TRS MP Venkatesh Netha Fires On BJP: బీజేపీ ఒక డ్రామాల పార్టీ అని.. ప్రజలతో ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత ఆరోపణలు చేశారు. 5 కోట్ల 22 లక్షల రూపాయలు సుషి కంపెనీ నుంచి మునుగోడుకు వేశారని.. దీనిపై తాము ఈసీకీ, ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశామని అన్నారు. రాజగోపాల్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపనీల అకౌంట్‌ల మూడు నెలల ట్రాన్సాక్షన్‌ను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి 18 వేల కాంట్రాక్ట్‌కు అమ్ముడుపోయారని మండిపడ్డారు. ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయన నోటి నుంచి వచ్చే అబద్ధాలు మరెవ్వరికీ రావని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌పై కిషన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు. సానుభూతి కోసమే బండి సంజయ్, ఈటెల రాజేందర్, రఘునందన్‌లు వేషాలు వేశారన్నారు.
అంతకుముందు కూడా బీజేపీపై వెంకటేశ్ నేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ అంటే బక్వాస్, బద్మాష్, జూట పార్టీ అని వ్యాఖ్యానించారు. దళితులు, గిరిజలు, ఉద్యోగులు, ప్రజలందరినీ ఆ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. వరి ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్న ఆయన.. రాష్ట్ర రైతాంగ సమస్యలు బీజేపీ ఎంపీలకు పట్టవా..? అని నిలదీశారు. కల్లాలకు పోయి రైతులను గందరగోళపరచిన తెలంగాణ బీజేపీ ఎంపీలు.. ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రులు, ప్రధానితో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? అని నిలదీసిన ఆయన.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఎందుకని అమలుపరుస్తున్నారని అడిగారు. గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వెంకటేశ్ నేత తెలిపారు.