CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!

  • రూ.51 కోట్లతో 33 క్రెస్ట్ గేట్ల నిర్మాణం
  • ముగ్గురు సీఎంలతో ఘన ప్రారంభోత్సవం
  • ఆర్‌డీఎస్ వాటాపై రేవంత్ ఫోకస్
  • జలవివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చే ప్రధాన వరప్రదాయిని తుంగభద్ర డ్యామ్ సరికొత్త రూపు సంతరించుకుంది. గత 2024 వరదల్లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో, నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నిర్మించిన 33 క్రెస్ట్ గేట్లను గురువారం (జూన్ 25) ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కలిసి ఘనంగా ప్రారంభించారు. రూ. 51 కోట్ల వ్యయంతో కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే ఈ గేట్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం.

మూడు తరాల సమస్యకు శాశ్వత పరిష్కారం

గేట్ల ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ 33 గేట్ల పునరుద్ధరణ ముహూర్తం అంతర్రాష్ట్ర జలవనరుల చరిత్రలో నిలిచిపోతుంది. మూడు తరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య నేటితో తీరబోతోంది” అని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ పనితీరును కొనియాడుతూ.. తక్కువ మాట్లాడటం, వేగంగా పని పూర్తి చేయడం ఆయన ప్రత్యేకతని, ఆయన నాయకత్వంలో ఈ ప్రాంత సాగు, తాగునీటి కష్టాలన్నీ నూటికి నూరుపాళ్లు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్‌డీఎస్ వాటా, తుంగభద్ర పూడికతీతపై ఫోకస్

సభా ముఖంగా తెలంగాణ ఎదుర్కొంటున్న జల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్‌డీఎస్) కింద తెలంగాణకు ఉన్న హక్కుల్లో ప్రస్తుతం కేవలం 5 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నామని ఆయన గుర్తు చేశారు. తుంగభద్ర జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడిక సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా కేంద్రం, పొరుగు రాష్ట్రాలు చొరవ చూపాలని కోరారు.

రాజకీయాలకు అతీతంగా అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కారం

“తుంగభద్రమ్మ సాక్షిగా ఈ ప్రాంత రైతాంగ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. ఇందుకోసం పొరుగు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, తుంగభద్ర నది ఒడ్డునే కూర్చుని చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ చారిత్రాత్మక అడుగుతో అంతర్రాష్ట్ర జలవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.