Bhadrakali Bonalu: ప్రతిష్టాత్మకంగా వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. అయితే, ఇటీవల భద్రకాళి బోనాలకి సంబంధించి కొంత మంది నుంచి అభ్యంతరాలు రావడంతో పాటు సోషల్ మీడియాలో ఈ విషయంపై తప్పుడు వార్తలు ప్రచురితమైన నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను.. పవిత్రమైన అమ్మవారికి ముడి పెట్టి కొందరు ఉద్ధేశపూర్వకంగానే ఇబ్బందులు సృష్టిస్తారమోనని భావించి.. ఈ కార్యక్రమంలోకి అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారనే అనుమానంతో బోనాల నిర్వహణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: Vidadala Rajini: ఎన్నికేసులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు..
కాగా, భద్రకాళి అమ్మవారి టెంపుల్ పరిధిలో శాఖాహార బోనాలే ఉంటాయని స్థానిక ఈవో, వేదపండితులు, ప్రభుత్వం పలుమార్లు తెలియజేసిందని మంత్రి కొండా సురేఖ తెలిపింది. ఆగమ శాస్త్రం ప్రకారమే, వేద పండితుల నిర్ణయం మేరకు భద్రకాళి ఆలయంలో బోనాలు నిర్వహించాలని అనుకున్నాం.. అయితే, కొంతమంది మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయని పేర్కొన్నారు. రాజకీయాల కోసం భక్తుల మనస్సుల్లో దుష్ప్రచారం నింపడం మంచిది కాదన్నారు. ఈ నెల 22న భద్రకాళి అమ్మవారి టెంపుల్ లో నిర్వహించాల్సిన బోనాలు రద్దు చేయడం జరిగిందని మంత్రి సురేఖ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అయితే, స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని.. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని, భద్రకాళి అమ్మవారి బోనాల నిర్వహణపై సంప్రదింపులు జరిపిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు మంత్రి సురేఖ వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులకు తెలియజేయదలచినది.. అమ్మవారి పట్ల నిష్కల్మషమైన భక్తి, సంప్రదాయాల పరిరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. కొంతమంది ప్రచారం చేసిన సమాచారం వల్ల ఏర్పడిన అపోహలకు తావులేదన్నారు. భద్రకాళి అమ్మవారి విశిష్టతను పెంపొందించేందుకు, ప్రభుత్వం వేద పండితుల సలహా మేరకు, ప్రజాప్రతినిధుల సూచనల ఆధారంగా తగిన సమయంలో బోనాలను వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని కొండా సురేఖ చెప్పుకొచ్చింది.