లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పగటివేళల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో కరోనా ఉధృతంగా ఉండటంతో.. తొలుత నెల రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. ఆ తర్వాత మే 12 నుంచి 30 వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది. ఆ తరువాత కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదవుతుండడంతో మే 31 నుంచి సడలింపు సమయాన్ని మధ్యాహ్నం 2 వరకు పొడిగించింది. ఈ గడువు బుధవారంతో ముగియనుంది. అయితే రాష్ట్రంలో కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదవుతోందని, ప్రస్తుతం పాజిటివ్ రేటు 2 శాతమే ఉంటోందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, వైద్య ఆరోగ్య శాఖ అందించే నివేదికల ఆధారంగానే ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటున్నందున.. ఈ నెల 9 తర్వాత పగటివేళల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.