హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్ పెరిగిపోతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో ట్రాఫిక్ డైవర్షన్స్ కొనసాగుతున్నాయి. వారం రోజులపాటు ట్రయల్ రన్ ఉంటుందని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెం.45, జర్నలిస్టు కాలనీ మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు వుంటుంది. వాహనదారులు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు రోడ్ నెం.45 మీదుగా వెళ్లలేరు.
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వెళ్లాలంటే జగన్నాథ టెంపుల్ సర్కిల్ వద్ద రైట్ తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, కేబీఆర్ పార్కు మీదుగా చెక్ పోస్టుకు వెళ్లాలి. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలను రోడ్ నెంబర్36 మీదుగా మెట్రో పిల్లర్ నం. 1650, రోడ్ నెంబర్ 54 మీదుగా మళ్ళించారు. ఫిల్మ్ నగర్ నుంచి చెక్ పోస్టుకు వెళ్లే వాహనదారులు రోడ్ నెంబర్ 45 వద్ద లెఫ్ట్ తీసుకుని హార్ట్ కప్ కేఫ్ నుంచి కేబుల్ బ్రిడ్జి కింద యూటర్న్ తీసుకుని చెక్ పోస్టుకు వెళ్ళాల్సి వుంటుంది.
Read Also: Ramdev Baba: రాందేవ్ బాబా దిష్టిబొమ్మ దగ్ధం… మహిళా కాంగ్రెస్ ఆందోళన
కేబుల్ బ్రిడ్జి నుంచి వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వెళ్లాలంటే రోడ్ నెంబర్ 45 నుంచి కాకుండా రోడ్ నెంబర్ 54 లో లెఫ్ట్ తీసుకుని రోడ్ నెంబర్ 36 ఫ్రీడమ్ పార్క్ నుంచి మెట్రో పిల్లర్ నం. 1663 వద్ద యూటర్న్ తీసుకొని చెక్ పోస్టుకు వెళ్ళాలి. ఫిల్మ్ నగర్ నుంచి ఒమేగా హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నం.12 వైపు వెళ్లేవారు జర్నలిస్ట్ కాలనీ వద్ద యూటర్న్ తీసుకుని ఫిల్మ్ నగర్ జంక్షన్ మీదుగా వెళ్లాలి. కేబుల్ బ్రిడ్జి నుంచి బీఎన్ఆర్ హిల్స్, ఖాజాగూడ, ఫిల్మ్ నగర్ జంక్షన్ కు వెళ్లేవారు రోడ్ నెంబర్45లోని హార్ట్ కప్ కేఫ్ వద్ద యూ టర్న్ తీసుకుని.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి రోడ్ నెంబర్.51, పక్షి సర్కిల్, న్యాయవిహార్ నుంచి ఎడమ వైపునకు వెళ్లి ఫిల్మ్ నగర్ జంక్షన్ కు చేరుకోవాలి.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్12, ఫిల్మ్ నగర్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెంబర్45 మీదుగా కాకుండా ఫిల్మ్ నగర్ రోడ్ ఎడమవైపునకు వెళ్లి భారతీయ విద్యాభవన్ వద్ద యూటర్న్ తీసుకొని ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద ఎడమవైపు నుంచి జర్నలిస్ట్ కాలనీ రోడ్ నం. 45 వెళ్ళాలని పోలీసులు సూచించారు. వారం పాటు ఈ డైవర్షన్స్ వుండనున్నాయి. ఇదిలా వుంటే.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైవర్షన్స్ తో వాహనదారులు ఆగమాగం అవుతున్నామంటున్నారు. రోడ్ నెంబర్ 45 లో ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగింది. అక్కడ వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. అరకిలోమీటర్ దూరం ప్రయాణానికి మూడునాలుగు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని, కార్యాలయాలకు వెళ్ళేవారు ఆలస్యం అవుతుండడంతో తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Australia Beach Case: కుక్కు చేసిన ఆ చిన్న తప్పే.. ఆ యువతి హత్యకు కారణం