YS Sharmila Again Fires On Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఆయన కేటీఆర్ కోవర్ట్ అని, ఈ విషయం గాంధీ భవన్ మొత్తం తెలుసని ఆరోపించారు. వైఎస్సార్ర తనని పార్టీలోకి పిలిచారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. అసలు వైఎస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్సార్ గెలిచిన పార్టీనే కాంగ్రెస్‌లో కలిసిపోయిందన్నారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారని.. పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్‌కి పట్టలేదని కౌంటర్ ఇచ్చారు. ‘నీలా పార్టీలు మారి.. రాజకీయ వ్యభిచారం చేసే సంస్కృతి వైఎస్ఆర్‌ది కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నీలా పార్టీలు మారే అలవాటు వైఎస్సార్‌కి లేదన్న షర్మిల.. పొద్దున TRS, మధ్యాహ్నం బీజేపీ, సాయంత్రం కాంగ్రెస్ అంటూ ఎవరు పిలిస్తే అక్కడికి పోతావంటూ జగ్గారెడ్డిపై వ్యాఖ్యానించారు. ‘‘వైఎస్సార్ నీ శీలం కరాబు చేశాడా? పార్టీలు మారినందుకు ఎన్నిసార్లు శీలం దోచుకున్నారు జగ్గారెడ్డి?’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కరోజైనా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని ప్రశ్నించావా? అంటూ నిలదీశారు. ఈ సంగారెడ్డి ప్రజలకు కోసం ఒక్క రోజైనా కొట్లాడావా? అని ప్రశ్నించారు. జగ్గారెడ్డి వల్ల సంగారెడ్డికి ఏమాత్రం లాభం లేదని.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. ‘‘ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న నువ్వు.. రేపు ఏ పార్టీలో ఉంటాడో నీకే క్లారిటీ లేదు.. నువ్వా నా గురించి మాట్లాడేది’’ అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా.. బీజేపీ, టీఆర్ఎస్ విసిరిన బాణం షర్మిల అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించినప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. అసలు జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడోనంటూ కౌంటర్ ఇచ్చారు. తాను వైఎస్సార్ విసిరిన బాణమంటూ చెప్పారు. షర్మిల కౌంటర్‌కు మళ్లీ ప్రెస్‌మీట్ నిర్వహించిన జగ్గారెడ్డి.. షర్మిల జగన్ వదిలిన బాణం కాదు, వదిలేసిన బాణమని తిరుగు కౌంటరిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె మండిపడుతూ.. పై విధంగా కౌంటర్లు ఇచ్చారు.