ఇంటి నిర్మాణం కోసం ముగ్గుపోయాలంటే వారికి ముడుపులు చెల్లించాల్సీందే. ముడుపు ముట్టజెప్పకపోతే ముప్పుతిప్పలు తప్పవు మరి. పిల్లర్ల ఎత్తును బట్టి వసూల్ రాజాలు రేటు ఫైనల్ చేస్తారు. అడిగినంత ఇవ్వకపోతే ఆగమాగమే. బీపాస్ లో దరఖాస్తు చేరితే చాలు సంబరాలు చేసుకుంటున్నారట ఆ వసూల్ రాజాలు.. అక్కడ ఇల్లుకట్టుకొవాలంటే మున్సిపాలిటీ అనుమతి కంటే ఆనేతల అనుమతే ముఖ్యంగా మారింది.
నల్లగొండ పట్టణంలో ఇంటి నిర్మాణాలకు బీపాస్ లో దరఖాస్తు చేసుకుని నిబంధనల ప్రకారం అనుమతులు ఉంటే సరిపోదు. ఖచ్చితంగా స్దానిక నేత ఆశీస్సులు ఉండాలని ఇళ్ల నిర్మాణం దారులు పేర్కొంటున్నారు. ఇంటి నిర్మాణం జరిగినా లేక ఎక్కడ వాణిజ్య భవనాల నిర్మాణం జరిగినా వాటిపై కన్నేసిన కొందరు సీనియర్ కౌన్సిలర్లు ఆప్రాంతంలోనే గద్దల్లా చక్కర్లు కొడుతూ తిరుగతారు. మరి కొందరైతే ఒకఅడుగు ముందుకేసీ తమ వార్డు కాకపోయినా భారీ నిర్మాణాలు కనిపిస్తే చాలు పిల్లర్లపైనే గద్దల్లా వాలిపోతున్నారు.
పిల్లర్లు ఎత్తు లేచే కొద్ది ఆస్దాయిలోనే సమర్పించుకొవాలి. పిల్లర్లు లేవగానే అప్పటి వరకు చుట్టుపక్కల చక్కర్లు కొట్టిన పక్షులు పిల్లర్లపై వాలిపోయి బేరం మొదలు పెడతారని చెప్పుకుంటున్నారు.బేరం చాలా రీజనబుల్ అని డిస్కౌంట్ లు కూడా ఉండవని సింగిల్ వర్డ్ సింగిల్ పేమెంట్ అని స్పష్టంగా దాపరికం లేకుండా చెప్తారు. మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారులకు మన దరఖాస్తు చేరిన వెంటనే వీళ్లదందా మొదలవుతుందట. తాము చెప్పినట్టు వినకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇంటి యజమానికి రాత్రి, పగలు చుక్కలు చూపిస్తామని బెదిరింపులకు పాల్పడుతారు. ముగ్గురు నలుగురు సీనియర్ కౌన్సిలర్లు ఇటువంటి వివాదాస్పద పనులకు కేరాఫ్ గా నిలుస్తున్నారు.
నూతన నిర్మాణాలకు ముగ్గు పోస్తే చాలు గద్దల్లా వాలిపోయి వసూళ్లకు తెగబడుతున్నారు. ముడుపులు ఇవ్వాల్సిందేనని… ముడుపులు అడిగినంత ముట్టకపోతే ముప్పుతిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు.. కుదిరిన బేరం ప్రకారం అడిగినంత ఇవ్వకపోతే నిబందనల పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులను రంగంలోకి దింపుతున్నారట. కొద్ది కాలంగా నల్లగొండ మున్సిపాలిటీలో స్తబ్దుగా ఉన్న ఈదందాను కొందరు సీనియర్ కౌన్సిలర్ లు దగ్గరుండి నడిపిస్తుండటంతో నయా దందాతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
రాజకీయంగా సుదీర్ఘ అనుభం ఉన్న కౌన్సిలర్ లే దిగజారి వసూళ్లకు పాల్పడటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది… వీరి వ్యవహార శైలి వార్డుల్లో ప్రజలకు తలనొప్పిగా మారిందట. అన్ని అనుమతులు ఉన్నా ఈ అక్రమ వసూళ్లు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.కొద్దిరోజుల క్రితం ఓ సీనియర్ కౌన్సిలర్ వ్యవహారంతో విసుగుచెందిన ఇంటి యజమాని బెదిరింపులకు పాల్పడుతున్న కౌన్సిలర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో వసూల్ రాజాల పంచాయితీ బహిరంగమైంది. విషయం తెలుసుకున్న స్దానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ మున్సిపాలిటీ పరువు పోతుందని ఫిర్యాదు దారునితో మాట్లాడి జరిగిన ఇబ్బందిపై వివరణ ఇచ్చుకున్నారు. మరోసారి ఇటువంటి ఘటన మరెక్కడా జరగదని బాధితులకు హామీ ఇచ్చారట.
ఈవిధంగా గద్దల్లా వాలిపొతున్న వారి జాబితాలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన కొందరు సీనియర్ కౌన్సిలర్లు ఉండటంతో వారిని పిలిపించుకుని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.మరోసారి అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని, తానే స్వయంగా బాధితులకు అండగా నిలబడతానని సీరియస్ గా హెచ్చరించారు. మరోవైపు కొందరు కౌన్సిలర్ ల వ్యవహారంపై మెజారీటీ కౌన్సిలర్ లు గుర్రుగా ఉన్నారు. నిజాయితీగా ప్రజల మధ్య ఉండే తమకు కొందరు చేసే అవినీతి పనుల వల్ల నల్లగొండ మున్సిపాలిటీకీ, కౌన్సిలర్ లకు చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జలగల్లా జనాలను పట్టిపీడిస్తున్న అవినీతి కౌన్సిలర్ లపై కఠిన చర్యలు తీసుకొవాలని, వచ్చే ఎన్నికల్లో ఒటు అనే వజ్రాయుధంతో వారికి బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మరికొందరు.
Tequila Pub: టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. అదుపులో 18 మంది