బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రెండు రోజుల క్రితమే వచ్చింది. అయితే… ‘బెల్ బాటమ్’ విషయంలో ‘అంతకుమించి..’ అంటున్నారు నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న త్రీడీలోనూ రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్ సన్నాహాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ సరసన వాణీ కపూర్, లారాదత్త, హుమా ఖురేషీ నటిస్తున్న ఈ చిత్రాన్ని రంజిత్ ఎం తివారీ తెరకెక్కించారు. కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఈ సినిమాను శరవేగంగా చిత్రీకరించారు.
అయితే… కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది. కానీ సినిమాకు ఏర్పడిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని దీనిని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని పూజా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భావించింది. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను రెట్టింపు చేసేందుకు 2డీతో పాటు 3డీ వెర్షన్ ను కూడా ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శించాలనే నిర్ణయానికి నిర్మాణ సంస్థ వచ్చింది. మరి కొవిడ్ 19 థర్డ్ వేవ్ గురించి భయాందోళనలు చెందకుండా ఎంత మంది థియేటర్ కు వచ్చి ఈ సినిమాను చూస్తారో! వేచి చూడాలి!!