హైదరాబాదులోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ 12 (శనివారం) రాత్రి జరిగిన ఫిలిం ఫైనాన్షియర్ బంగారు బాబు కుమారుడి వివాహ వేడుకకు సినీ, రాజకీయ, ఫార్మా రంగాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్షియర్ ఆర్. సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు (ఈవీ రెడ్డి రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి వివాహ మహోత్సవం బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత సీతారామిరెడ్డి – రామ సీత దంపతుల కుమార్తె శిరీషతో జరిగింది. కాగా బంగారు బాబుకు సినిమా రంగంతో ఉన్న విశేష అనుబంధం నేపథ్యంలో ఈ వివాహ వేడుకకు ఎందరెందరో సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు శుభాశీస్సులు అందజేశారు.
ప్రముఖ నటీనటులు డాక్టర్ మురళీమోహన్, నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, సహజనటి జయసుధ, ప్రముఖ నటులు, నిర్మాత, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి, సాయికుమార్, రఘు బాబు, దాసరి అరుణ్ కుమార్, తదితరులతోపాటు అగ్రశ్రేణి నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, కే.ఎస్. రామారావు, సి. కళ్యాణ్, సునీల్ నారంగ్, జెమినీ కిరణ్ ,మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవి, యెర్నేని నవీన్, లగడపాటి శ్రీధర్, డాక్టర్ వెంకటేశ్వరరావు, కే.ఎల్. కుమార్ చౌదరి, కే. అచ్చిరెడ్డి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్, బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు. వీరితోపాటు ప్రముఖ దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్, ఎస్ వి కృష్ణారెడ్డి, రేలంగి నరసింహారావు, బి.గోపాల్ వంటి దిగ్గజ దర్శకులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అలాగే ఎన్టీవీ అధినేత చౌదరి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.