‘నిన్నిలా… నిన్నిలా’ చిత్రంలో జంటగా నటించిన అశోక్ సెల్వన్, రీతువర్మ మరోసారి జోడీ కడుతున్నారు. నిత్యామీనన్ కీలక పాత్ర పోషించిన ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంది. తెలుగు వర్షన్ ను బీవీఎస్ఎన్ ప్రసాద్… ఓటీటీ ద్వారా ఆ మధ్య విడుదల చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే… అశోక్ సెల్వన్, రీతువర్మతో వైకామ్ 18 స్టూడియోస్, రైజ్ ఈస్ట్ స్టూడియోస్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీతో ఆర్. కార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోమవారం మొదలైన ఈ సినిమాలో ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ అపర్ణ బాలమురళీ, జీవితా రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఈ చిత్రానికి జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీనీ, గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీకి ‘వేర్ యూ థింక్ ఇట్ ఎండ్స్, ఇట్ బిగెన్స్’ అనేది ట్యాగ్ లైన్. ఇదిలా ఉంటే హీరో అశోక్ సెల్వన్ చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయి. ‘హాస్టల్’ అనే తమిళ సినిమాలో అశోక్ సెల్వన్ తో పాటు ప్రియానీ భవానీశంకర్, సతీశ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలానే మోహన్ లాల్ పిరియడ్ డ్రామా ‘మరక్కర్’లోనూ అశోక్ సెల్వన్ నటిస్తున్నాడు.