YS Sharmila Reacts On TRS MLAs Complaint To Speaker Pocharam Srinivas: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే! రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తోన్న షర్మిల.. ఈ సందర్భంగా మంత్రులు – ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. స్పీకర్ చర్యలు తీసుకుంటే, తాము న్యాయబద్ధంగా ముందుకెళ్తామని అన్నారు. పాదయాత్ర ఆపేస్తే తాము మరోలా ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు.
ఇదే సమయంలో మంత్రి నిరంజన్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ.. ‘‘ఆయన మరదలు అని అవమానిస్తే ఊరుకోవాలా? మాకు ఆత్మ గౌరవం ఉండదా’’ అంటూ షర్మిల నిలదీశారు. తన ప్రసంగాల్లో ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజలు చర్చించుకుంటున్న అంశాలనే ప్రస్తావించానన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో, తాము ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మంత్రులకు గానీ, ఎమ్మెల్యేలకు గానీ పాలమూరి, రంగారెడ్డి జిల్లాలపై ఉన్న ప్రేమెంత? అంటూ ప్రశ్నించారు. తమ పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యేల చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవాలేమీ లేవన్నారు. తాను ప్రస్తావించిన విషయాల్లో ఏ ఒక్క అబద్ధమూ లేదని, అవన్నీ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులేనని పేర్కొన్నారు. ప్రజలే కాదు, విలేకరులు సైతం ఈ ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలంటే భయపడుతున్నారని.. గళం విప్పిన వారిపై కేసులు పెట్టడమో, ఉద్యోగాల నుంచి తొలగించడమో చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఇన్నాళ్లు వాళ్ల అవినీతి కొనసాగిందని, తాము తెలంగాణకి వచ్చి వారి తప్పుల్ని ఎత్తిచూపుతున్నామని షర్మిల చెప్పారు. తెలంగాణలోని ఎమ్మెల్యేలు చేస్తోందని దోపడీ రాజ్యమని, దానిపై ఇక్కడి ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం దారుణమని అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణలో ఎంతో అవినీతి జరిగిందని.. ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ గానీ, బీజేపీ పార్టీ గానీ ఎందుకు ఆ అవినీతిని లేవనెత్తలేదని ప్రశ్నించారు. వాళ్లు చేయలేని విషయాల్ని తాను చేస్తే, అది దారుణమంటారా? అని నిలదీశారు. వాళ్లు దౌర్జన్యం చేస్తే పర్వాలేదా? నిజం మాట్లాడితే దారుణమా? అని అడిగారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల్ని కొన్నట్టు.. తనని కొనడం వాళ్లకు వీలు కాదని షర్మిల తేల్చి చెప్పారు.