హైదరాబాద్ శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించిన రాందేవ్ బాబా.. చినజీయర్ స్వామిపై ప్రశంసలు కురిపించారు. రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్‌స్వామి చరిత్రలో నిలిచిపోతారని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. భారత వాస్తు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకునేవారు కచ్చితంగా రామానుజాచార్యుల దివ్యక్షేత్రాన్ని సందర్శించాలని సూచించారు. తాను వీలైనన్నిసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటానని రాందేవ్ బాబా చెప్పారు.
అటు భారతీయ సంస్కృతిలో అసమానత, అన్యాయం ఉందని కొందరు పదేపదే వాదిస్తుంటారని.. సనాతన ధర్మంపై వాళ్లు ఆరోపణలు చేస్తుంటారని.. అలాంటి వామపక్షవాదులకు సమతా మూర్తి కేంద్రాన్ని చూపించాలని రాందేవ్ బాబా హితవు పలికారు. సమతా మూర్తి కేంద్రాన్ని వారు సందర్శిస్తే ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయన్నారు. కాగా లక్ష మంది విద్యార్థులకు సనాతన ధర్మాన్ని బోధించేందుకు వీలుగా పతంజలి గ్లోబల్ విశ్వవిద్యాలయాన్ని తలపెట్టామని.. 10వేల మంది విద్యార్థుల కోసం గురుకులం ఏర్పాటు చేస్తున్నామని రాందేవ్ బాబా తెలిపారు.
