Site icon NTV Telugu

Crime News : టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ దారుణ హత్య..

మహబూబాబాద్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. మ‌హ‌బూబాబాద్‌ 8వ వార్డు కౌన్సిల‌ర్ బానోత్‌ ర‌వినాయ‌క్ దారుణ హ‌త్యకు గుర‌య్యారు. గురువారం ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో మ‌హ‌బూబాబాద్ ప‌ట్టణంలోని ప‌త్తిపాక ప్రాంతంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ప‌త్తిపాక‌లో నూత‌నంగా నిర్మించుకుంటున్న ఇంటి ప‌నుల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన ర‌వినాయ‌క్‌పై కొంత‌మంది గుర్తు తెలియ‌ని వ్యక్తులు గొడ్డళ్లతో విచ‌క్షణార‌హితంగా దాడి చేశారు. మెడ భాగంలో దాడి జరగడంతో రవి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రవిని చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ర‌వినాయ‌క్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయిన‌ట్లుగా వైద్యులు నిర్ధారించారు. ర‌వినాయ‌క్ మృత‌దేహాన్ని ప్రస్తుతం పోస్టుమార్టంకు త‌ర‌లించారు. కొద్దిరోజులుగా కొంత‌మంది నేత‌ల‌తో బానోత్‌ ర‌వినాయ‌క్ తీవ్రంగా విభేదిస్తూ వ‌స్తున్నట్లు తెలుస్తోంది. త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని కూడా స్వయంగా కొంత‌మంది త‌న స‌న్నిహితుల‌తో ర‌వినాయ‌క్ పేర్కొన్నట్లు స‌మాచారం. ఈక్రమంలోనే ర‌వినాయ‌క్ హ‌త్యకు గురికావ‌డం గ‌మ‌నార్హం. ర‌వినాయ‌క్‌కు భార్య పూజ, ముగ్గురు పిల్లలున్నారు.

కౌన్సిలర్ హత్యకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ శరత్‌ పవర్‌ చంద్ర పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అనుమానితులు వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమికంగా రవినాయక్ హత్యకు రాజకీయ ప్రమేయం లేదని నిర్ధారించారు. రవి హత్య 11.30 నుండి 12 గంటల మధ్యలో జరిగిందని, పత్తిపక నుండి వెళుతున్న రవి మొదటి ట్రాక్టర్ తో అడ్డగించి, కారులో వచ్చిన వాళ్ళు గొడ్డలితో దాడి చేసినట్లు, ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఆర్ధిక లావాదేవీల వివాదమే హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు మహాబాబూబాద్ ఎస్పీ శరత్‌ పవర్‌ చంద్ర తెలిపారు. ఈ హత్య ఛేదించేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, దర్యాప్తు వేగం పెంచామని ఆయన తెలిపారు. ఈ దాడి స‌మ‌యంలో ర‌వినాయ‌క్ ఒంట‌రిగా ఉన్నాడని, దాడి చేసిన అనంత‌రం దుండ‌గులు ప‌రారయ్యారని, వీరిలో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.

Exit mobile version