స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తమ్ముడు తాడికొండ సురేష్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను తాటికొండ సురేష్ లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ జనగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జంగింటి విజయలక్ష్మీ, రమేష్ దంపతులు తమ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో ఇంటి నిర్మాణం కోసం చాలా ఏళ్ల క్రితమే బేస్‌మెంట్ వరకు నిర్మించారు. అయితే వాళ్ల పనులకు స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ అడ్డుపడుతున్నట్లు బాధితులు ఆరోపించారు.
దీంతో ఇంటి పర్మిషన్ కోసం తాను గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లగా సురేష్ రూ.2 లక్షలు డిమాండ్ చేశాడని విజయలక్ష్మీ ఆరోపించింది. తమ దగ్గర అంత డబ్బు లేదని చెప్పినా వినిపించుకోలేదని.. అంతేకాకుండా తనతో అసభ్యకరంగా మాట్లాడాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన చేయి పట్టుకుని లాగాడని.. లైంగిక వేధింపులకు గురిచేశాడని కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు జనగామ డీసీపీకి బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని.. తమకు పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని విజయలక్ష్మీ దంపతులు హెచ్చరించడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.