RTC Conductor: అధికారుల ఓత్తిడో లేక కుటుంబ కలహాలో డ్యూటీలో ఉన్న కండక్టర్ బస్సులోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి బస్సులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఈసంఘటన సంచలనంగా మారింది.
మృతుడు కండక్టర్ మహేందర్ రెడ్డికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు విక్రమ్, వినయ్ ఉన్నారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు మహేందర్ రెడ్డి అనారోగ్యంతో ఉండడంతో ఆర్టీసీ డిపోలో సెలవు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే.. ఆదివారం సెలవు ఉన్నా డ్యూటీకి వచ్చాడు. ఉదయం 11 గంటలకు డ్యూటీకి వచ్చిన కండక్టర్ మహేందర్ రెడ్డి ఆర్టీసీ డిపో ఆవరణలో ఆగి ఉన్న బస్సు ఎక్కాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో తన వెంట తెచ్చుకున్న టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్యూటీకి సమయమైనా మహేందర్ రెడ్డి కనిపించకపోవడంతో తోటి ఉద్యోగులు వెతికారు. అనంతరం డిపో వద్ద ఆగి ఉన్న బస్సులో మహేందర్‌రెడ్డి ఉరివేసుకుని ఉండటాన్ని సిబ్బంది గమనించారు. దీంతో.. తోటి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సెలవులో ఉన్నా విధులకు హాజరుకావాలని అధికారులు ఒత్తిడి చేశారా? లేక కుటుంబ కలహాలతో కండక్టర్ మహేందర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా.. అసలు లీవ్ వున్న డ్యూటీకి మహేందర్ ఎందుకు వచ్చాడు? రావాల్సిందే అని అధికారులు ఒత్తిడి చేశారా? అనారోగ్యంగా వున్నా అనిచెప్పినా అధికారులు వినలేదా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఆర్టీసీ అధికారుల ఒత్తిడే కారణమా?
కండక్టర్ మహేందర్ ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ అధికారుల ఒత్తిడి వల్లే మహేందర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు
Naatu Naatu Song: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన “నాటు నాటు…”!