హనుమకొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను వరంగల్ కమిషనరేట్ పోలీసులు చేదించారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాల ఆధారంగా సాగుతున్న ఈ భారీ రాకెట్‌కు సంబంధించి వరంగల్ సీపీ శ్వేత మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా వందలాది అమాయకులను ముంచిన ఈ ముఠాకు చెందిన 22 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
రూ. 8 వేల కమిషన్‌తో మ్యూల్ ఖాతాల దందా
బాధితులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, వారి పేర్ల మీద నిందితులు బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు సీపీ శ్వేత తెలిపారు. ఆపై రూ. 6 వేల నుండి రూ. 8 వేల వరకు కమిషన్ ఆశచూపి బాధితుల బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎమ్ కార్డులు, చెక్‌బుక్‌లను కొనుగోలు చేసేవారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన అక్రమ సొమ్మును మళ్లించడానికి ఈ ‘మ్యూల్ ఖాతాలను’ వినియోగించేవారని దర్యాప్తులో తేలింది. వరంగల్ కేంద్రంగా మొదలైన ఈ నెట్‌వర్క్ ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల వరకు విస్తరించినట్లు విచారణలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా 185 కేసులతో లింకులు
ఈ ముఠా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించగా దేశవ్యాప్తంగా నమోదు అయిన 185 సైబర్ నేర కేసులతో వీరికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని ప్రధాన సూత్రధారుల కోసం గాలించిన పోలీసులు, ఒడిశా , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇద్దరు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు కీలక నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
భారీగా బ్యాంక్ కిట్లు, వాహనాలు స్వాధీనం
నిందితుల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున సాంకేతిక పరికరాలు , బ్యాంక్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 216 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 22 ఏటీఎమ్ కార్డులు, 8 చెక్‌బుక్‌లతో పాటు అనేక సిమ్ కార్డులు, స్మార్ట్‌ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, క్యూఆర్ స్కానర్లు , రెండు విలాసవంతమైన కార్లు ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ బ్యాంక్ ఖాతాలను, వ్యక్తిగత వివరాలను ఇతరులకు విక్రయించవద్దని ఈ సందర్భంగా సీపీ శ్వేత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

