సూర్యాపేట జిల్లా కోదాడ నియోజక వర్గంలోని అనంతగిరి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన సుపరిపాలన ప్రతి గడపను.. ప్రతి గుండెను తాకిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన మంచి మనసుతో ఆలోచించి అద్భుతమైన పథకాలు అమలు చేసి చూపించారని, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్,ఆరోగ్యశ్రీ, పక్కా ఇళ్లు ఇలా ఎన్నో పథకాలు వైఎస్సార్ ను ప్రజలు ఇప్పటి గుర్తు పెట్టుకున్నారని ఆమె అన్నారు. 2004,06,08లో మూడు సార్లు ఉద్యోగ నోటిఫికేషన్లు వైఎస్సార్ ఇచ్చారని, ఒకే సారి జంబో డీఎస్సీ ఇచ్చారన్నారు. వైఎస్సార్ హయాంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు లేవని, ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ లా ఆలోచన చేయాలన్నారు. ఇప్పడు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రగా ఉండి ఎన్ని నోటిఫికేషన్‌లు ఇచ్చారో చెప్పాలన్నారు.
2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ఇప్పుడు 30 వేల ఉద్యోగులకు నోటిఫికేషన్లు అని చెప్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం అని ఉద్యమంలో చెప్పారని, ఉద్యోగాలు వస్తాయని యువత పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు ఉద్యోగాలు లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదని, స్కాలర్ షిప్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని ఆమె మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చదివి కూలీ పనికి పోతున్నారని, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే తల్లి దండ్రులు అల్లాడి పోతున్నారన్నారు.