NTV Telugu Site icon

ఈటల ఆ మాట ఎందుకు చెప్పలేకపోయారు..?

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

రైతు బంధు పథకం డబ్బుల విషయంలో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి… ఈటల రాజీనామా తర్వాత ఆయన రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు ఎంత అందుకున్నది అనే లెక్కలు వైరల్‌గా మారిపోయాయి.. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన పల్లా… రైతు బంధు వద్దు అనిపించినప్పుడు సీఎం కేసీఆర్‌కు ఎందుకు చెప్పలేక పోయారంటూ ఈటలను నిలదీశారు.. ఇక, హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 25 రైతు వేదికలు నిర్మించినట్టు తెలిపారు రాజేశ్వర్‌రెడ్డి.. మరో తొమ్మిది రైతు వేదికలు ప్రారంభించుకోవాల్సి ఉందన్న ఆయన.. దేశంలో ఎక్కడ రైతు వేదికలు లేవని గుర్తు చేశారు..

మరోవైపు 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవి… కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రైతు సంక్షేమ పథకాలు వచ్చాయన్నారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఉచిత విద్యుత్, సాగు నీరు, రైతు బంధు, రైతు వేదికలు, రైతు బీమా ఇలా ఎన్నో పథకాలు కేసీఆర్ తీసుకు వచ్చారని గుర్తుచేసిన ఆయన.. రైతు పథకాలను కొందరు అవమానిస్తున్నారని మండిపడ్డారు.. భూమి లేని దళిత రైతులకు కూడ రైతు బీమా స్కీమ్ వర్తింప చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.