Site icon NTV Telugu

టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఆగని ట్వీట్‌ వార్‌..

ట్విట్టర్‌ వేదికగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు వార్‌ నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ దుమారం రేపుతుండగా దానికి కౌంటర్‌గా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. కేటీఆర్‌ ట్వీట్‌పై ఉదయం కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో.. ఎంఐఎంతో ఎవరు చేతులు కలిపినా వాళ్ల వ్యాఖ్యల్ని సమర్థించినట్టేనన్నారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ లక్ష్యంగా వెళ్తున్న మోడీని విమర్శిస్తురా..? అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ట్విట్టర్లోనే కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణకు ఇచ్చిన హామీలపై కిషన్‌రెడ్డి మాట్లాడాలి అని కేటీఆర్‌ అన్నారు. అనవసర విషయాలు తెరపైకి తేవొద్దు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరానికి జాతీయ హోదాపై మాట్లాడండి అని కిషన్‌రెడ్డికి చురకలు అంటించారు. మొన్న ఐటీఐఆర్‌ ఇవ్వకున్నా దిగ్గజ కంపెనీలు తెచ్చుకున్నామని, నిన్న జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకున్నామని కేటీఆర్‌ అన్నారు. నేడు కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా.. ప్రైవేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రానికి అండగా మేము.. దేశానికి దండగ మీరు.. అని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Exit mobile version