TS SSC Results 2024: తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు. పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఆరు పాఠశాలల్లో సున్నా శాతం నమోదైంది.
మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో వార్షిక పరీక్షలు నిర్వహించగా.. 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పది పాలిటాల కోసం నమస్తే తెలంగాణ తెలంగాణ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది. విద్యార్థులు https://ntvtelugu.com/telangana-ssc-results-2024 వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. గతేడాదితో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. జూన్ 3వ తేదీ నుండి 13 జూన్ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ సంవత్సరము 06 పాఠశాలలు సున్నా శాతము ఫలితాలు పొందాయి. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 99.05 % ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానములో ఉందన్నారు. అదే విధముగా రాష్ట్రములో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతము అనగా 65.10 % సాధించి చివరి స్థానములో ఉందని తెలిపారు.