మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు ఓ యువకుడు పెట్టిన వాట్సాప్ స్టేటస్ కారణం అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… అచ్చలాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన 17 ఏళ్ల యువతి హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఉగాది పండగ సందర్భంగా ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే యువకుడు అజయ్ ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. అనంతరం వాటిని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. వాటిని చూసిన యువతి తల్లిదండ్రులు ఆ ఫొటోలను స్టేటస్ నుంచి తొలగించాలని యువకుడిని కోరారు.
అయితే యువకుడు మాత్రం సదరు ఫోటోలను తొలగించడానికి నిరాకరించాడు. దీంతో యువతి మనస్తాపానికి గురైంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. ఈ విషయం గమనించిన యువతి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కాగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.