తెలుగు చిత్రసీమలో తనదైన వాణి వినిపించి, తనకంటూ ఓ బాణీని ఏర్పరచుకున్న మధురగాయని వాణీ జయరామ్ కీర్తి కిరీటంలో పద్మభూషణ్ అవార్డు చోటు చేసుకోవడం సంగీత ప్రియులందరికీ ఆనందం పంచుతోంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రప్రభుత్వం వాణీ జయరామ్ కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ వార్త వినగానే దేశవిధేశాల్లోని వాణీ జయరామ్ అభిమానుల ఆనందం అంబరమంటింది. వాణీ జయరామ్ ప్రతిభకు కేంద్రం తగిన సమయంలో సరైన అవార్డును ప్రదానం చేస్తోందని పలువురు సంగీతాభిమానులు ప్రశంసిస్తున్నారు.
తమిళనాట పుట్టి, ముంబైలో తన గళవిన్యాసాలను వినిపించి, తెలుగునేలపై సంగీతప్రియులను పరవశింపచేశారు వాణీజయరామ్. బాల్యం నుంచీ సంగీతం పట్ల అభిలాష కలిగిన వాణీజయరామ్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రంగరామానుజ అయ్యంగార్ వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. కర్ణాటక సంగీతంలో సాధన చేసిన వాణీ జయరామ్ కేవలం ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే ఆల్ఇండియా రేడియోలో గానంచేసి మురిపించారు. పట్టాపుచ్చుకున్న తరువాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. 1967లో హైదరాబాద్ లోనూ ఆమె బ్యాంక్ ఉద్యోగిగా ఉన్నారు. పెళ్ళయిన తరువాత ఉత్తరాదికి వెళ్ళిన వాణిని ఆమెభర్త కూడా ఎంతగానో ప్రోత్సహించారు. అలా కొన్ని హిందీ చిత్రాలలో వాణి పాట మధురం పంచింది. ముఖ్యంగా జయబాధురికి నటిగా ఎంతో పేరు సంపాదించి పెట్టిన ‘గుడ్డి’లో వాణీ జయరామ్ పాడిన “బోలే రే పపిహరా…” పాట ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంది. ప్రతిభావంతులు ఎక్కడ ఉన్నా ప్రోత్సహించే సంగీత దర్శకులు ఎస్.పి.కోదండపాణి 1973లో తాను స్వరకల్పన చేసిన ‘అభిమానవంతులు’లో “ఎప్పటి వలె కాదురా నా స్వామీ…” అనే పాటను పాడించారు. ఆ పాటతోనే తెలుగువారి మదిని గెలిచారు వాణి. తరువాతి రోజుల్లో కేవీ మహదేవన్, రాజన్ నాగేంద్ర, సుసర్ల దక్షిణామూర్తి, ఎమ్మెస్ విశ్వనాథన్, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా వంటి సంగీత దర్శకులు వాణి జయరామ్ ను ఎంతగానో ప్రోత్సహించారు. నటదర్శకులు యన్టీఆర్ తన సొంత చిత్రాలలో వాణీ జయరామ్ తో ఏదో ఒక పాట పాడించేవారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమద్విరాటపర్వము’లోని “రమ్మని పిలిచిందిరో ఊర్వశి…” అనే గీతం, ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’లోని “శృంగార రసరాజమౌళి…” అంటూ సాగే పాటను వాణీ జయరామ్ ఆలపించారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ కూడా పలు మధురమైన గీతాలను వాణీజయరామ్ తో పాడించి, జనాన్ని ఆకట్టుకొనేలా చేశారు. ‘శంకరాభరణం’లో వాణీజయరామ్ పాడిన పాటలు ప్రేక్షకులన విశేషంగా అలరించాయి. 1979లో వాణిని ఉత్తమగాయనిగా నంది అవార్డు అందుకొనేలా చేశాయి ‘శంకరాభరణం’ పాటలు.
తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలతో పాటు గుజరాతీ, మరాఠీ, మార్వాడీ, హర్యానీ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లిష్ భాషల్లోనూ వాణీజయరామ్ తన గళంతో మధురం పంచారు. 1975లో కె.బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’లో పాటలు పాడి జాతీయ స్థాయిలో ఉత్తమగాయనిగా నిలిచారు వాణీజయరామ్. 1979లో ‘శంకరాభరణం’తోనూ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారామె. 1991లో కె.విశ్వనాథ్ ‘స్వాతికిరణం’లో “ఆనతినీయరా…” పాటతో మరోమారు జాతీయ ఉత్తమగాయనిగా నిలిచారు. దాదాపు పదివేల పాటలు పాడిన వాణీ జయరామ్ కు ‘పద్మభూషణ్’ అవార్డు ప్రకటించడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గానకోకిల మరిన్ని ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకోవాలని పలువురు అభిలషిస్తున్నారు.