నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. ఉపాధి హామీ అధికారిపై ఓ సర్పంచ్ పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. జిల్లాలోని కుబీర్ మండలంలోని సాంగ్లీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈజీఎస్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం సర్పంచ్ సాయినాథ్ ఉపాధి హామీ కార్యాలయానికి వచ్చారు. గ్రామంలో గ్రావెల్ వర్క్ విషయమై మాస్టర్ రిజిష్టర్‌లో సంతకం పెట్టాలని టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై సర్పంచ్ సాయినాథ్ ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు రాజు నిరాకరించాడు. దీంతో ముందే పక్కా ప్లాన్ ప్రకారం తీసుకువచ్చిన పెట్రోల్ ను అతని పై పోసి నిప్పటించాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది, స్థానికుల సాయంతో రాజును భైంసాలోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.