తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక, ప్రతినిధుల సభ ఈసారి 3 వేల మందితో జరుగనుంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ప్రిపేర్ చేసి, వారిలో ఉత్సాహం నింపేలా పార్టీ అధిష్టానం ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్టీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా మొత్తం మూడు వేల మందికి ఆహ్వానం పంపారు. ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులంతా గులాబీరంగు దుస్తులు ధరించి హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఉదయం 10 గంటల వరకు ప్రతినిధులంతా ప్రాంగణానికి చేరుకోవాలి. పేర్లు నమోదు చేసుకోవాలి. ఈసారి ప్రతినిధులకు బార్ కోడ్‌తో కూడిన ప్రత్యేక పాస్‌లను ఇచ్చారు. కోడ్‌ను స్కాన్ చేసి లోనికి అనుమతిస్తారు. పాస్‌లు లేనివారు రావొద్దని పార్టీ తేల్చి చెప్పింది.
Read Also: TS Group-1 Notification: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ఇక, ఉదయం 11 గంటలకు కేసీఆర్ వేదిక మీదకు చేరుకుని అమరవీరుల స్తూపంవద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండా ఆవిష్కరించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లాయి. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీలో చేసే తీర్మానాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈసారి 11 తీర్మానాలు ప్రవేశపెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో మూడు రాజకీయ తీర్మానాలు ఉన్నట్లు టాక్. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక లేదా కొత్త పార్టీనా, దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలపై తీర్మానాలు ఉంటాయని గులాబీ వర్గాలు అంటున్నాయి. వీటితో పాటు అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, పార్టీ సాధించిన విజయాలపై తీర్మానాలు ఉంటాయని తెలుస్తోంది.
ఇప్పటికే రెండు దఫాలుగా అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారీ కూడా జైత్ర యాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతోంది. 80,039 ఉద్యోగ నియామకాలు చేస్తామని ఇప్పటికే ప్రకటన చేసింది. సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రూపాయల సాయం… 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు.. జీవో 111 రద్దు… ధాన్యం కొనుగోళ్లు.. తదితర అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అధినేత కేసిఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక, టీఆర్ఎస్ ప్లీనరీకి వచ్చే ప్రతినిధుల కోసం 33 రకాల పసందైన వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్ మహా నగరం ముస్తాబైంది. నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల కటౌట్‌లతో అలంకరించారు.
