పలు తమిళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన షమన్ మిత్రు (43) గురువారం ఉదయం కరోనాతో చెన్నయ్ లో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పరీక్ష చేయగా ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో హాస్పటల్ లో చేర్చారు. అయితే ఆయన కరోనా నుండి బయటపడలేకపోయారు. భార్య, ఐదేళ్ళ కుమార్తె ఉన్న షమన్ మిత్రు మంచి నటుడు కూడా. 2019లో వచ్చిన ‘తొరత్తి’ చిత్రంలో షమన్ మిత్రు హీరోగా నటించడమే కాకుండా దానిని నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షమన్ మిత్రు గొర్రెల కాపరిగా కనిపించడం కోసం గెడ్డం పెంచి, బరువు తగ్గారు. మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యకళ నాయికగా నటించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.