(జూన్ 27తో ‘ప్రేమకానుక’కు 40 ఏళ్ళు)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో ‘ప్రేమాభిషేకం’తో జైత్రయాత్ర సాగించారు. అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘ప్రేమాభిషేకం’ దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందింది. అదే పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అదే ఏడాది వచ్చిన చిత్రం ‘ప్రేమకానుక’. ‘ప్రేమ’ అన్న మాట ఏయన్నార్ కు భలేగా అచ్చివచ్చిందనే చెప్పాలి. అదే తీరున ‘ప్రేమకానుక’లోనూ ప్రేమ చోటుచేసుకుంది. అక్కినేని సోలో హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన చిత్రం ఇదొక్కటే అని చెప్పవచ్చు.
ఇందులో హీరో రాజశేఖర్ ఓ పెయింటర్ గా ఓ ఊరికి వెళతాడు. గౌరీ అనే ఓ అందమైన అమ్మాయి బొమ్మలు గీస్తాడు. అది నచ్చని ఆ ఊరి షావుకారు జంతువుల జగన్నాథమ్ కూతురు సంధ్య పెయింటింగ్స్ ను పాడు చేస్తుంది. రాజశేఖర్ గత జన్మలో తాను సంధ్య ప్రేమించుకున్నామని, అందుకే ఇప్పుడు ఇలా కలుసుకున్నామని చెబుతాడు. రాజా, సంధ్య ప్రేమించుకుంటారు. జగన్నాథమ్ మేనల్లుడు మోహన్ నీచుడు. అతను ఎలాగైనా సంధ్యను తనదానిగా చేసుకోవాలని చూస్తుంటాడు. రాజా వల్ల సంధ్య గర్భవతి అవుతుంది. రాజాకు గౌరీకి సంబంధం ఉందని చూపిస్తారు జగన్నాథమ్ అండ్ కో. అపార్థం చేసుకున్న సంధ్య గర్భస్రావానికి పాలు పడుతుంది. అప్పుడు రాజా తన మతిస్థిమితం లేని అక్కను చూపిస్తాడు. ఆమె అలా కావడానికి కారకుడు జగన్నాథమే అని చెబుతాడు. తన తండ్రి నీచత్వం తెలుసుకున్న సంధ్య, రాజాకు సహకరిస్తుంది. గౌరీని మోహన్ రేప్ చేస్తాడు. అతణ్ణి చట్టానికి పట్టిస్తాడు రాజా. జగన్నాథమ్ తనను క్షమించమంటాడు. చివరకు రాజా సీబీఐ ఆఫీసర్ అని తెలుస్తుంది. మోహన్ ను పట్టుకోవడం కోసమే పెయింటర్ గా రాజా అవతారమెత్తి ఉంటాడు. చివరకు రాజా, సంధ్య పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
‘ప్రేమాభిషేకం’లో జోడీ కట్టి అలరించిన ఏయన్నార్, శ్రీదేవి ఇందులోనూ మరోమారు మురిపించారు. మధుమాలిని, రావుగోపాలరావు, సత్యనారాయణ, మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, చలపతిరావు, నర్రా, మనోరమ, సుభాషిణి, మాస్టర్ హరీశ్ నటించారు. గుహనాథన్ కథ అందించిన ఈ చిత్రానికి సత్యానంద్ సంభాషణలు, ఆచార్య ఆత్రేయ పాటలు, చక్రవర్తి సంగీతం సమకూర్చారు. “అయ్యారే తుంటరోడా…”, “ఈ కొండ కోనల్లో…”, “చెమ్మ చెక్కా…”, “వంట చేసి చూపిస్తా…”, “జంతర్ మంతర్…” సాంగ్స్ జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.