‘బాలికా వధు’ టీవీ సీరియల్ తెలుగు అనువాదం ‘చిన్నారి పెళ్ళికూతురు’తో మనవాళ్ళకు బాగా చేరువై పోయింది అవికా గోర్. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’ చక్కని విజయాన్ని అందుకోవడంతో అవికా వెనుదిగిరి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఆమె నటించిన ‘సినిమా చూపిస్త మావా’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాలూ సక్సెస్ సాధించాయి. విశేషం ఏమంటే… ఇప్పుడు అవికా గోర్ చేతిలో దాదాపు ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. అందులో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలే ఆరు కావడం విశేషం. ఇవాళ అవికా గోర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతలు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ పోస్టర్స్, మోషన్ పోస్టర్స్, గ్లిమ్స్ విడుదల చేశారు. ఇందులో కొన్ని సినిమాలకు అవికా గోర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
అవికా గోర్ నటిస్తున్న సినిమాల వివరాల్లోకి వెళితే, చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా గీతా ఆర్ట్స్ 2, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఫిలిమ్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రచయిత శ్రీధర్ సీపాన దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అవికా హీరోయిన్ గా నటిస్తోంది. అవికా బర్త్ డే గ్లిమ్స్ ను టీమ్ విడుదల చేసింది. అలానే ఆది సాయికుమార్ హీరోగా బలవీర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ‘అమరన్’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. చాప్టర్ 1, ఇన్ ది సిటీ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో అవికా గోర్ హీరోయిన్. ఇక సత్యకృష్ణ ప్రొడక్షన్స్ సంస్థ హేమంత్ దర్శకత్వంలో నిర్మించే సినిమాకు సత్యకృష్ణ, అవికాగోర్ నిర్మాతలు వ్యవహరించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుంది.
సాయిరోనక్ హీరోగా మురళీ గంథం దర్శకత్వంలో భోగేంద్ర గుప్తా ‘పాప్ కార్న్’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్నారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను అవికా గోర్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాకూ అవికా గోర్ సహ నిర్మాతగా ఉన్నారు. నవీన్ చంద్ర, అవికాగోర్ జంటగా కార్తీక్ తిపురని దర్శకత్వంలో యలమంచి రవిచంద్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. దీనికి శేఖర్ చంద్ర సంగీతదర్శకుడు. అనురాగ్ కొణిదెల హీరోగా సత్యం ద్వారపూడి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న సినిమాలోనూ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా ‘దిల్’ రాజు… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీలో నాగచైతన్య, రాశిఖన్నాతో పాటు అవికా గోర్ సైతం నటిస్తోంది. ఆ రకంగా ఇటు నటిగా, నిర్మాతగా కూడా అవికా గోర్ ఫుల్ బిజీగా ఉండిపోయింది.