కరోనా సెకండ్ వేవ్ కారణంగా మన స్టార్ హీరోలు దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు దాని ఉధృతి కాస్తంత తగ్గుముఖం పట్టడంతో ఆగిన ప్రాజెక్ట్స్ ను మళ్ళీ పట్టాలెక్కించడం మొదలెట్టారు. ఆరోగ్యానికి అత్యధికంగా ప్రాధాన్యమిచ్చే మాస్ మహరాజా రవితేజా తన ‘ఖిలాడీ’ చిత్రం షూటింగ్ కు ఆమధ్య కామా పెట్టాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడటంతో తిరిగి వచ్చేవారంలో షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. అలానే ఇటీవల రచయిత శరత్ మండవ దర్శకత్వంలో సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సైతం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఒక్క వారంలో ‘ఖిలాడీ’ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి, వెంటనే రవితేజా ఇంకా పేరు నిర్ణయించని శరత్ మండవ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడట. ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సంగీత దర్శకుడు శామ్ సిఎస్ స్వరాలు అందించబోతున్నాడు. మొత్తం మీద ఈ యేడాది ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహరాజా… ఆ విజయపథంలో కొనసాగడానికి బాగానే కష్టపడుతున్నాడు.