Site icon NTV Telugu

Congress Party: ఆయనే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు.. పార్టీ చీఫ్‌పై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి..

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.. అయితే, త్వరలోనే పూర్తిస్థాయిలో అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ తరుణంలో గాంధీయేతర కుటుంబానికి చెందిన కొందరు సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి… మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనని స్పష్టం చేశారు.. భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు ఏఐసీసీ ఎన్నికలున్నాయి.. గుజరాత్ అసెంబ్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్నాయని.. మేమంతా రాహుల్ గాంధీని ఒప్పించి ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉండేలా చూస్తామన్నారు.. ఇక, ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీయేతరవ్యక్తి వుంటాడని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Read Also: Team India: ఆసియా కప్ కోసం ఆడారా? ప్రయోగాల కోసం ఆడారా?

ఇక, రాహుల్ గాంధీనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అవుతాడు.. ఇందులో నాకు ఎలాంటి సందేహాలు లేవన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి… తెలంగాణలోకి పాదయాత్ర ఎంటరైనప్పుడు వేలాది‌మందితో రాహుల్ జోడో యాత్రకు స్వాగతం పలుకుతామన్న ఆయన.. బీజేపీని అణగదొక్కడానికి భారత్ జోడో యాత్ర ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కాగా, కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు. తమిళనాడులోని కన్యకుమారి నుంచి జమ్మూకశ్మీర్‌ వరకు 150 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల మేర సాగే ఈ సుదీర్ఘ పాదయాత్ర.. ఇవాళ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కలిసి నడుద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం.. అనే నినాదంతో రాహుల్ జోడో యాత్ర సాగనుంది. పక్షపాత రాజకీయాలకు, మతోన్మాదానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి, అసమానతలకు, జీవనోపాధి విధ్వంసానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ ఏకం చేస్తూ ఈ ర్యాలీ సాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version