బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు రోజులుగా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో బాసర విద్యార్థుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అందులో.. బాసర ఐఐఐటీ విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ ఆందోళన చేస్తున్నారని, వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మరో వైపు మీ పుత్ర రత్నం మంత్రి కేటీఆర్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జూన్ 15న ట్వీట్ చేశారని, ఇది చెప్పి కూడా 5 రోజులు అయిందని, ఎటువంటి అతీగతీ లేదన్నారు. దాదాపు 8 వేల విద్యార్థులు అందోళన చేస్తుంటే భోజనం పెట్టమని హెచ్ఓడీలు బెదిరింపులకు పాల్పపడుతున్నారని, మరో వైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు సఫలం సోమవారం నుంచి విద్యార్ధులు తరగతులకు హాజరవుతారని సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు.
మీ రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి బీఆర్ఎప్ పేరిట గంటల తరబడి ఏసీ రూముల్లో చర్చించుకోవడానికి, తెలంగాణను వ్యతిరేకించిన శక్తులతో సమావేశానికి సమయం ఉంటుందని, తిరిగి అధికారంలోకి రావడానికి చేయాల్సిన కుట్రలు కుతంత్రాలపై పీకే వంటి వారితో చర్చించడానికి కూడా సమయం ఉంది మీకు, ప్రత్యర్ధులను అణదొగ్గడానికి అనుసరించాల్సిన వ్యూహాలకు సమయం లభిస్తుంది. కానీ బాసర ఐఐఐటీ విద్యార్ధులు వారం రోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళనలు చేస్తుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం 5 నిమిషాల సమయం కేటాయించే తీరిక కూడా దొరకడం లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.