మన సంప్రదాయంలో ఎన్నో విశిష్టతలు వున్నాయి. చనిపోయింది మనిషైనా, చివరికి జంతువైనా దానికి అంతిమ సంస్కారాలు చేయడం పరిపాటి. చనిపోయిన ఒక వానరానికి అంత్యక్రియలు జరిపారు ఓ గ్రామస్తులు. చనిపోయింది కోతే కదా అని వదిలేయలేదు అక్కడి ప్రజలు. దానిని దైవస్వరూపంగా భావించి అత్యంత వైభవంగా అంతిమ యాత్ర నిర్వహించారు. గ్రామంలోని ప్రజలందరూ ఆ యాత్రలో పాల్గొనడం విశేషం.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఓ వానరం మరణించింది. మనం వానరాన్ని సాక్షాత్తూ హనుమంతుడి స్వరూపం అని భావించి కొలుస్తాం. మరణించిన ఆ వానరానికి హైందవ సంప్రదాయం ప్రకారం గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అంత్యక్రియలు నిర్వహించారు. వానరం అంటే మాకెంతో భక్తి. గ్రామంలో ప్రమాదం వల్ల చనిపోయిన వానరానికి ఉత్తర క్రియలు జరిపించాం. మంగళవారం రోజు కూడా ఉపశాంతి కూడా నిర్వహించారు. ఇలా చేయడం వల్ల తమ గ్రామానికి మంచి జరుగుతుందని పూజారులు తెలపడంతో ఆ పనిచేశామంటున్నారు గ్రామ సర్పంచ్ వడ్ల కొండ అరుణ ఆనంద్, గ్రామస్తుడు అరె కృష్ణ.
