బాలీవుడ్ లో బయోపిక్స్ జోరు కొనసాగుతోంది. క్రికెటర్స్ మొదలు సైంటిస్టుల దాకా అందరి జీవిత కథలు తెరకెక్కించేస్తున్నారు. దర్శకనిర్మాతల ఉత్సాహానికి తగ్గట్టే బాలీవుడ్ స్టార్స్ కూడా బయోపిక్స్ లో ఛాన్స్ వస్తే అస్సలు వదలటం లేదు. ఆమీర్, అక్షయ్ లాంటి హీరోలు, కంగనా, విద్యా బాలన్ లాంటి హీరోయిన్స్ అందరూ చకచకా బయోపిక్స్ చేసేస్తున్నారు. మరి బయటి రంగాల్లోని ప్రముఖుల జీవితాల్ని తెరకెక్కిస్తోన్న బాలీవుడ్ తమ స్వంత లెజెండ్స్ ని పక్కన పెడుతుందా? లేట్ లేడీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ బయోపిక్ తాజాగా అనౌన్స్ అయింది…
సరోజ్ ఖాన్ 2020 జూలై 3న ఆరోగ్య సమస్యలతో మరణించారు. తన 71 ఏళ్ల జీవితంలో ఆమె మూడవ ఏట నుంచే సినిమా రంగంలో గడిపారు. దాదాపు మూడు దశాబ్దాలు కొరియోగ్రాఫర్ గా కొనసాగిన ఆమె 3500 పాటలకి నృత్య దర్శకత్వం వహించారు. లెజెండ్రీ స్టేటస్ సంపాదించుకున్న ఆమె మాధురీ దీక్షిత్ తో కలసి పని చేసిన ప్రతీ పాటా సూపర్ డూపర్ హిట్టే!
సరోజ్ ఖాన్ జీవిత కథ వెండితెర మీదకి తేబోతున్నట్టు, ఆమె తొలి వర్ధంతి సందర్భంగా, టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ప్రకటించాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలైందని చెప్పిన ఆయన సరోజ్ ఖాన్ కూతురు, కొడుకు తమకు అందిస్తోన్న సాయానికి ధన్యవాదాలు తెలిపాడు. స్క్రిప్ట్ పూర్తికాగానే నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు ప్రకటిస్తామని ఆయన అన్నాడు. చూడాలి మరి, సరోజ్ ఖాన్ పాత్రని బిగ్ స్క్రీన్ పై ఏ బాలీవుడ్ బిగ్ సెలబ్రిటీ పోషిస్తారో!