సమయంలో ‘కిక్’తో కిక్కునిచ్చిందీ రవితేజనే. మాస్ మసాలా డైరెక్టర్ గా నేడు పేరొందిన బోయపాటి శ్రీను తొలి సినిమా ‘భద్ర’లోనూ రవితేజనే కథానాయకుడు. ఆ సినిమా సైతం జనాన్ని విశేషంగా మురిపించింది. ఇలా పలువురితో కలసి విజయాన్ని పంచుకున్నారు రవితేజ. రాజమౌళి రెండు సినిమాల్లో రవితేజలోని టాలెంట్ ను అద్భుతంగా వినియోగించుకున్నారు. ‘విక్రమార్కుడు’లో విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజలో అంతకు ముందు జనం చూడని కొత్తకోణాన్ని ఆవిష్కరించారు. అందులోనే అత్తిలి సత్తిబాబు పాత్రను తనదైన శైలిలో పండించారు రవితేజ. సునీల్ హీరోగా రాజమౌళి రూపొందించిన ‘మర్యాద రామన్న’లో సైకిల్ కు రవితేజతో డబ్బింగ్ చెప్పించడం మరో విశేషం. ప్రస్తుతం తాను అన్నగా భావించే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ఆయన తమ్మునిగా నటించి మరీ మురపించారు రవితేజ.

Padma Awards 2023: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

రవితేజలోని వాయిస్ ను రాజమౌళి పసికట్టినట్టే, ఆయనలో ఓ గాయకుడూ దాగున్నాడని సంగీత దర్శకుడు థమన్ పట్టేశారు. ‘బలుపు’ చిత్రంలో తొలిసారి రవితేజ నోట “కాజల్ చెల్లివా…కరీనాకు కజినివా…” పాటను పలికించారు. ఆ తరువాత థమన్ స్వరకల్పనలోనే తెరకెక్కిన ‘పవర్’లో “నోటంకి నోటంకి…” పాట పాడి పరవశింప చేశారు రవితేజ. ఆపై “రమ్ పమ్ బమ్…” అంటూ ‘డిస్కో రాజా’లో అదే థమన్ బాణీల్లోనే గానం చేసి మురిపించారు. చాలా రోజుల తరువాత రవితేజకు హిట్ గా నిలిచన ‘రాజా ది గ్రేట్’లోనూ చిత్ర దర్శకుడు పట్టు పట్టి రవితేజతో పాట పాడించారు. సాయికార్తీక్ సంగీతంలో రూపొందిన “రాజా ది గ్రేట్…” టైటిల్ సాంగ్ కూడా జనాన్ని కట్టిపడేసింది. ఇలా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగుతున్న రవితేజ ఈ యేడాది మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలతో పాటు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందే మూవీలోనూ రవితేజ కథానాయకునిగా కనికట్టు చేయనున్నారు. ఈ సినిమాల్లోనూ రవితేజ తనదైన బాణీ పలికిస్తూ జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.